Saturday, December 21, 2024

ముగ్గురు సూపర్‌స్టార్లను బికారులుగా మార్చిన బంగళా

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: బాలీవుడ్‌కు కేరాఫ్ ముంబై. సూపర్‌స్టార్ల నుంచి జూనియర్ ఆర్టిస్టుల దాకా అందరూ ఈ మహానగరంలోనే నివసిస్తారు. అయితే..కొందరు కోట్ల రూపాయల ఖరీదైన బంగళాలు, ఫ్లాట్ల సొంతదారులైతే మరికొందరు మురికివాడల్లో, చాలీచాలని ఇరుకు గదుల్లో బతుకులు సాగదీస్తుంటారు. వెండితెరపైన కనిపించడమే లక్షంగా జీవిస్తుంటారు. ముంబై ఇప్పుడు దేశంలోని అత్యంత ఖరీదైన నగరాలలో అగ్రస్థానంలో ఉంటుంది. ఖరీదైన ఈ మహానగరంలో కార్టర్ రోడ్డు అనే ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ స్టార్ల చిరునామాగా విలసిల్లిన ఈ ప్రాంతంలో ఒకప్పుడు పార్శీలు, ఆంగ్లో ఇండియన్లు అధికంగా నివసించేవారు. ఈ ప్రాంతంలోనే రెండు అందమైన భవనాలు రెండు ఉండేవి. వాటిలో ఒకటి ఆషియానా అనే పేరు గల భవనం. ఇందులో ప్రముఖ సంగీత దర్శకుడు నౌషద్ నివసించారు. మనం చెప్పుకునే కథ మరో అందమైన బంగళాకు ంబంధించింది. ఆ భనవం చాలా సంవత్సరాలు ఆశీర్వాద్‌గా ప్రసిద్ధి చెందింది.

సముద్రానికి అభిముఖంగా ఉన్న ఒకప్పటి ఈ రెండు అంతస్తుల భవనం ఒక ఆంగ్లో ఇండియన్ కుటుంబం అధీనంలో ఉండేది. దాని పేరు కాలగర్భంలో కనుమరుగైనప్పటికీ 1950వ దశకంలో స్టార్‌గా వెలుగొందిన భరత్ భూషణ్ ఈ బంగళాను కొనుగోలు చేశారు. అక్కడే ఆయన నివాసం ఉండసాగారు. దాంతో సినిమా హీరోలు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకోవడం అప్పుడే మొదలైంది. బైజూ బావ్రా, మీర్జా గాలిబ్, గేట్‌వే ఆఫ్ ఇండియా, బర్సాత్ కీ రాత్ వంటి సిట్ చిత్రాలతో భరత్ భూషణ్ స్టార్ హీరో అయ్యారు. అయితే 1950వ దశకం ముగింపు నుంచి ఆయన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం మొదలైంది. ఒక దశలో ఆయన అప్పులపాలై పోయారు. అప్పులు తీర్చడానికి ఆయన ఈ బంగళాను అమ్మేయాల్సి వచ్చింది. దురదృష్టాన్ని తెచ్చిన ఈ బంగళాను ఆయన వదిలించుకోవలసి వచ్చింది.

1960వ దశకంలో అప్పుడే నటుడిగా ఎదుగుతున్న రాజేంద్ర కుమార్‌కు ఈ బంగళాను అమ్ముతున్నారన్న విషయం తెలిసింది. రూ. 60,000కే ఇంత పెద్ద భవనం లభిస్తోందని ఆశపడిన రాజేంద్ర కుమార్ బిఆర్ చోప్రాతో మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుని ఆ డబ్బుతో ఈ బంగళాను కొనేశారు. తన మకాం ఈ బంగళాకు మార్చేశారు. బంగళాకు తన కుమార్తె డింపుల్ పేరు పెట్టుకున్నారు. తన మిత్రుడు, ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ సలహా మేరకు బంగళాకు శాంతి పూజలు కూడా చేయించారు. ఈ ఇంట్లోకి వచ్చిన వేళావిశేషం ఏమోగాని రాజేంద్ర కుమార్ నటించిన సినిమాలు వరుస హిట్లు సాధించి ఆయన పేరు జుబిలీ కుమార్‌గా మార్మోగిపోయింది. అయితే భరత్ భూషణ్ లాగే రాజేంద్ర కుమార్‌కు అదృష్టం తిరగబడింది. 1968, 69 సంవత్సరాలలో ఆయన నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఆయనను చుట్టుముట్టాయి. చివరకు ఆయన సహాయ నటుడిగా నటించాల్సి వచ్చింది. దీంతో ఆయన తాను ఎంతో ప్రేమించిన బంగళాను అమ్ముకోవలసి వచ్చింది.

1970 దశకంలో అప్పుడే నటుడిగా ఎదుగుతున్న రాఏష్ ఖన్నా కళ్లు ఈ బంగళాపై పడ్డాయి. ఆయన వెంటనే రాజేంద్ర కుమార్ నుంచి ఈ బంగళాను కొనేశారు. దాని ఆశీర్వాద్ అనే పేరు పెట్టుకున్నారు. రాజేష్ ఖన్నా దశ తిరిగింది. ఇండస్ట్రీలో ఆయనను కొత్త సూపర్‌స్టార్ అని పిలవసాగారు. వరుసగా 17 సూపర్‌హిట్ చిత్రాలలో నటించి రికార్డు సృష్టించారు. సినీ అభిమానులకు, పర్యాటకులకు ఆశీర్వాద్ ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. అయితే రాజేష్ ఖన్నాకు సక్సెస్ ఎక్కువ కాలం నిలవలేదు. వరుసగా అపజయాలు ఆయనను వెన్నంటాయి. 70వ దశకం ముగింపు నాటికి రాజేష్ ఖన్నా ప్రభ మసకబారింది. కొత్త సూపర్‌స్టార్‌గా అమితాబ్ బచ్చన్ అవతరించారు. రాజేష్ ఖన్నా నటించడం తగ్గిపోయింది. ఆర్థిక సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. భార్య డింపుల్ కంపాడియా ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయింది. చేతిలో పని లేకపోవడంతో రాజేష్ ఖన్నా ఎక్కువ కాలం తన లింకింగ్ రోడ్డు ఆఫీసులో గడసాగారు. అయితే మరణానికి కొద్ది రోజుల ముందు ఆయన తిరిగి ఆశీర్వాద్‌కు రావలసి వచ్చింది.

2014లో ఈ బంగళాను ఒక పారిశ్రామికవేత్త రూ. 90 కోట్లకు కొనుగోలు చేశారు. 2016లో ఆభవనాన్ని నేలమట్టం చేసి అధునాతన భవంతిని అక్కడ నిర్మించారు. ముగ్గురు సూపర్‌స్టార్లకు ఆశ్రయమిచ్చి వారిని ఉత్థానపతనాలను చూసిన ఆ భవనం చరికాలగర్భంలో కలసిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News