Sunday, January 19, 2025

పుణ్యక్షేత్రాలను అత్యద్బుతంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ, భక్తులకు మెరుగైన సేవలందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కొండగట్టు గుట్టపై నీటి సౌకర్యం కల్పించేందుకు రూ.13.43 కోట్లతో ముత్యంపేట సమీపంలోని వరద కాల్వ నుంచి గుట్టపైకి ఎత్తిపోతల పనులకు మంత్రి గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ, కొండగట్టు ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్ది, భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో సిఎం కెసిఆర్ కొండగట్టుకు వచ్చి రూ.100 కోట్లతో క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారన్నారు.

సిఎం కొండగట్టుకు వచ్చిన సందర్భంలో గుట్టపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వరద కాల్వ నుంచి గుట్టపైకి నీటిని ఎత్తిపోసే పనులు చేపట్టాలని సూచించారని, ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. పనులను వేగవంతం చేసి రెండు, మూడు నెలల్లోనే గుట్టపైన భక్తులకు నీరందేలా చూస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పుణ్యక్షేత్రాలు అత్యద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నాయని, ఈ ఘనత సిఎం కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఎండాకాలంలో కొండగట్టుకు వచ్చే భక్తులకు గుట్టపై నీరు లభించక తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఎత్తిపోతల పథకంతో నీటి సమస్యలు శాశ్వతంగా దూరం అవుతాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాలకు అనుగుణంగా దశల వారీగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ది పరుస్తూ, భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ, గత ఫిబ్రవరి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి కొండగట్టుకు వచ్చి నిర్వహించిన సమీక్షలో కొండగట్టు ఆలయానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ పనులు చేపట్టడం జరిగిందన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాల్వ నిండుకుండలా మారిందని, వరద కాల్వ నుంచి కొండగట్టు గుట్టపై నీటిని ఎత్తిపోసేందుకు రూ.13.43 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, మహిమాన్విత క్షేత్రమైన కొండగట్టు ఆలయాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు జగిత్యాలలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంలో సిఎం కెసిఆర్ ప్రకటించారన్నారు. కొండగట్టు క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు ఏఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సిఎం కొండగట్టుకు వచ్చి క్షేత్రమంతా కలియతిరిగారని, అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

ఆలయ అభివృద్దిలో భాగంగా మొదటగా భక్తులకు నీటి సౌకర్యం కల్పించేందుకు వరద కాల్వ నుంచి ఎత్తిపోతల పనులు చేపట్టాలని సిఎం సూచించారని, సిఎం నిర్ణయంతో కొండగట్టులో నీటి సమస్య అనేది లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి ఎల్.రమణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంత, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌గౌడ్, సర్పంచ్ తిరుపతిరెడ్డి, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News