Thursday, September 19, 2024

నాడు ఆకలి బాధలు… నేడు విజయ గాధలు

- Advertisement -
- Advertisement -

దేశానికి రోల్ మోడల్ తెలంగాణ వ్యవసాయ పథకాలు
డాక్టర్ స్వామినాథన్ కలలను సాకారం చేస్తున్న తెలంగాణ
పదేళ్ళ వ్యవసాయ ప్రగతిపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : సస్యవిప్లవ పితామహుడు స్వామినాథన్ కన్న కలలను తెలంగాణ రాష్ట్రం సాకారం చేసే దిశలో పయనిస్తోందని వ్యవహాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ కోహినూర్ హాల్ లో ‘పదేండ్ల తెలంగాణ వ్యవసాయ ప్రగతి’పై నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు కొండూరు రవీందర్ రావు, రజనీ సాయిచంద్, రామకృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, మార గంగారెడ్డి, కొండబాల కోటేశ్వర్ రావు, రాజవరప్రసాద్ రావు వనరస, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, విసి నీరజా ప్రభాకర్ , మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ప్రభుత్వ ఉద్యాన సలహాదారు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొని వ్యవసాయ ప్రగతిని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డా. స్వామినాథన్ ప్రజల ఆకలిబాధలు చూసి డాక్టర్ వృత్తిని వదిలి వ్యవసాయ విద్య వైపు వచ్చారని తెలిపారు. వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకోవాలని, యాంత్రీకరణ పెరగాలి, వ్యవసాయం పరిశ్రమగా ఎదగాలి అని ఆయన ఆకాంక్షించారన్నారు. ఎదుగుతున్న చదువుకున్న యువత వ్యవసాయరంగం వైపు రాకుంటే భారతదేశానికి భవిష్యత్ లేదని , తుపాకులు కొనగలరేమో కానీ, ఆహార ధాన్యాలను కొనలేరని ఆయన గంభీరంగా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ ప్రాధాన్యమే వ్యవసాయ రంగమని, తెలంగాణలోని 58 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని మంత్రి తెలిపారు.

సాగునీళ్లు, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్లు, ఉచిత కరంటు తో వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచామని చెప్పారు. కురచ మనసు ఉన్న వారు వీటిని అంగీకరించకపోవచ్చన్నారు. అంతర్జాతీయ వ్యవసాయ వేదికలలో తెలంగాణ పథకాలు, ప్రగతి ఒక చర్చగా నిలుస్తోందన్నారు. తెలంగాణ ప్రస్తావన లేకుండా ఏ చర్చా జరగడం లేదని పేర్కొన్నారు. ఇది తెలంగాణ విజయం, తెలంగాణ రైతాంగ విజయమని మంత్రి చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి సంస్థ ఎఫ్‌ఎఓ గుర్తించిన ప్రపంచ 20 ఉత్తమ పథకాలలో రైతుబంధు, రైతుభీమా నిలవడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. యూఎస్‌ఎలో జరిగే అంతర్జాతీయ వేదికలో తెలంగాణ వ్యవసాయ విజయాల గురించి చెప్పమని ఆహ్వానించడమూ గర్వకారణమని అన్నారు.

పత్తిని ప్రోత్సహించడం వల్ల రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు 400కు పెరిగాయన్నారు. వరి ఉత్పత్తి పెరగడంతో వేల సంఖ్యలో రైస్ మిల్లులు ఏర్పడ్డాయని తెలిపారు. దీంతో పెద్దఎత్తున ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి తెలిపారు. పంటల మార్పిడిలో తెలంగాణ రైతాంగం ముందున్నదని, గతంలో 40 వేల ఎకరాలు ఉన్న ఆయిల్ పామ్ అతి తక్కువ కాలంలో లక్ష 94 వేల ఎకరాలకు చేరిందన్నారు. దేశానికి వ్యవసాయంలో టార్చ్ బేరర్ లా తెలంగాణ నిలుస్తోందని మంత్రి చెప్పారు. విస్తీర్ణంలో తెలంగాణ కన్నా పెద్దగా ఉన్న యూపి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ప్రగతికోసం పెడుతున్న ఖర్చులో 25 శాతం కూడా పెట్టడం లేదని తెలిపారు. కోట్ల మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగమన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఅర్ దీనికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. తెలంగాణ గ్రామ సీమల్లో కనిపిస్తున్న పంటచేలు, పల్లెలకు చేరిన ప్రజలే దీనికి నిదర్శనమని నిరంజన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ ప్రగతికి నిరంతరం పనిచేశానని చెప్పుకొచ్చారు.

ఈ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇంతకుముందు పనిచేసిన కార్యదర్శులు, అన్ని స్థాయిల అధికారులు సహకరించారని, దీంతో వ్యవసాయ అనుబంధ వేర్ హౌసింగ్, గిడ్డంగులు, ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘాలు ఉన్నతమైన ప్రగతి సాధించి లాభాల బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. సహకార రంగంలో రూ.6 వేల కోట్లున్న టర్నోవర్ నేడు తెలంగాణ రాష్ట్రంలో రూ.20 వేల కోట్లకు పెరిగిందన్నారు. గతంలో వ్యవసాయం చేసుకుంటే ఆకలిచావులు, ఆత్మహత్యలు, పంట నష్టం అన్నీ ఆకలిబాధలని, ఇప్పుడు ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో ప్రతి రోజు విజయగాథలేనని మంత్రి చెప్పారు. వ్యవసాయరంగంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను భవిష్యత్ లో అధిగమిస్తామని చెప్పారు. వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ మెదడు, మనసుతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ వృద్ది కోసం పనిచేస్తోందన్నారు. కోవిడ్ లాంటి విపత్తు సమయంలో కూడా వ్యవసాయరంగం మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, చర్చల్లో వ్యవసాయ అంశం లేకుండా లేదన్నారు. తెలంగాణ జీఎస్ డీపీ రూ.3.50 లక్షల కోట్ల నుండి రూ.13.50 లక్షల కోట్లకు పెరిగిందని, అందులో వ్యవసాయ రంగ వాటా 18.5 శాతమని తెలిపారు. కొత్తగా సాగు విస్తీర్ణం కోటి ఎకరాలకు పెరిగిందని, దేశంలో తెలంగాణ జియోగ్రఫికల్ ఏరియా 3 శాతం నుండి ఇప్పుడు 5.25 శాతానికి పెరిగిందని వివరించారు. తెలంగాణలో 4.3 మీటర్ల భూగర్భజలాలు పెరిగాయని తెలిపారు. తొమ్మిదేళ్లలో పచ్చదనం శాతం కూడా పెరిగిందని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News