Monday, January 20, 2025

మరో విద్వేష చిత్రం!

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తన దుష్ప్రచార కళతో రాజకీయ తెరకెక్కించి విశేషంగా లాభపడిన కాల్పనిక ఇతివృత్తాలను నిజమైన తెర మీద చూపించి దండిగా డబ్బు మూటగట్టుకోడానికి చలన చిత్ర బ్రహ్మలు అలవాటుపడ్డారు. నిన్న ‘కశ్మీర్ ఫైల్స్’, ఇప్పుడు ‘కేరళ స్టోరీ’ చిత్రాలు ఈ విధంగానే ఊడిపడ్డాయని అనుకోడం పాక్షిక సత్యమే కావచ్చు. ‘కశ్మీర్ ఫైల్స్’ అనూహ్యమైన బాక్సాఫీస్ విజయం సాధించడం ఇటువంటి చిత్రాల వైపు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపించడానికి కారణమై వుండొచ్చు. ఈ చిత్రాలు మెజారిటీ మతస్థులైన హిందువులలో సాటి భారతీయులైన ముస్లిం మైనారిటీలపై ద్వేష భావాన్ని కొత్తగా కలిగిస్తాయని అనుకోలేము. అప్పటికే వారి పట్ల మతపరమైన విద్వేషంతో ఊగిపోతున్న వారికి ఈ సినిమాలు అదనపు మనో విందుగా పని చేయవచ్చు.

భారతీయ జనతా పార్టీ ఉద్దేశాలు, ఉచ్చుల గురించి పూర్తి అవగాహన గలవారిని మాత్రం ఇవేమీ చేయజాలవు. గత ఏడాది విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.340 కోట్లకు పైగా ఆదాయాన్ని చవిచూసిందని సమాచారం. కేవలం హిందీ సినిమాకే రూ. 252 కోట్ల పైచిలుకు వసూళ్ళు వచ్చాయని అనుకొన్నారు. కొవిడ్ తర్వాత రూ.250 కోట్లకు మించి సంపాదించిన మొదటి సినిమా అదే అని చెప్పుకొన్నారు. ఉగ్రవాదుల భయంతో కశ్మీర్ లోయ నుంచి పండిట్లు ఏ విధంగా ఒక ప్రవాహంలా బయటికి తరలిపోయారో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా తెలియజెప్పింది. ఉన్న దానికి అనేక రెట్లు పెంచి చూపించడం, గోరంతలు కొండంతలు చేయడం సినిమాలో మామూలే.

అయితే ‘కశ్మీర్ ఫైల్స్’లో చోటు చేసుకొన్న ఆ కాల్పనిక దృశ్యాలు ఎబ్బెట్టుగా వున్నాయని అప్పుడే అనుకొన్నారు. ఈ చిత్రం వాస్తవాలను వక్రీకరించిందని, విద్వేష ప్రచారానికే ప్రాధాన్యమిచ్చిందని, ఒక్క ముస్లింను కూడా మంచి వ్యక్తిగా చూపించలేదని విమర్శలు వచ్చాయి.ఒక నిజాన్ని దురుద్దేశంతో చూపించారని, పచ్చి అబద్ధానికి పట్టం గట్టారని సమీక్షల్లో పేర్కొన్నారు. పండిట్లను ప్రచారానికి ఉపయోగించుకొన్నారనే విమర్శ వెల్లువెత్తింది. ‘కేరళ స్టోరీ’ కూడా అదే పని చేసినట్టు బోధపడుతున్నది. లౌ జిహాద్ మానవ సంబంధాలపై దురుద్దేశ ప్రచారాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయింది. సహజంగా ప్రేమించుకొనే భిన్న మతస్థుల మధ్య వివాహానికి కూడా దురుద్దేశాలు అంటగట్టారు. ఉగ్రవాదులు ఒక పథకం ప్రకారం హిందూ యువతులపై వల వేసి ముస్లిం యువకులను పెళ్ళి చేసుకొనేలా చేస్తున్నారని, ఆ విధంగా వారు తమ మతాన్ని మార్చుకొనేలా చేస్తున్నారని ఒక కుట్రను అమల్లో పెట్టారు.

సినిమా కూడా దానినే భూతద్దంలో చూపించి వుండవచ్చు. అయితే దేశానికి సారథ్యం వహిస్తున్న అధికార పార్టీ పెద్దలు ఈ సినిమాలను వెనకేసుకు రావడమే బాధ కలిగించే విషయం. ‘కశ్మీర్ ఫైల్స్’ వాస్తవాన్ని చూపించిందని ప్రధాని మోడీ స్వయంగా మెచ్చుకొన్నారు. ఆ చిత్రాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కుట్ర నడుస్తున్నదని కూడా ఆయన అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ గొంతు చించుకొనే ముఠా సభ్యులు ఆగ్రహంతో ఊగిపోతున్నారని ఆ సినిమాను, అందులోని కళాత్మక విలువలను వాస్తవాల ప్రాతిపదికగా సమీక్షించడానికి బదులు దానిపై బురద చల్లడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ‘కశ్మీర్ ఫైల్స్’కు వినోదపు పన్ను కూడా మినహాయించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా చూడ్డానికి పోలీసులకు సెలవు ప్రకటించింది. ఈ నెల 5న విడుదలైన ‘కేరళ స్టోరీ’ గురించి మొన్న శుక్రవారం నాడు ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆ చిత్రం టెర్రరిజం వికృత ముఖాన్ని చూపించిందని, టెర్రరిస్టు దుస్తంత్రాలను ఎండగట్టిందని అన్నారు.

వివాదాస్పదమైన సినిమాల మీద దేశ ప్రధాని ఇలా మాట్లాడవలసిన అత్యవసరం లేదు. సినిమాలో ఏమున్నప్పటికీ సెక్యులర్ కేరళ సమాజం దానిని తగిన రీతిలోనే తీసుకొంటుందని, అది కల్పన మాత్రమే గాని, చరిత్ర కాదని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. ‘కేరళ స్టోరీ’పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కేరళలో లౌ జిహాద్ వున్నదని ఎక్కడా రుజువు కాలేదని, ఏ దర్యాప్తు సంస్థా నిర్ధారించలేదని ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రజల మనస్సులను కలుషితం చేస్తుందని ‘కేరళ స్టోరీ’ ని నిషేధించమని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వారు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేరళలో 32,000 మంది మహిళలు తప్పిపోయారని, వారిని ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాదులు తప్పుదోవ పట్టించి తీసుకుపోయి వుంటారని సినిమా టీజర్‌లో చూపించిన దాన్ని తొలగిస్తామని ‘కేరళ స్టోరీ’ నిర్మాతలు హామీ ఇవ్వడం సంతోషించవలసిన విషయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News