Monday, December 23, 2024

ప్రభుత్వం కీలక దస్త్రాలపై సమ్రగ విచారణ చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ దీరజ్‌ సాహు దగ్గర నగదు ఎక్కడిదో రాహుల్ చెప్పాలి: కేంద్ర మంతి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పలు శాఖలకు చెందిన కీలక ఫైళ్లు మాయమయ్యాయని, వాటిపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తమ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పక్షనేత ఎవరనే అంశంపై పార్టీలో చర్చించాల్సి ఉందని, ఆ తర్వాతే ఎవరనేది నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. మూడు రోజులుగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారని, దేశం మొత్తం విస్తుపోయేలా రూ.290 కోట్లు దొరికాయన్నారు. ఇప్పటి వరకు 40కి పైగా సంచులు లెక్కపెట్టారని, ఇంకా 90కి పైగా సంచులు లెక్కపెట్టాల్సి ఉందన్నారు. దేశంలో ఇప్పటివరకు ఇంతపెద్ద మొత్తంలో నగదు దొరికిన దాఖలాలు లేవని, ఆ డబ్బును లెక్కపెట్టేందుకు కౌంటింగ్ మిషన్స్ కూడా సరిపోవడం లేదన్నారు.

ఎలక్షన్ కమిషన్‌కి ధీరజ్ సాహు చూపించిన ఆస్తి చాలా తక్కువ అని, దాడుల్లో మాత్రం లెక్కపెట్టలేనంత సంపద దొరకడం చూస్తే ఎంత అవినీతి చేస్తున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. అతని వద్ద ఉన్న దస్తావేజులు అక్కడ ఉన్న ఆస్తులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉందని, ధీరజ్ సాహుకు రాంచీలోని 8 బ్యాంకుల్లో 7 కు పైగా లాకర్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని, చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని, ఆ డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహును మూడుసార్లు రాజ్యసభకు ఎన్నుకున్నారని ఆయన వెల్లడించారు. ధీరజ్ సాహుపై ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో రాహుల్ చెప్పాలని, కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న పలువురు గతంలో అవినీతికి పాల్పడి తీహార్ జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్యమంత్రులను, ఎంపీలను ఏటీఎంలుగా మార్చుకుందని, యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తనిఖీల్లో లభ్యమైన డబ్బంతా పార్లమెంట్ ఎన్నికల కోసం కూడబెడుతున్న నోట్ల గుట్టలని ఆరోపించారు. కాంగ్రెస్‌కు, అవినీతికి విడదియలేని బంధం ఉందని, కాంగ్రెస్ ఎక్కడ అధికారం లో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ దేశ ఆర్థిక వ్యవస్థను చెదలు పట్టినట్టుగా తొలుస్తుందని విమర్శలు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News