Thursday, January 23, 2025

బిఆర్ఎస్ లోకి వలసల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గులాబీ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. తొమ్మిదిన్నర సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, వారి కేడర్‌తో పాటు కుల సంఘాల నేతలు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీ లో చేరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయక త్వం ఇటీవల బిఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరింది. వివిధ నియోజకవర్గాలలో జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లతో పాటు మాజీ స్థానిక సంస్థల నాయకులు బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. సోమవారం మాజీ టిపిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి పొ న్నాల లక్ష్మయ్య బిఆర్‌ఎస్‌లో చేరగా, ఇటీవల బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సమక్షంలో టిపిసిసి మాజీ సభ్యులు ఉదయ్‌చందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిల్యా నాయక్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా మంత్రి హరీశ్‌రావు సమక్షంలో మాజీ ఎంఎల్‌ఎ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధర్‌రెడ్డి, ఇతర నేతలు పార్టీలో చేరారు. మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిల సమక్షంలో భారీగా ఇతర పార్టీల నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అలాగే పలు నియోజకవర్గాలలో చెందిన కాంగ్రెస్, బి జెపి పార్టీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి స్వఛ్చందంగా వచ్చే వారిని బిఆర్‌ఎస్ పార్టీ నేతలు సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
గులాబీ వెంట కదులుతున్న పల్లెలు
ఎన్నికల ప్రచారంలో కారు దూసుకుపోతోం ది. తొమ్మిదిన్నరేళ్లలో తమ పార్టీ చేసిన అభివృద్దిని చూసి భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్‌ఎస్ అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తులకు ప్రజ ల నుంచి మంచి స్పందన వస్తుంది. సిఎం కెసిఆర్‌తోనే అభివృద్ది సాధ్యమని విశ్వసిస్తున్న జనం, గులాబీ పార్టీని ఓటు వేస్తామని ప్రకటిస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ గ్రామాలలో బతుకమ్మలు ఆడు తూ ఊరేగింపులు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గ్రామాలలో ప్రచారానికి వచ్చే పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఆసరా పింఛన్లు పొందుతున్న వృద్ధులు, మహిళలు, వికలాంగులు, రైతుబం ధు, రైతుబీమా లబ్దిదారులు బిఆర్‌ఎస్ పార్టీ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ స్వఛ్చంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉన్న పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఇతర పార్టీలో ఉన్న వాళ్లు సైతం బిఆర్‌ఎస్‌కే జై కొడుతున్నారు.
కెసిఆర్, కెటిఆర్‌ల నామినేషన్ ఖర్చులు పంపిన ముఖరా (కె) పింఛన్‌దారులు
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుమారుడు మంత్రి కెటిఆర్‌ల పట్ల అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామ పింఛన్‌దారులు ప్రేమాభిమానాలు చాటుకున్నారు. తమకు నెల నెలా టంచనుగా అందుతున్న ఆసరా పింఛనులో నుంచి పొదుపు చేసుకున్న వెయ్యి రూపాయలను సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నామినేషన్ ఖర్చుల కోసం ఉడతాభక్తి సాయంగా (ఆసరా)గా నిలవాలని నిర్ణయించుకుని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల పేరు మీద నామినేషన్ ఖర్చుల కోసం లక్ష రూపాయలు అందజేశారు. తమ లక్షరూపాయల్లో సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ నామినేషన్ ఖర్చుల కోసం చెరో రూ.50 వేలను అందించాలనే వారి కోరిక మేరకు… సిఎం కెసిఆర్ పేరు మీద రూ.50 వేలు…కెటిఆర్ పేరు మీద రూ.50 వేలు చెక్కులను సిఎం కెసిఆర్‌కు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News