Monday, December 23, 2024

కాంగ్రెస్‌తో కలిసే వామపక్షాల పయనం!?

- Advertisement -
- Advertisement -

మాణిక్‌రావ్ థాక్రేతో సిపిఐ నేత కూనంనేని చర్చలు
నాలుగు సీట్ల ప్రతిపాదన.. మూడు సీట్లిస్తే పొత్తుకు రెడీ..
రెండు సీట్లు ఆఫర్ చేసిన కాంగ్రెస్
నేడు సిపిఎంతోనూ కాంగ్రెస్ భేటీ..
పాలేరు, మిర్యాలగూడతో పాటు
మరో రెండు స్థానాలు కోరనున్న సిపిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : వామపక్షాలు కాంగ్రెస్‌తో కలిసి పయనించేందుకు రెడీ అవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినవస్తోంది. ఆ దిశగా వామపక్షాలు అడుగులు వేస్తున్నాయని పరిస్థితులు చెబుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా పొత్తుల కోసం ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ ఠాక్రే ,  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్తగూడెం, మునుగోడు స్థానాలను ఆయన కోరినట్లు సమాచారం.

ఇందులో మూడు స్థానాలను తమ అభ్యర్థులకు ఇస్తే హస్తం పార్టీతో పొత్తుకు సిద్ధమని సాంబశివరావు చెప్పినట్లు సమాచారం. మరోవైపు సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గం ఆదివారం సమావేశం అయింది. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సాయంత్రం వరకు ఈ కార్యవర్గ సమావేశం కొనసాగింది. బిఆర్‌ఎస్‌తో పొత్తు తెగదెంపుల నేపథ్యంలో సిపిఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే సిసిఎం నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వైఖరి, రాజకీయ ఎత్తుగడలు, తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బిజెపి ఓ విష కూటమి అని విమర్శించారు. బిజెపికి బిఆర్‌ఎస్ దగ్గర అవుతుందని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశలు అడియా శలయ్యాయయని విమర్శించారు. సిపిఎం, సిపిఐలతో పాటు ఇతర వామపక్షాలు, సామాజిక శక్తులతో కలిసి ఒక వేదిక ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే లౌకిక పార్టీలతో ముందుకు వెళ్తామని చెప్పారు. నిర్ధిష్ట ప్రతిపాదనలు వస్తే పొత్తులపై చర్చిస్తామని తెలిపారు. పొత్తులపై ఇప్పుడే తొందర అవసరం రాష్ట్ర పార్టీ నిర్ణయించిందని చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ధరల పెరుగుదలకు నిరసనగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు తెలంగాణ విప్లవ వార్షికోత్సవాలు జరపాలని నిర్ణయించడం జరిగిం దన్నారు. బిజెపి గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17ను హిందూ, ముస్లిం ఘర్షణలుగా వక్రీకరించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. మరోవైపు మునుగోడు, హుస్నాబాద్, కొత్తగూడెం, బెల్లంపల్లి స్థానాలపై సిపిఐ గురిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ రెండు సీట్లు (మునుగోడు, హుస్నాబాద్) ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు చేస్తున్న సిపిఎం నేతలు వచ్చే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు.

లెఫ్ట్ పార్టీలకు బిజెపితో పొసగదు కాబట్టి వామపక్షాలకు తెలంగాణలో ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు అవసరమైన సమయంలో పొత్తులు పెట్టుకున్నాయి. సిపిఐ, సిపిఎం నాయకుల మధ్య రహస్యంగా సమావేశాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటులో చర్చలు కొలిక్కి వస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ , సిపిఎం కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. సిపిఎం పాలేరు, మిర్యాల గూడతో పాటు మరో రెండు స్థానాలు అడుగుతుంది. నిర్ధిష్ట ప్రతిపాదన వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని పార్టీ నేతల సమావేశంలో తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం సిపిఎంతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. సిపిఐ మాజీ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నివాసంలో సిపిఐ నేతలు ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు విషయమై రెండు పార్టీల మధ్య చర్చల సారాంశాన్ని కూనంనేని చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డికి వివరించారు. బిఆరెఎస్‌తో పొత్తు చెడిన తరువాత వామపక్షాలకు కాంగ్రెస్ స్నేహ హాస్తాన్ని ఉపయోగించుకొని చట్టసభల్లో అడుగుపెడుతుందా? లేక సీట్లతో పంతానికి పోయి పోటీకీ మాత్రమే పరిమితం అవుతుందా, చూడాలి మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News