Sunday, December 22, 2024

‘ది కేరళ స్టోరీ’పై ఎందుకింత రచ్చ?.. సుప్రీంకు చేరిన సినిమా వివాదం

- Advertisement -
- Advertisement -

‘ది కేరళ స్టోరీ’లో నిజమెంత?
గోరంతను కొండంతగా చూపిస్తున్న వైనం
32,000 మంది యువతులు మాయం వాదనకు ఆధారాలు కరవు
‘కశ్మీర్ ఫైల్స్’లాగానే సంచలనం చేసే ప్రయత్నమా?
న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై వివాదం కొనసాగుతోంది. మే 5న విడుదల కానున్న ఈ సినిమాపై కేరళతో పాటుగా దేశవ్యాప్తంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇటువంటి సినిమాను విడుదల చేయవద్దంటూ కేరళలోని అధికార పార్టీలతో పాటుగా పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సినిమాపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ అంశాన్ని దర్యాప్తు ఏజన్సీలు, కోర్టులు, హోంమంత్రిత్వ శాఖ తోసిపుచ్చినప్పటికీ ప్రపంచం ముందు కేరళను అవమానించడం కోసం ఈ సమస్యను లేవనెత్తుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి రాజకీయాలు కేరళలో పని చేయవని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ‘ది కేరళ స్టోరీ’పై ఉన్న వివాదాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈ నెల 5న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రయలర్‌ను గత వారం విడుదల చేశారు. ట్రయలర్ విడుదలయినప్పటినుంచీ సినిమాలోని అంశం తీవ్రమైన వివాదానికి, చర్చకు కారణమైంది. దర్శకుడు సుదీప్తో సేన్ ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమయినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారి ఆచూకీ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అదాశర్మ కీలక పాత్ర పోషించగా యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విపుల్ అమృత్ లాల్ షా చిత్రాన్ని నిర్మించారు. గతంలో ఆయన ఆస్మా, ది లక్నో టైమ్స్, ది లాస్ట్ మాంక్ వంటి చిత్రాలను నిర్మించారు. ఓ నలుగురు యువతులు మతం మారి అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంలో కథ మొదలవుతుంది.

అయితే తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పని చేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారి తీసింది. సమాజంలో విషం చిమ్మేందుకు భావప్రకటనా స్వేచ్ఛ ఓ లైసెన్స్ కాదంటూ కేరళలోని విపక్షాలన్నీ మండిపడ్డాయి. కేరళలో ఈచిత్రం విడుదలను నిషేధించాలని ఆ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేరళలో ఎవరూ పట్టించుకోని బలవంతపు మత మార్పిడులను ఇది వెలుగులోకి తీసుకువస్తోందని చిత్రాన్ని సమర్థిస్తున్న వారు వాదిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశామని చిత్ర దర్శకుడు, నిర్మాత అంటున్నారు. అయితే ఈ చిత్రం తీసిన వారు చెప్తున్న దానికి ఎలాంటి సాక్షాధారాలు లేకపోవడం విశేషం. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే కేరళ రాష్ట్రం నుంచి 32,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారనేది. వారనందరినీ బలవంతంగా ఇస్లాంలోకి మార్చి ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లోకి చేర్చుకున్నారనేది సినిమా తీసిన వారి వాదన.

ప్రతి ఏటా సుమారుగా 2800-3,200 మంది ఇస్లాంలోకి మతం మారుతున్నారంటూ 2010లో అప్పటి ముఖ్యమంత్రి ఊమన్ చాందీ ఓ నివేదికను శాసన సభకు సమర్పించారని యు ట్యూబ్ చానల్ ‘ఫెస్టివల్ భారత్’కు ఇచ్చిన ఇంటర్వూలో చిత్ర దర్శకుడు అని సుదీప్తో సేన్ చెప్పారు. ‘పదేళ్ల కాలానికి ఈ సంఖ్యను లెక్క వేస్తే 32 వేలనుంచి 33 వేల మంది అమ్మాయిలు అవుతారు’ అని ఆయన అన్నారు. సినిమాలో వారు చూపించిన సంఖ్య కూడా ఇదే కావడం గమనార్హం. తాను ప్రశ్నించినప్పుడు చాందీ ఈ లెక్కలను తిరస్కరించారని సేన్ చెబుతూ అయితే తన వాదనను నిరూపించడానికి తన దగ్గర సాక్షాలున్నాయన్నారు. అయితే సేన్ చెప్పిన గణాంకాలకు సంబంధించి 2010 నాటి డాక్యుమెంట్ ఏదీ లేకపోవడం విశేషం.అంతకన్నా పెద్ద వాదన ఏమిటంటే కేరళనుంచి 32,000 మంది అమ్మాయిలు ఇస్లాం మతంలోకి మారడమే కాకుండా వారంతా కనిపించకుండా పోయారని, వారంతా జిహాదీలుగా పోరాటం చేయడానికి ఐసిస్‌లోకి రిక్రూట్ చేయబడ్డారనేది.

తన కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఐసిస్ చాలా కాలంగా భారత్‌పై కన్నేసి ఉందనేది వాస్త్తవం. ఐసిస్‌లో జిహాదీలుగా రిక్రూట్ అయిన వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారని 2013లో సిరియానుంచి వచ్చిన వార్తలు పేర్కొన్నప్పటినుంచీ భారతీయ ఇంటెలిజన్స్ ఏజన్సీలు దానిపై కన్నేసే ఉన్నాయి. అప్పటినుంచి ఐసిస్‌తో కలిసి పోరాడడం కోసం మన దేశంనుంచి చాలా మంది సిరియాకు వెళ్లడం, అక్కడినుంచి వారు తిరిగి వచ్చినప్పుడో లేదా అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడో దాదాపు వందమందిని అరెస్టు కూడా చేశారు. కాగా ఇప్పటివరకు 155 మంది ఐసిస్ కార్యకర్తలు, సానుభూతిపరులను ఎన్‌ఐఎ, ఇతర భద్రతా ఏజన్సీలను అరెస్టు చేసినట్లు 2019లో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంటులో ప్రకటించారు కూడా. అయితే భారత్‌లోని ముస్లిం జనాభాతో పోలిస్తే ఐసిస్ లో చేరాలనుకునే వారి సంఖ్య నామమాత్రంగా ఉండడం గమనార్హం.

2020 నవంబర్ నాటికి ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న ఫైటర్ల సంఖ్య 66గా ఉందని అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ నివేదిక కూడా వెల్లడించింది. అయితే ‘ది కేరళ ఫైల్స్’ సినిమా చెప్తున్న దానికి ఆధారమేంటి? ఈ సినిమాలో చూపించిన నలుగురు యువతులు కూడా ఐసిస్‌లో 2016నుంచి 2018 మధ్య కాలంలో తమ భర్తలతో కలిసి అఫ్గానిస్థాన్ వెళ్లారని, వారంతా కూడా అఫ్గాన్ జైల్లో ఉన్నారనే ఉదంతం ఆధారంగా దీన్ని తీశామని వారు చెప్తున్నారు. నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా, మేరిన్ అలియాస్ మిరియమ్, సోనియా సెబాస్టియన్ అలియాస్ అయిషా, రఫాయెల్లా అనే కేరళకు చెందిన ఈ నలుగురు యువతుల ఇంటర్వూలు 2019 డిసెంబర్‌లో ‘స్టార్‌న్యూస్ గ్లోబల్’ అనే వెబ్‌సైట్ ప్రచురించింది. కేరళలో ఐసిస్ రిక్రూట్‌మెంట్లను భూతద్దంలో చూపించడానికి సినిమా నిర్మాతలు ఈ నలుగురు యువతుల కథను ఉపయోగించుకున్నారు. అంతే తప్ప ఇంత భారీ సంఖ్యలో కేరళలో యువతులు మాయం అయ్యారనే దానికి ఆధారాలు మాత్రం ఎక్కడా లేవనేది ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వారు వాదన. ‘ది కశ్మీర్ ఫైల్స్’లాగానే సంచలనం చేసే యత్నమని వారంతా అంటున్నారు. అయితే తాను ఈ సినిమా కోసం ఏడేళ్లు కేరళలో రిసెర్చ్ చేశానంటున్న సేన్.. సినిమా విడుదలయిన తర్వాత మాట్లాడండి అని అంటున్నారు.

కొన్ని సీన్లు తొలగింపు
కాగా ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలను తొలగించాలని సూచ్చింది. మరి కొన్ని డైలాగుల్లో మార్పులు చేయాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సినిమాలో విద్వేష పూరిత ప్రసంగాలు, వీడియోలు ఉన్నాయన్న అభ్యర్థనలపై కోర్టు స్పందిస్తూ, ‘ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. మీరు దీని విడుదలను సవాలు చేయాలనుకుంటే ఆ సర్టిఫికెట్‌తో తగిన ఫోరంను సంప్రదించండి’ అని న్యాయమూర్తులు కెఎం జోసెఫ్, బివి నాగర్తనలతో కూడిన బెంచ్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News