టిడిపి తెలుగు మహిళ విభాగం నిరసన
హైదరాబాద్ : పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని టిడిపి అనుబంధ తెలుగు మహిళ విభాగం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షరాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యంలో.. సోమవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదురుగా వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి మాట్లాడుతూ… కేంద్రం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లనే పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్ ధరలన్నీ పెరిగాయని, తాజాగా టమోటో, పచ్చిమిరపకాయలు తదితర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు.
ఇలా రోజుకు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే సామాన్య, పేద మధ్యతగతి కుటుంబాలు జీవించటమే కష్టంగా మారుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం కూడా కూరగాయల ధరల పెరుగుదలకు ఒక కారణంగా మారుతోందన్నారు. అనంతరం మాజీ ఎంఎల్‌ఏ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ వంట గ్యాస్, కూర గాయల ధరల పెరుగుదల వల్ల గృహిణులు పిల్లలకు భోజనం ఎలా పెట్టాలా? అని నిత్యం మధనపడుతున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా సామాన్యుడి ఆదాయం పెరగడం లేదని, పాలకులు సబ్సిడీ కూరగాయలు, నిత్యావసర సరుకులను గృహిణులకు అందుబాటు ధరల్లో లభించేలా చూడాలన్నారు.
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత మాట్లాడుతూ సామాన్యులు మార్కెట్‌లో ఏ వస్తువును కొని తినే పరిస్థితి లేకుండా పోతోందని, తమిళనాడులో సబ్సిడీకి టమోటాలను అందిస్తున్నట్లుగానే తెలంగాణలోనూ ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
టమోటో ధర ఏకంగా రూ. 160కి చేరడంతో పేదవాడికి అందనంత ఎత్తుకు పోయిందన్నారు. మార్కెట్‌లో ధరలు ఒక రకంగా చూపి మరో రకంగా అమ్ముతున్న సందర్బాలూ ఉన్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సకాలంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సాయి తులసి, సుజాత, పద్మ చౌదరి,ధనలక్ష్మి, ప్రమీల, తెలుగు మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సూర్యదేవర ఝాన్సీ, చలసాని ఝాన్సీ, ప్రధాన కార్యదర్శులు దాసరి మాల్యావతి, నందమల్ల శారద, మంకు ఇందిరా, కార్యానిర్వాహక కార్యదర్శులు యాండ్ర కల్పన, తగిరిన లలిత, కాకర్ల శశిరేఖ, కార్యదర్శులు శీలం రత్న, వట్టినేని సురేఖ, చిటికల అశ్విని, స్వాతి, కుద్బుల్లాపూర్ మహిళా అధ్యక్షురాలు వి. శైలజ, మహిళా నాయకులు కళావతి, రాజేశ్వరి, అంజలి, లలిత, ఉమా, కుమారి, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.