Wednesday, January 22, 2025

ఒక మార్దవ మానవుని ‘అంతరంగపు భాష’

- Advertisement -
- Advertisement -

Poetry is plucking at the heartstrings, and making music with them. Dennis Gabor అన్న ఈ మాటలు డా.జెల్ది విద్యాధర్ రావు కవిత్వానికి సరిగ్గా సరిపోతాయి. ఆయన కవిత్వం హృదయ తంత్రుల్ని సుతారంగా మీటతాయి. ఆ తంత్ర నాదం తేలిగ్గా కాసేపు మనసులో చక్కర్లు కొడుతుంది. కావాలంటే ఈ కవిత ‘అత్తరు సాయిబు అభిమాని’ కవిత చూడండి.
‘రోడ్డుపై పడివున్న
చెత్తకాగితాన్ని ప్రేమిస్తాను.
మట్టిబెడ్డల పైన పుస్తకాన్ని
తుడిచి కళ్ళకు అద్దుతాను’
అన్నప్పుడు ఒక సాదాసీదా అక్షర ప్రేమికుడు తన గురించి తాను రాసుకున్న వాక్యాల్లో గాలిబు, రూమీ తొంగిచూస్తున్నారు.ఈ సాదాసీదా వాక్యాలు గుంభనంగా ఎంతో కవిత్వాన్ని మోస్తున్నాయి. ఒక సరళ వాక్యం రాసి దానితో కవిత్వం చెప్పి ఒప్పించడం కష్టం.బిక్కి కృష్ణ అన్నట్టు కవి వ్యక్తిత్వ ఆవిష్కరణే కవిత్వం. కవి వ్యక్తిత్వం ఏమిటో పై వాక్యాల్లో మనకు తెలిసిపోతుంది. ఆ కవిత వాక్యాలు మన మనసుకళ్ళకు అద్దుకునే వుంటాయి.
’మీరొస్తే చాలు’ కవితది ఒక గమ్మత్తైన నడక. కవిత చివరి వరకు కవి ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడో పరిపరి విధాల ఆలోచన పోతుంది.’ మీరు వెంటుంటే ఎర్రటి ఎండలో తల్లి చీర కొంగు కింద నడిచే బిడ్డడిలా బహు ధీమాగా బహు దిలాసగా వుంటుంది’ అన్నప్పటికీ కవిత అడుగు తగలదు. కవిత చివరలో’ గత మాసంగా నిరంతరంగా కు రుస్తున్న వర్షాలకు హర్షంతో’ అనడంతోపై కవి త మొత్తం ఒక్కసారిగా అక్షరకాంతితో వెలిగిపోతుంది. ముఖ్యంగా కవిత ముగింపు వాక్యాలు’ బక్కరైతుల కళ్ళల్లో వేయి వెలుగులు విరజిమ్ముతాయ్/ నెర్రలిచ్చిన భూమాత దైన్యపు వదనంలో/నూతన కాంతులు దేదీప్యంగా వెలుగుతాయ్.’ అనడంతో మరింతగా వెలుగులు చిమ్ముతాయ్.
జెల్ది విద్యాధర్ లో ఒక ప్రియంభావుకుడు వున్నాడు. ఈ భావుకత్వంలో ఆయన వున్నప్పుడు ఒక trance లో రాసినట్టుగా ఆయన కవిత్వం జాలువారుతుంది. ఎక్కడా ప్రయత్నపూర్వక వాక్యం వుండదు. అలలు అలలుగా అలవోకగా వాక్యాలు అలా వస్తూనే వుంటాయి. ‘గులాబీ రెప్పలు’ అలాంటి కవిత. ఒక విరామపు సెలయేరు ఒడ్డున తచ్చాడిన అనుభూతి.’నీవో ఆలాపనవు’, ‘మందహాస మకరందం’, ‘చువ్వకు వేలాడే చూపులు’, ‘గువ్వలు మోసిన పువ్వులు’ ‘నీవెవరు?’, ‘నీవో తరువో, తరుణివో ధరణివో, ‘హృదయ విహారి’ లాంటి కవితలు నిజంగానే హృదయ విహారాన వింజామరలు విసురుతాయి. పుస్తకం మొత్తంలో ఈ కవితలు తీపి తినుబండారాలలో జీడిపప్పుల్లా తగులుతుంటాయి.
‘తన కన్యకా వధువు కోసం ఇంత అందమైన చిత్రాలను చిత్రించిన చిత్రకారుని కుంచె ధన్యమైంది’ అని హఫీజ్ అన్నట్టు ఒక ఆహ్లాదవీచికలను చిత్రిస్తాయి ఈ కవితలు. అందుకే బిక్కి కృష్ణ ‘విద్యాధర్ రావు ఎల్లలు లేని భావావేశానికి, సౌందర్య దృష్టికి (Aesthetic Sense), ధర్మాగ్రహానికి, తాత్వికతకు, ఆత్మాశ్రయ అనుభూతి, అభివ్యక్తి నైపుణ్యానికి, విషయ పరిజ్ఞానానికి, శిల్ప రహస్యానికి, ఆత్మ భాషకు, హృదయ ఘోషకు ఈ సంపుటిలోని ప్రతి కవితా వాక్యం అద్దం పడుతుంది. ప్రతి వాక్యంలో ఏవో మెరుపురేఖల్లాంటి images తళుక్కుమంటాయి. ‘అనడం అతిశయోక్తి కాదు.
అలాగని ఈ కవి ఆగ్రహ వాక్యం రాయకపోలేదు. కానీ అది నిగ్రహం కోల్పోని ఆగ్రహ వాక్యం. సంయమనంలో ముంచి తీసిన వాక్యం.
‘ప్రశ్నించడం నేరమైతే స్వప్నించడమూ నేరమే’ అనే చిరు ఆగ్రహంతో మొదలెట్టి.. ‘మొలకెత్తని రాతినేలపై ప్రశ్నలెన్ని జల్లితేనేంపుష్పించని కొమ్మలకు పూవులెన్ని అతికితేనేం’ అని ప్రశ్నను పదునుగా వెయ్యనివాళ్ళను దునుమాడుతూ..’ మేధావుల మౌనం / సమాజానికి శాపం
నిస్తేజిత సమాజ నైరాశ్యం / అల్ప సమూహాలకు మరణ శాసనం’ అని ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తాడు. అందుకే ముందుమాటలో కొలకలూరి ఇనాక్ ఈ విషయాన్నే రాస్తూ ‘ విద్యాధర్ రావు ఆవేశపరుడు. ఉద్వేగి. సమాజంలోని అసమానతల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దౌర్జన్యాలను,దుర్మార్గులను భరించలేడు.వాటిని ఖండిస్తాడు. ఆవేదనాత్ముడవుతాడు. అయినా ప్రేమ స్వరూపి.. భార్యనే కాదు సమస్త మానవాళిని, పశుపక్ష్యాదులను ప్రేమిస్తాడు.. ఆరాధిస్తాడు.. ఆత్మీయుడవుతాడు.. అనురాగ పూర్ణుడవుతాడు. ఎంత ఆవేశం వుందో, అంత అనురాగం వుంది. ఎంత ఆలోచన వుందో, అంత అనుభూతి వుంది. ‘అనగలిగాడు.
కవుల పట్ల, కుకవుల పట్ల చురకలేసే కవితలున్నాయి. మనసులో ద్వేషం పెట్టుకొని బాధపడే మిత్రులకు సాంత్వన వచనాలు చెపుతూ కల్మషం లేకుండా కలిసుండాలని చెప్పే కవితలున్నాయి.మిత్రుల పట్ల అంతులేని ఆపేక్ష ప్రదర్శించే కవితలున్నాయి.’ ఒక్కడు చాలు!’ అని మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి కోసం రాసిన కవిత దీనికి దృష్టాంతం.కవిత మొత్తం మిత్రడుని కలవరిస్తూ ‘ కళ్ళు తుడిచి భుజం చరిచి వెంట నిలచే / నీవంటి మిత్రుడు ఒక్కడు చాలు ‘ అని మైమరిచిపోతాడు.స్నేహితుల ఎడల ఎడతెరిపి లేని ఆప్యాయత కురిపిస్తాడు.’ కాలు కదపకు మిత్రమా’,
‘స్నేహం ఎంత మధురం’, ‘అతడు ఇక్కడే వున్నాడు’ లాంటి కవితలతో తన మిత్రులపై అపారమైన ప్రేమ గుమ్మరిస్తాడు. హృదయం తుంచి ముందు పెడతాడు. వ్యంగ్యంగా, హృదయ సౌందర్యంగా, ప్రకృతి ఉత్పాతాలకు తల్లడిల్లే వ్యక్తిగా, విధ్వంసకర అభివృద్ధిని దునుమాడే మనిషిగా, శ్రామికుల పక్షపాతిగా, బహుజన బంధువుగా, సాటి కవి గురువులను గౌరవించే కవిగా అనేక రూపాల్లో విద్యాధర్ ఈ పుస్తకంలో వ్యక్తమవుతున్నారు.
అంతరంగపు భాష అనే శీర్షిక ఈ పుస్తకానికి పూర్తిగా తగి యున్న శీర్షక. విద్యధర్ భాషలో ఒక తెలియని లయ వుంది. ఆత్మీయత వుంది. పఠితను వశపరుచుకోగల వ్యక్తీకరణ వుంది. భావజాల గందరగోళం లేకుండా చెప్పదలుచుకున్న, పంచదలుచుకున్న హృదయ సంస్కరాన్ని నేరుగా పాఠకుడితోనే పంచుకునే శైలి వుంది.
‘The world is full of poetry. The air is living with its spirit; and the waves dance to the music of its melodies, and sparkle in its brightness‘.అని James Gates Percival అన్నట్టుగానే ప్రపంచమంతా కవిత్వం నిండి వుంది. ఆ కవిత్వాన్ని పిండుకునేటప్పుడు జెల్ది విద్యాధర్ తన కవిత్వంలో ఇంకా Brevity ని , భిన్న వస్తువుని సాధించాల్సే వుంది. కొంత సాధనతో, మగ్నతతో, అధ్యయనం తో ఆయన దీనిని సాధించగలరు. వస్తువుని ఆర్థ్రంగా కవిత్వం చేసే విద్య ఆయన దగ్గర ఎలాగూ వుంది కనుక కవిత్వాన్ని చిక్కగా చేసే విద్య సులభంగానే అలవర్చుకోగలరు. దానికి తనలో వున్న సాధనసంపత్తి, జిజ్ఞాస, విద్వత్తును విద్యాధర్ కొద్దిగా మెరుగు పెట్టాలి అంతే.

పుస్తకం : అంతరంగపు భాష
కవి :
డా.జెల్ది విద్యాధర్ రావు
పేజీలు : 248
ప్రచురణ : పాలపిట్ట బుక్స్
వెల : 220/-
ప్రతులకు :
94904 69606

-పి.శ్రీనివాస్ గౌడ్
9949429449

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News