Sunday, December 22, 2024

ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఎంఎల్‌ఎ కూనంనేని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రంపంచీకరణ ఫలితంగా వేగంగా ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు కోరారు. అనేకమంది చేతి వృత్తిదారులు ఉపాధి దొరకక వీధినపడి, ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిమాయత్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర చేతి వృత్తిదారుల సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం 2024 నూతన సంవత్సర క్యాలెండరును సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి తో కలసి కూనంనేని సాంబశివ రావు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వృత్తికులాలు, ఫెడరేషన్లు, పేద బిసి కులాలకు అందజేయవలసిన రుణాలు, సబ్సిడీలు, పథకాలు అందజేయకుండా గత ప్రభుత్వం శూన్యహస్తం చూపించిందని తెలిపారు. రాష్ట్రంలోని చేతి వృత్తులను కాపాడుకోవడానికి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహాలను, సబ్సిడీలను అందించాలని అయన విజ్ఞప్తి చేసారు. సమస్యల పరిష్కరానికి చేతివృత్తిదారులంతా ఏకమై ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ శారీరక శ్రమకు మాత్రమే పరిమితమై వృత్తిని కొనసాగిస్తున్న రజకులు అభివృద్దికి ఆమడ దూరంలో జీవిస్తున్నారని, గ్రామాలలో, పట్టణ ప్రాంతాల్లో బట్టలు ఉతికి సేవలందించేందుకు అవసరమైన నీరు, దోబీఘాట్‌లు, విద్యుత్తు సౌకర్యం లేక అరకొర సౌకర్యాలతో వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వాషెర్ మాన్ సొసైటీలను బలోపితం చేసి దోబీఘాట్‌లను ఆధుకరించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో బిసి కులగణన చేప్పట్టకపోవడం వల్ల బిసిలు విద్య, ఉపాధి, ఉద్యోగపరంగా తీవ్రంగా నష్టపోతున్నారని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తక్షణమే ఒబిసి కులగణన చేప్పట్టి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోరుగంటి కృష్ణ, నేతలు జి.నరేందర్, ఎ.విజయకుమార్, తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News