మన తెలంగాణ / హైదరాబాద్ : అన్ని వర్గాల మాదిరిగానే ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ట్రాన్స్ జెండర్ల కొరకు నడుపబడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకుగాను రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ. 2 కోట్లను విడుదల చేసిందని, దీనిని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా మరో కోటి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్లు తాము ఎందులోనూ తక్కువ కాదంటూ అన్ని రంగాలలో రాణిస్తూ తోటి వారికి స్పూర్తి దాయకంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణ ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికై గత ఐదు నెలలుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ట్రాన్స్‌జెండర్ల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణలో మొదటి సారిగానే ఈ ట్రాన్స్ జండర్ల ఉత్సవం జరుపుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య సుమారు 43,769 ఉండేదని, అది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మన రాష్ట్రంలో సుమారు 58,918 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. సమాజంలో ఎలాంటి గౌరవానికి నోచుకోని చులకనగా చూడబడే ఈ ట్రాన్స్ జెండర్ల కొరకు గతంలో ఎలాంటి గుర్తింపు ఉండేది కాదన్నారు. వీరి కొరకు ఎలాంటి పథకాలు, సౌకర్యాలు నాటి పాలకులు చేయనేలేదన్నారు. సామాజిక వివక్ష బారిన పడకుండా రక్షించడానికి, వారి సామాజిక స్థితి మెరుగు పర్చడానికి వారిపై వివక్షను నిశేధిస్తూ ది ట్రాన్స్ జెండర్ చట్టం పర్సన్స్ 2019ను కేంద్రం తీసుకురాగా దానిని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందంటే వారి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్న అపార గౌరవానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 400 మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి 19 మంది సభ్యులతో రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొప్పుల పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ హెల్ప్ డెస్క్‌లు ఇప్పటికే ఏర్పాటు చేశామని, వాటి పనితీరును తరుచూ సమీక్షిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంచి నిర్ణయాలు తీసుకుంటోందని.. ఇందుకోసం అందరూ సహకరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో తమ సేవలందిస్తున్న ట్రాన్స్ జెండర్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సహకార సంస్థ బోర్డు ఛైర్మెన్ వాసుదేవరెడ్డి, వికలాంగుల సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రటరీ భారతి హోళీకేరి, వికలాంగుల, వృద్దుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, సీనియర్ అధికారి దివ్యదేవరాజన్‌తో పాటు పలువురు ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.