అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం
దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్
ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి
చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం
ఆర్‌ఆర్‌ఆర్ మంత్రతో నాలాల అభివృద్ధి, క్రమబద్ధీకరణ : శాసనమండలిలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ సంకల్పం, ఆలోచనా విధానం ఇన్‌క్లూజివ్ గ్రోత్ (సమ్మిళిత అభివృద్ధి) నేడు ప్రతి శాఖలో కనిపిస్తోందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మౌలిక వసతులు, శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటే పెట్టుబడులు వస్తాయని.. తద్వారా ఉత్పన్నమయ్యే రెవెన్యూ ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుందన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ప్రకటించిన సమయంలో అనేక అనుమానాలు ఉండేవని, ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ అందరినీ కలిపి ముందుకు తీసుకుపోతూ ఇక పాతనగరం, కొత్తనగరం అన్న తేడా లేకుండా ముందుకు సాగుతున్నామన్నారు. సిఎం కెసిఆర్ అందరినీ సమతుల్యంగా కలిపి ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. చెన్నై, కలకత్తాను దాటి హైదరాబాద్ దేశంలో టాప్ 4కి ఎగబాకిందని తెలిపారు. పాతబస్తీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను స్పృశించారు. జిహెచ్‌ఎంసీ పరిధి 675 స్కేర్ కిలోమీర్ల పరిధి ఉండగా.. మూసికి దక్షణం వైపున ఉన్న ఆరు నియోజకవర్గాలు, మరో రెండు నియోజకవర్గాలు కలిపి 102 స్కేర్ కిలోమీటర్ల పరిధిలో పాతబస్తీ(అసలు హైదరాబాద్) ఉందన్నారు.
చార్మినార్, మక్కా మసీదు, హైకోర్టు, సాలార్‌జంగ్ మ్యూజియం తదితర ప్రాచీన పర్యాటక ఆకర్షిత ప్రాంతాలను అభివృద్ధి చేస్తూనే మౌలిక వసతులకల్పనకు సంబంధించి దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 1030 కోట్లు, హెచ్‌ఎండబ్లూఎస్ రూపంలో 2579 కోట్లు, టూరిజం 7 కోట్లు, విద్యుత్ శాఖ ద్వారా 208 కోట్లు, స్కూల్, ఎడ్యుకేషన్ ద్వారా 108 కోట్లు ద్వారా పాతనగరంలో 3394.31కోట్లు (సంవత్సరానికి 390 కోట్లు వెచ్చించగా.. గత ఏడేళ్లలో పాతనగరానికి 14,887.86 కోట్లు (సంవత్సరానికి 2 వేల కోట్లు) టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఖర్చుపెట్టిందని వివరించారు. చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, మూసీనది సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చాంద్రాయణగుట్ట నుంచి మూసారాంబాగ్ వరకు పది కిలోమీటర్ల మేర విస్తరించిన మురికి కాలువకు సంబంధించి మూడు వేలమంది ఆక్రమణదారులను తొలగించి 8 కిలోమీటర్ల మేర విస్తరణ చేసి రిటైనింగ్ వాల్ నిర్మించుకున్నారని, మరో రెండు కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉందని.. ఇందుకు పూనుకున్న వారికి తన అభినందనలు తెలియజేశారు.
పాతనగరంలో మరిన్ని బ్రిడ్జిలు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూసీ మీద కొత్తగా 400 కోట్ల రూపాయల వ్యయంతో 14 బ్రిడ్జిలు నిర్మించబోతున్నామని తెలిపారు. 55 కిలోమీటర్ల మూసీ ప్రవాహం, బ్రిడ్జెస్, శుద్ధిచేసిన నీరు రావాలన్నారు. ఈసా, మూసా రెండు కలిపే నది(బాపూఘాట్ దగ్గర కలుస్తుంది) నీరు నిల్వ ఉండలేని పరిస్థితి ఉందన్నారు. చెక్‌డ్యామ్‌లను ప్రతిపాదిస్తున్నామన్నారు. ఈ రకంగా సమగ్రమైన ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఏదైనా సమయం పడుతుందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఒక లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ మాదిరిగా మూసీ నది ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నామన్నారు. 2019లోనే మూసీ సుందరీకరణ పనులు జరగాల్సి ఉందని, ఎల్పీనగర్ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి నేతృత్వంలో ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగిందని, అయితే కరోనా మహమ్మారి విజృంభణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో అది సాధ్యపడలేదని తెలిపారు.
కొండపోచమ్మ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు గోదావరి నీరు పారేలా ఓ బృహత్తర ఆశయంతో ముందుకు సాగుతున్నామన్నారు. నదుల అనుసంధానం అంటారు.. ఈ విధంగా నదుల అనుసంధానానికి తాము ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే మూసీకి వరదనీరు ప్రవాహం ఉండబోదని, ఒక స్విచ్ వేస్తే చాలు నీటి ప్రవాహం వెలువడుతుందని తద్వారా మూసీ నదికి వరద సమస్యే ఉత్పన్నం కాబోదన్నారు. ఎస్‌ఆర్‌డిసి మొదటి దశలో రూ.26.35 కోట్ల వ్యయంతో ఉప్పుగూడాలోని ఆర్‌యుబి(రోడ్ ఓవర్ బ్రిడ్జి) వద్ద ఒక పని పూర్తయిందన్నారు. ఓవైసీ హాస్పిటల్ జంక్షన్, బహదూర్‌పురా జంక్షన్, చాంద్రాయణగుట్ట జంక్షన్ వద్ద గ్రేడ్ సెపరేటర్, నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి ఒవైసీ జంక్షన్ వరకు, ఫలక్ నుమా వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి, శ్రాస్తిపురం వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఆరాంఘర్ నుంచి జూపార్కు వరకు ఫ్లై ఓవర్ దగ్గర రూ.15.45 కోట్ల వ్యయంతో 7 పనులు నడుస్తున్నాయన్నారు. రూ.452 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ఎస్‌ఆర్‌డిసి దశ2 క్రింద 4 పనులకై 612 కోట్ల ప్రతిపాదనలు చేశామన్నారు. పాత నగరంలో రోడ్ల మౌలిక సదుపాయాల పని ఇంత పెద్ద ఎత్తున ప్రారంభం కావడం ఇదే మొదటిసారి అని అన్నారు. సమగ్ర రోడ్ నిర్వహణ కార్యక్రమం (సిఆర్‌ఎంపి) కింద జిహెచ్‌ఎంసి పరిధిలో ఆర్‌ఓడబ్లులో ఆ చివర నుండి ఈ చివరి వరకు ఆర్టిరియల్ రోడ్ల ఏర్పాటు నిర్వహణకూ 2019 సంవత్సరంలో ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తదనుసారంగా ప్రభుత్వం 5 సంవత్సరాలకు గానూ 709.49 కి.మీ పొడవు వున్న ప్రధానమైన ఆర్టీరియల్ రోడ్ల నిర్వహణకై 7 ప్యాకేజీలలో రూ.1839 కోట్ల మొత్తానికి ఆమోదం ఇచ్చిందన్నారు. చార్మినార్‌ల క్రింద పాతనగరం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న ప్రధానమైన రోడ్ల నిర్వహణను ఎం.వెంకటరావు ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ వారికి కేటాయించామన్నారు. నాంపల్లి, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాల క్రింద ఉన్న ప్రధానమైన రోడ్ల నిర్వహణ పనుల్ని కెఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు అప్పగించామన్నారు.
పాతనగరం పరిధిలోని ప్రధానమైన రోడ్లలో మొత్తం 154 కి.మీ లను నిర్వహిస్తూ ఉంటే దానిలో ఇప్పటివరకు 113.32 కి.మీని ఫుట్‌పాత్‌ల నిర్వహణ, సెంట్రల్ మీడియన్, కెర్బ్ పెయింటింగ్, లేన్ మార్కింగ్, ఊడ్చుట (ఎం/సి ద్వారా) పచ్చదనం నిర్వహణతో సహా రీకార్పెటింగ్ చేశామన్నారు. ఇంకా రీకార్పెటింగ్ పని కొనసాగుతూ ఉందన్నారు. ఇప్పటిదాకా దీనికి గానూ 118.06 కోట్ల మొత్తం ఖర్చు చేశామని వెల్లడించారు. నాలాల ఆధునీకరణ, క్రమబద్ధీకరణకు సంబంధించి ఆర్‌ఆర్‌ఆర్ (రిమూవ్ ది ఎంక్రోచ్‌మెంట్స్, రిహాబిటేట్ ఫ్యామిలీ, రీహాబిటేట్ డిస్‌ప్లేస్ అండ్ రిటైన్ వాల్) మంత్రతో ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 12 ఫ్లై ఓవర్స్/ఆర్‌యంబిలు/ఆర్‌ఒబిలు కొరకై భూసేకరణ నిమిత్తం 327.65 కోట్లు ఖర్చు చేశామన్నారు. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.166.35 కోట్లు కూడా ఖర్చు చేస్తామని తెలిపారు. మొత్తంగా 494 కోట్లు అవుతుం దన్నారు.
సాధారణ రోడ్ల కొరకు 2014 నుంచి నేటి వరకు పాత నగరంలో 40 రోడ్ల విస్తరణకు భూసేకరణ నిమిత్తం 250 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలను కలుపుకుంటూ జోన్3 ఏరియాలకై మురుగునీటి నెట్‌వర్కును బలోపేతం చేసేందుకు మురుగునీటిపారుదల ప్రాజెక్టును కూడా అమలు నిమిత్తం మంజూరు అయిందని, ఇది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందన్నారు. మూసికి దక్షణం వైపున ఉన్న ఎన్‌టిపి ప్రాజెక్టుల 1355 కోట్ల వ్యయంతో (అనుపాతంగా) 6 పెద్ద ఎన్‌టిపిలను స్థాపించడం, అలాగే 615 కోట్ల వ్యయంతో (అనుపాతంగా) మూసీకి ఉత్తరం వైపున ఎన్‌టిపిల ప్రాజెక్టును కూడా అమలు నిమిత్తం మంజూరు చేశామన్నారు. మొత్తం మంజూరైన సీవరేజ్ ప్రాజెక్టులు రూ.2267 కోట్ల వరకు వాస్తయన్నారు. ఈ విధంగా పాత నగర నియోజకవర్గాలకై 2014 నుండి 2021 సంవత్సరాల మధ్య(నేటి వరకు) నీటి సరఫరా, సివరేజ్ ప్లాన్డ్ పథకాలపై రెగ్యులర్ విస్తరణ, అభివృద్ధి పనులు మొత్తం వ్యయం చేపట్టి అమలు జరిపామన్నారు. అలాగే మంజూరైన ప్రాజెక్టులు అన్నీ కలిపి 3794 కోట్లుగా తెలుస్తుందన్నారు.
30 ఎంజిడి కలిపి పాతనగరం పరిధిలో మొత్తం నీటి సరఫరాని పెంచడం ద్వారా ప్రస్తుతం ఓ అండ్ ఎం డివిజన్‌లోని పాతనగరపు డివిజన్‌లు 1,2,3,4 లకు సగటున 130 ఎంజిడి అందిస్తున్నామన్నారు. మరోవైపు జిహెచ్‌ఎంసీ పరిధిలో పేదలకు 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. ఇక మెట్రోరైలు అంశంపై స్పందిస్తూ మంత్రి సుదీర్ఘ వివరణనిచ్చారు. మెట్రోను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. జిఎంఆర్‌కు ఇచ్చినట్లుగానే తమకు సాఫ్ట్‌లోన్ ఇవ్వండని మెట్రో అభ్యర్థించిందన్నారు. మెట్రోను పాతబస్తీ మళ్లింపు అంశం మీద మాట్లాడుతూ ఆ ప్రతిపాదిత లైన్‌లో 93 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయన్నారు. అన్నింటినీ పరిగణలోనికి తీసుకుని వాటికేవీ అడ్డంకులు లేకుండా మెట్రోను పాతబస్తీ వరకు విస్తరించి తీరుతామన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో గాంధీ, ఉస్మానియా తదితర మూడు ఆసుపత్రులు మాత్రమే ఉండేవి ఇప్పుడు తాము వచ్చిన ఏడేళ్లలో టిమ్స్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేశామన్నారు.
నగరంలో మరో మూడు చోట్ల (ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్) టిమ్స్ ఆసుపత్రులను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఇక బస్తీ దవాఖానాలకు తాము పెద్ద పీట వేశామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. అన్నపూర్ణ సెంటర్‌లు 150 వరకు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. తద్వారా ఆయా సెంటర్‌లలో రోజు 35 వేల మంది భోజనం చేస్తున్నారన్నారు. వారసత్వ సంపదను పరిరక్షించి తీరుతామన్నారు. 17 కోట్ల వ్యయంతో మొజాంజాహి మార్కెట్ కొత్త హంగులతో పూర్తయిందన్నారు.