Saturday, December 21, 2024

జర్మన్ మహా మేధావి గోథే

- Advertisement -
- Advertisement -

గోథే (Johann Wolfgang von Goethe) గొప్ప జర్మన్ కవి, నవలాకారుడు, నాటక రచయిత, రంగస్థల డైరెక్టర్, సాహిత్య విశ్లేషకుడు, సైంటిస్ట్, రాజనీతిజ్ఞుడు, దౌత్యనిపుణుడు, తత్వవేత్త. సాహితీ సిద్ధాంత పరిధిలో సౌందర్య విశ్లేషకుడుగా( Aesthetic Criticism), జీవశాస్త్ర సైంటిస్ట్ గా, మానవ శరీరనిర్మాణ పరిశోధకుడుగా ప్రమాణిక సిద్ధంతాలను ప్రతిపాదించాడు. జర్మన్ భాషా సాహిత్యాలలో దిట్ట. అతని భావధార 18వ శతాబ్దం నుండి నేటి దాకా జర్మన్, యురోపియన్ సాహిత్యక్షేత్రాలను సస్యశ్యామలం చేస్తూనే వున్నది. అతని సాహితీ ఉద్యమాలలో Sturm und Drang, Weimar Classicism, Romanticism in Science ముఖ్యమైనవి.

సనాతన గ్రీకుల సంస్కృతులను, రోమన్ల నాగరికతను, వారి సాహిత్య సంగీత కళలను సాంప్రదాయ సౌందర్య దృష్టి తో సమీక్షించే విధానాన్ని(Classicism) రూపొందించాడు. తాత్వికుడుగా ఆతడు ప్రతిపాదించిన ప్రాచీన మౌలిక కాల్పనిక వాదాలు (Proto-Romantic movement), Sturm und Drang (Storm and Stress) జర్మన్ సాహిత్యాన్ని, సంగీతాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి. గోథే జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో జన్మించి, 82వ ఏట వీమర్ లో మరణించాడు. ప్రేయసి క్రిస్చేన్ వుల్పస్ అతని భార్య. వాళ్ళ సంతానం లోని ఐదుగురిలో నులుగురు చనిపోగా ఒక కొడుకే మిగిలాడు. గోథే తండ్రి ప్రైవేట్ ట్యూటర్. చిన్న
నాటినుండే లాటిన్, గ్రీక్, హిబ్రూ, ప్రెంచ్, ఇటాలియన్, ఇంగ్లీష్ భాషలను నేర్పించాడు. గుర్రపు స్వారి, ఫెన్సింగ్ లాంటి క్రీడలలో తరిఫీజు ఇప్పించాడు. తొలి నాళ్ళ లో గోథేకు చిత్రలేఖనం పై అభిలాష ఉన్నా, తుదకు సాహిత్యం లోనే స్థిరపడి పోయాడు. నాటకాలంటే పిచ్చి ఉండేది. అందుకే తండ్రి ఇంటిలోనే పప్పెట్ షోలు ఏర్పాటు చేసేవాడు.

గోథే బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయశాస్త్రం చదివినా, డిగ్రీ పుచ్చు కోకుండానే వదిలేశాడు. అయినా, ఆతని విశిష్ట ప్రతిభ అతన్ని అనతి కాలంలోనే వీమర్ ప్రభువుకు ఆంతరంగిక సలహాదారున్ని చేసింది. రాజసభ సదస్యుడు ( Privy Council member) కాగలిగాడు. అప్పటి ప్రభుత్వ వ్యవహారాలలో జరిగిన మౌలికమైన మార్పులకు మూలకారకుడయ్యాడు. మూలపడిన వెండి గనులను తెరిపించాడు. రాజభవనాలకు, బొటానికల్ పార్క్ ల రూపకల్పన చేశాడు. యుద్ధ తంత్ర సలహాదారుడుగా వ్యవహరించాడు. 1792 లో ఫ్రాన్స్ తిరుగుబాటుల యుద్ధం లో పాల్గొన్నాడు.

క్రిస్టియన్ మతానుసారం ఆత్మహత్య మహాపాపం కనుక, ఆ రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న వారి పార్థివ దేహాల అంతిమ సంస్కారాన్ని (Burial rights) చర్చ్ తిరస్కరించేది. ప్రభుత్వం వారి ఆస్తులను జప్తు చేసుకునేది. గోథే ఇందుకు భిన్నమైన విప్లవాత్మక మతసంస్కరణలను తన ఆత్మకథలో పొందుపరచాడు.

గోథే ఆధ్యాత్మికత యూదు తాత్వికుడైన స్పినోజా తాత్వికత. ప్రకృతే భగవంతుడు, భగవంతుడే ప్రకృతి. పరిమేయమైన ప్రతి అంశం (Finite) అపరిమేయాన్నే (Infinity) ఆశ్రయించివుంది.
గోథేకు సాహిత్యాభిలాష మెండు. అతన్ని ఆకర్షించిన తొలి సాహితీ మూర్తి గ్రీకు క్లాసిక్ కావ్య పితామహుడు హోమర్. మహాకవి కాళిదాసు అభినవశాకుంతల కావ్యానికి మంత్రముగ్ధుడై తన రచనల ద్వారా సంస్కృత వైభవాన్ని యూరప్ దేశానికి పరిచయం చేశాడు.

గోథేకు దేశదేశాల ప్రయాణాలంటే ఇష్టం – ముఖ్యంగా ఇటలి. ఇటలీలో విస్తృతంగా పర్యటించి తన రచనలలో (Travelogues) విస్తారంగా రాశాడు.

దిగజారుతున్న అలనాటి కులీన భూస్వామ్య వ్యవస్థకు అతను వెగటు చెందటం అందుకు ఒక కారణం కావచ్చునని అంటారు. సిసిలీ ద్వీపకల్ప యాత్ర అతని సాహిత్య జీవితాన్ని మలుపు తిప్పిందనాలి. ససిలీ చూడకుంటే ఇటలీని చూడని కిందే లెఖ్క అంటాడు. సిసిలీ యాత్ర అతనిలో గ్రీకు, రోమన్

సవాతన కళావైభవం పై ఆసక్తిని రేకెత్తించింది. అదే అతని Classicism థియరీకి భూమిక అయిఉంటుందేమో.
గోథే శతాధిక గ్రంథకర్త. అతని సాహిత్య సంపుటాలు 143. పలు నాటకాలే కాక, 30 నవలలు రాశాడు. అతని The Sorrows of Young Werther గొప్ప నవల. Wilhelm Meister’s Apprenticeship నేటికీ ప్రపంచ మేటి నవలలో 4 వది అంటారు. Faust ఆతని సాహితీ ఉద్యయమైన Strum und ౄrang ప్రక్రియను పుణికిపుచ్చుకున్న గ్రంథం. అనేక కవితా సంపుటాలను వెలువరించాడు. బృహత్ ఆత్మకథ రాసుకున్నాడు. అతని మొదటి సైన్స్ గ్రంథం Metamorphosis of Plants. అతని లైబ్రరీలో 5000 కు పైగా పుస్తకాలు ఉండేవట.

గోథే రాసిన అనేకానేక ప్రసిద్ధ దీర్ఘకవితలు ఉన్నా, స్థలాభావం వల్ల అతని కొన్ని లఘుకవితల ఆంగ్లానువాదాలను మాత్రమే ఎంచుకొని తెనుగించాను. అవి ఇవి:

1. వారసత్వం:
(A Legacy)
ఏ నిరంతర నిరత చింతనా నిశ్శేషం కాదు;/ అంతిమంగా ఏ జీవకణమూ శూన్యంగా మిగలదు./ ఏ నిర్వికల్ప నియమమో/ నిన్ను నీ సజీవ గత వైభవంతో ముడివేస్తుంటుంది;/ నీ ఉనికి, నీ అస్తిత్వం అనంతం,/ నిలుపుకో/
నిన్నటి నీ వారసత్వ సంపదను,/ హత్తుకో/ అలనాటి మహనీయుల ఆత్మలు అల్లుకున్న/ ఆ చిరంతన జ్ఞాన సనతనాన్ని.

2. హేమంత చింతనలు:
(Autumn Feelings):
వర్ధిల్లు/ ఓ హరిత పత్రాల లలిత ద్రాక్షాలతా!/ నా గదిని వెదకుతూ/ పైపైకి పాకివస్తున్న పచ్చనాకుల లతికా!/ ఫలించు/ మూడుపువ్వులు ఆరుకాయలై నా పందిరి మీద./ మాంత్రిక మలిసంజ సూరీడు,/ హేమంత హిమ చంద్రుడు/ నీలోకి ప్రాణ శ్వాసలూదారేమో గాని,/ నీ పెంపుసొంపులకు/ నా నయనజలాలు సైతం దోహదాలు సుమా.

3. అద్దమరేయి వేళలో:
(At the Midnight Hour)
అర్ధరాత్రి./ ఆరుబయటికి వెళ్ళాను/ అయిష్టంగానే./ ఆ అర్ధరాత్రి/ ఓ కుర్రాడు చర్చ్ దాటి/ ఫాదర్ ఇంటికేసి వెల్తున్నాడు;/ ఆకాశంలో నక్షత్రాలు/ అందాల జిలుగు వెలుగులను ఆరబోస్తున్నవి./ నేను నా జీవిత పథంలో/ నా ప్రేయసిని వెండిస్తున్న అర్ధరాత్రి,/ అరోరా వెలుగులు, ఆకాశదీప కాంతులు తలపడుతున్న/ ఆ రాకపోకల రాగమయ అర్ధరాత్రి/ నేను పరమానందం అనుభవించాను./ ఆ అర్ధరాత్రి/ చీకటి తెరలు చీల్చుకుంటూ నేలకు దిగిన పున్నమిలో/ ఆమె ప్రతిష్టించబడటం చూచాను;/ ముప్పిరిగొన్న ఇష్టపూర్తులు, త్వరిత చింతనలు, చురుకు మధురిమలు/ భూత భవిష్యత్తులతో అల్లుకోవడం దర్శించాను.

4. ఆతని మరో ప్రసిద్ధ కవిత:
అన్ని కొండ కొమ్ముల మీదా నిశ్శబ్దం పేరుకుంది,/ ఏ కొనకొమ్మల్లోనూ నీ నిశ్వాసా నిస్వనం వినిపించడం లేదు,/ పక్షులు గుబురు శాఖల్లో నిద్రలోకి జారుకున్నవి;/ ఇక, నీవూ త్వరలో నిష్క్రమిస్తావు/ అంతిమ విశ్రాంతిలోకి./ వికల మనసుతో సతమతమౌతున్న కష్టకాలంలో గోథే Gickelhahn గిరిశిఖరం చేరుకుని వెళ్లబోసుకున్న స్వగతం ఇది. కలప కాబిన్ గోడ మీద పెన్సిల్ తో రాసుకున్న లఘుకవిత ‘Wanderers Nachtlied ‘(Night Song). జర్మన్ మూలానికి Henry Wadsworth Longfellow ఆంగ్లానువాదం. ఇప్పుడు అదే గోడమీద ఈ కవిత 15 భాషల్లోకి అనువదింపబడి సందర్శకులకు కనువిందు చేస్తున్నది.

అమెరికన్ అతీంద్రియవాద కవి Ralph Waldo Emerson దృష్టిలో గోథే Plato, Dante, Shakespeare, Napoleon వంటి మానవ
ప్రతినిధులు (Representative men)కు సరిసాటి. అతని కవితలు Mozart, Bethoven వంటి విశ్వకళాకారుల సంగీతాలలో చోటుచేసుకున్నవి.

గోథే గొప్ప మానవతావాది. సర్వమత సహనం ఆతని వ్యక్తిత్వం. ఫ్రెచ్ కవి వోల్టేర్ లాంటి పలువురు కవులు ఇస్లాం మతాన్ని నిరసించినా, గోథే ప్రాఫెట్ మొహమద్ ను అభిమానించాడు. అనేక సార్లు ఖురాన్ ను పఠించాడు. Koran Auszge‘ (‘Summary of the Quran) పేరిట అతను చేసిన సంకలనం ఇప్పటికీ డస్సెల్డార్ఫ్ మ్యూజియంలో(The Goethe Museum in Dusseldorf) భద్రపరచబడి ఉంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో మాక్స్ ముల్లర్ తరహాలో నడుస్తున్న గోథే ఇన్సిటిట్యూట్ ఉందని విన్నాను.
గోథే (Johann Wolfgang von Goethe) జర్మనీ దేశపు షేక్స్ పియర్ గా కొనియాడబడుతున్న విశ్వస్థాయి కవి, మహా మేధావి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News