ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతి
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపి కబురు చెప్పింది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల లోపు కేంద్రానికి చేరుకోవాలని గతంలోనే ఇంటర్ బోర్డు ఆదేశించింది. తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారికి కూడా అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు కాస్త వెసులుబాటు కలిగింది.
రెండు రోజుల క్రితం పరీక్ష రాసేందుకు నిమిషం ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్పందించిన ఇంటర్‌బోర్డు అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తమై ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేసినట్లు సమాచారం. అయితే విద్యార్థులు మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, సమయానికే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.