Thursday, January 23, 2025

వందేళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో బేగంపేట్ మీదుగా వెళ్తుంటే ఓ పెద్ద ప్రహరీ గోడకు ‘ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, 1923లో నెలకొల్పబడినది’ అని పెద్ద అక్షరాలు కన్పిస్తాయి. లోపల విశాలమైన మైదానాల్లో తెలుపు రంగులో తళతళ మెరిసే నిజాం కాలం నాటి భవంతుల సముదాయం కన్పిస్తుంది. సామాన్యుల కంటికి అది తమ పిల్లల్ని ఇందులో చదివించాలని కల కూడా కననంత పెద్దగా వుంటుంది. ఈ సంవత్సరం ఈ బడికి వందేళ్లు పూర్తయ్యాయి. ఒక స్కూల్ వందేళ్లు పూర్తి చేసుకోవడమేది చారిత్రక ఘట్టమే. అందుకే స్కూల్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటోంది. గొప్పవారి పిల్లల కోసం ఏడవ నిజాం 1923 లో జాగీర్దార్స్ కాలేజీనీ పేరిట దీనిని బేగంపేటలో ప్రారంభించారు. దీని కోసం ఒక బేగం 88 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చింది. మిగితా స్థలం కోసం జాగీర్దార్లు విరాళాలు ఇచ్చారు.

నవాబులు, జాగీర్దారుల పిల్లలు, ఇంకా నగరంలోని ధనవంతుల పిల్లలు చదువు కోసం ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేశారు. జాగీర్దారుల వార్షిక ఆదాయంలో 2% సొమ్మును వసూలు చేసి స్కూల్ భవనాల నిర్మాణాలు చేపట్టారు. అందువల్ల వారి పిల్లలకు విద్య ఉచితంగా లభించేది. ఆరంభంలో ఐదుగురు విద్యార్థులు, ఆరుగురు టీచర్లతో కేంబ్రిడ్జ్ తరహాలో పాఠాలు మొదలుపెట్టారు. 1930 నాటికి విద్యార్థులు సంఖ్య 150కి పెరిగింది. 1950లో జాగీర్దారీ విధానాన్ని రద్దు చేయడంతో ఆ కాలేజీకి 1951 ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్’ అని పేరు మార్చారు. అయితే ఒక స్కూల్‌కు పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టుకోవడానికి కూడా కొన్ని నిబంధనలున్నాయి. 1939 లో ఏర్పడ్డ ఇండియన్ పబ్లిక్ స్కూల్ కాన్ఫరెన్స్ లో సభ్యత్వం గల పాఠశాలలే తమ విద్యా సంస్థకు పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టుకోవచ్చు. ఎల్‌కెజి నుండి సెకండరీ స్థాయి విద్యనందించే ఇవి పూర్తిగా ప్రైవేటు, స్వతంత్ర, సెక్యులర్ విధానాల ప్రకారం నడుస్తాయి. సొసైటీ ఆధీనంలో నడుస్తున్న ఈ స్కూల్ సొసైటీ కార్యవర్గంలో తొలి చైర్మన్ గా డా. సర్వేపల్లి రాధా కృష్ణన్ ఉండడం విశేషం.

లండన్‌లోని మంచి ఇంగ్లీష్ స్కూల్ స్థాయి పాఠశాలను తన సంస్థానంలోని గొప్ప కుటుంబాల పిల్లల కోసం ఏర్పాటు చేయాలని 1919 లో ఏడవ నిజాం అనుకున్నాడు. తన వద్ద పని చేసే ఓ ఆంగ్ల అధికారితో తన ఆలోచన పంచుకోగా ఆయన లండన్‌లోని ఎటన్ రెసిడెన్షియల్ స్కూల్ మాదిరి గురుకుల విద్యాలయం బాగుంటుందని చెప్పాడు. 1923 నాటికి ఆ ఆలోచనకు నిర్మాణ రూపానికి వచ్చింది. అలా మొదలైన ఈ స్కూల్ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ విద్యా విధానంలో ఉన్నత స్థాయి బోధనా పద్ధతులను ప్రవేశపెడుతూ నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఈ మధ్య కొత్తగా ఇంటర్నేషనల్ స్కూళ్ళు హైదరాబాద్‌కు రావడంతో వీటి మధ్య పోటీ పెరిగింది. హైదరాబాద్‌లోని ఉత్తమ విద్యాసంస్థల్లో ఇప్పుడిది మొదటి అయిదు స్థానాల్లో ఉంటోంది.
సినీ నటుడు, ఈ స్కూల్ పూర్వ విద్యార్ధి అయిన నాగార్జున అక్కినేని చేతుల మీదుగా మార్చిలో శతాబ్ది లోగో ఆవిష్కరణతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ నెల చివర్లో వరుసగా ముగింపు వేడుకలు జరగనున్నాయి. విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది, పూర్వవిద్యార్థులు కలిసి ఈ ఉత్సవాలను గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు.

వేసవి విడిదిగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 19వ తేదీనాడు స్కూల్‌ను సందర్శించి శతాబ్ది సంబరాల్లో పాల్గొనడం విశేషం. డిసెంబర్ చివరి నాలుగు రోజుల పాటు భిన్న రకాల ముగింపు కార్యక్రమాలుంటాయి. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అతిథులకు డిన్నర్ ఏర్పాట్లున్నాయి. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో పూర్వ విద్యార్థులు మధ్య గోల్ఫ్ పోటీ వుంటుంది. పూర్వ విద్యార్థుల్లోని క్రీడాకారులతో స్పోర్ట్ రీయూనియన్ పేరిట ఆటల పోటీలుంటాయి. ఈ స్కూల్లో చదివిన ఎందరో విద్యార్థులు ప్రస్తుతం ఎన్ని ప్రపంచ స్థాయి కంపనీలకు సిఇఒలు వున్నందున వారితో కొత్త విద్యార్థులకు, ఆసక్తిపరులకు ఔత్సాహిక వ్యాపారవేత్తల శిక్షణ వుంటుంది. పాత కార్ల ప్రదర్శన వుంటుంది. 150కి పైగా స్టాల్స్‌తో కార్నివాల్ ఏర్పాటు చేస్తున్నారు. గత స్మృతులను, విజయాలను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. అదే రోజు రాత్రి మ్యూజికల్ నైట్ వుంటుంది. చివరి రోజైన 26 నాడు వివిధ కార్యక్రమాలతో పాటు వచ్చే 25 ఏళ్లలో సాధించవలసిన విజయాల లక్ష్యంగా ముగింపు సమావేశం సాగుతుంది. ఈ సందర్భంగా స్కూల్ బిల్డింగ్ తదితర కట్టడాల బొమ్మలతో కూడిన మగ్‌లు, గడియారాలు, బ్యాగులు. వాల్ హ్యాంగింగ్స్ అమ్మకానికి ఉంచుతారు.

ఇది పూర్తిగా ప్రైవేటు విద్యా సంస్థ. బేగంపేట్‌తో పాటు నగరంలోని రామాంతపూర్, వరంగల్, కడపలో కూడా దీనికి స్కూళ్లు వున్నాయి. ఇందులో ప్రి ప్రైమరీ నుండి + 2 దాకా హాస్టల్ వసతితోపాటు ఉత్తమ స్థాయి చదువు లభిస్తుంది. ఫీజులు భారీగానే లక్షల్లో వుంటాయి. అర్హత గల వారు ప్రభుత్వ ఉపకార వేతనాన్ని పొందవచ్చు. 18: 1 చొప్పున విద్యార్థి అధ్యాపక నిష్పత్తి వుంటుంది. వివిధ క్రీడల కోసం 44 స్థలాలున్నాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి లలిత కళలు కూడా నేర్చుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ప్రతి సంవత్సరం జరిగే అడ్మిషన్ల కోసం డిసెంబర్ చివరి వారంలో ఆన్‌లైన్ ద్వారా తమ అభ్యర్థనలు పంపవచ్చు. ఈ స్కూల్‌లో చదివి ఉన్నత పదవుల్లో ఉన్నవారే ఈ స్కూల్ ఘనతకు నిదర్శనంగా నిలుస్తారు. మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదెళ్ల, ప్రోక్టర్ అండ్ గాంబ్లే సిఒఒ శైలేష్ జేజురికార్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ పాల్ సింగ్ బంగా, ఎయిర్ మార్షల్ జె చలపతి, అడోబ్ సిఇఒ శంతను నారాయణ్, విప్రో వైస్ చైర్మన్‌గా పని చేసిన టికె కురియన్, క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే.. ఇంకా కొందరు రాజకీయ నాయకులు, సినీనటులు ఈ స్కూల్‌లో చదువుకున్నారు.

ఇదే స్కూల్లో 1986 బ్యాచ్‌కి చెందిన ఐపిఎస్ అధికారి సివి ఆనంద్ విద్యార్థిగా వున్నపుడే 18 ఏళ్ల లోపు క్రికెట్ పోటీల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. తన స్కూల్ అనుభవాలని చెబుతూ సత్యనాదెళ్ల తమ స్కూల్‌లో పాడుకొనే ‘తు షహీన్ హై.. పర్వాజ్ హై కామ్ తేరా.. తేరే సామ్నే ఆస్మా ఔర్ భీ హై..’ అనే ఇక్బల్ గీతం ఇప్పటికీ స్ఫూర్తినిస్తోంది అంటారు. ప్రయివేట్‌గా, సొసైటీ ఆధీనంలో నడుస్తున్న ఖరీదైన విద్యాలయమైనా హైదరాబాద్ కీర్తి కిరీటంలో ఈ స్కూల్ ఓ రత్నంలా భాసిల్లితోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News