Monday, December 23, 2024

గవర్నర్ నోట కాంగ్రెస్ అబద్ధాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నిర్భందం నుంచి విముక్తి అయిందని పేర్కొనడం విడ్డూరం

జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను తమిళిసై విస్మరించారు

గర్నర్ ప్రసంగంపై బిఆర్ఎస్ సీనియర్ నేత కడియం ఫైర్

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీలో ప్రసంగం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లుగా ఉందని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని, గవర్నర్ గతంలో మాట్లాడిన విషయాలు ఇప్పుడు మాట్లాడింది ఓసారి సమీక్షించుకోవాలని సూచించారు. గత పదేళ్లుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఉందని, జాతీయస్థాయిలో మన రాష్ట్రం ఎన్నో అవార్డులు అందుకున్న విషయం గవర్నర్ మరిచిపోయారని మండిపడ్డారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని, ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందన్నారు.

తెలంగాణ ప్రజలు ఇప్పుడే సంతోషపడుతున్నట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛవాయువులు పీలుస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే సంతోషంగా ఉన్నారని చెప్పడం ఏమిటని నిలదీశారు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం కడియం తప్పుబట్టారు. మెడలు వంచి తెలంగాణ సాధించామని, గవర్నర్ అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

2014లోనే తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని, ఇప్పుడు కావడం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు గవర్నర్ తన ప్రసంగంలో ఎలాంటి ప్రణాళికనూ ప్రకటించలేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఓ రూట్ మ్యాప్ ఉండాల్సిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో దళిత బంధు ప్రస్తావన లేదని, రూ.500 మద్దతు ధర అంశం లేదన్నారు. చూస్తుంటే కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలపై తమ నుంచి సరైన సమాధానం ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News