Monday, December 23, 2024

డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచనను పక్కన పెట్టాలి

- Advertisement -
- Advertisement -

ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవొచ్చు
అది కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తా
కళాశాల సమయంలోనే విద్యార్థులు భవిష్యత్‌కు బంగారు పునాదులు వేసుకోవాలి
బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ అల్మని మీట్, గ్రాడ్యుయేషన్ డేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచనను పక్కన పెట్టాలని, ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవవచ్చని, అది కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తామని సిఎం రేవంత్ హామీనిచ్చారు. కళాశాల సమయంలో భవిష్యత్‌కు బంగారు పునాదులు వేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.

విద్యార్థి దశలోనే వీలైనంత ఎంజాయ్ చేస్తూనే భవిష్యత్ వైపునకు సరైన దిశలో అడుగులు వేయాలని సిఎం పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదని ఆయన సూచించారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ అల్మని మీట్, గ్రాడ్యుయేషన్ డేలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యానని, ఎంతో మంది పోటీలో ఉన్నా కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. గడ్డం వివేక్, వినోద్ రామాయణంలో లవకుశలు లాంటివారని ఆయన కొనియాడారు. ఎంత సంపాదించామనేది కాదు, సమాజానికి ఎంత పంచామన్నది కాకా విధానమన్నారు. అటువంటి కాకా వెంకటస్వామి వర్ధంతి రోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప కార్యక్రమని సిఎం రేవంత్ కొనియాడారు.

బిఆర్ అంబేద్కర్ కాలేజీ విద్యార్థులకు చేయూతనందిస్తా
50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకా సొంతమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదేనని సిఎం రేవంత్ ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందని సిఎం రేవంత్ తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరు మీదనే ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కూడా కాకా పాత్ర ఉందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా అని రేవంత్ చెప్పుకొచ్చారు. బిఆర్ అంబేద్కర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చేయూతనందించేందుకు సిద్దమని రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు తాము అండగా ఉంటామన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వానిదే….
మరోవైపు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. అందుకే విద్యార్థులంతా మంచిగా చదువుకుని సర్కార్ కొలువు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా పని చేస్తే కచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అంతకుముందు కాలేజీలో కాకా విగ్రహాన్ని సీఎం రేవంత్ అవిష్కరించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసిన సిఎం ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారుఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News