Wednesday, January 22, 2025

విడుదలకు ముందే వివాదంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా!

- Advertisement -
- Advertisement -

కొచ్చి: అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. కేరళ నుంచి దాదాపు 32,000 మంది అమ్మాయిలు తప్పిపోవడాన్ని ఇతివృత్తంగా చేసుకుని తీసిన చిత్రం ఇది. అయితే అలా తప్పిపోయిన వారిలో చాలా మంది ఉగ్రవాద గ్రూపయిన ‘ఐసిస్’లో చేరినట్లు చూపారు. ఈ సినిమా మే 5న థియేటర్లలో విడుదల కానున్నది. కానీ కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ ఈ చిత్రంను వ్యతిరేకిస్తున్నాయి. ప్రదర్శించకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, నటులు ఈ చిత్రం ఉగ్రవాదులను ఉద్దేశించిందే తప్ప ముస్లింలను ఉద్దేశించింది కాదంటున్నారు. పైగా ఇది కేరళను లక్ష్యంగా చేసుకుని తీసింది కాదంటున్నారు.

దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ ‘నేను ఈ సినిమాను ఎన్నో నెలలు పరిశోధించి తీశాను. ఏ నిర్మాత కూడా దీనికి మద్దతునివ్వలేదు. దాంతో నా దృష్టికోణం మారింది. నేను బాధితులతో మాట్లాడాక చాలా చలించిపోయాను’ అన్నారు. ఇక నిర్మాత విపుల్ షా మాట్లాడుతూ ‘ఈ సినిమా కేరళకు నష్టం చేసేదేమి కాదు. ఈ సినిమాలో కేరళను తక్కువ చేసి చూపిందంటూ ఏమీ లేదు. ఈ సినిమా ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని తీసిందే తప్ప, ముస్లింలను ఉద్దేశించి తీసింది కాదు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ సినిమాను చూశాకే మాట్లాడితే బాగుంటుంది’ అన్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘ఈ సినిమా సంఘ్ పరివార్ ప్రచారంలా ఉంది. మత తీవ్రవాదానికి కేరళ కేంద్రంగా ఉన్నట్లు చూపెట్టారు. లవ్ జిహాద్ అంశాన్ని ఈ సినిమాలో చూపారు. లవ్ జిహాద్ అంశాన్ని ఇప్పటికే కోర్టులు, దర్యాప్తు సంస్థలు, కేంద్ర హోం శాఖ సైతం తిరస్కరించాయి’ అన్నారు. ఈ సినిమా కథా రచయిత, దర్శకుడు సుదీప్తో సేన్. మహిళలను ర్యాడికలైజ్ చేసి భారత్‌లోనూ, ప్రపంచంలోనూ ఉగ్రవాదానికి వారిని వాడుకుంటున్నారని ఈ సినిమాలో చూయించే ప్రయత్నం చేశారు. కన్నూర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సిబ్బందిపై దాడి కూడా జరిగింది. ఈ సినిమాలో నటించిన అదా శర్మకైతే బెదిరింపులు కూడా అందాయి.

త్వరలో విడుదల కానున్న ఈ సినిమాను సిపిఐ, సిపిఐ(ఎం), కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి. భావస్వేచ్ఛ అంటే సమాజంపై విషం చిమ్మడం కాదని అంటున్నాయి. కేరళలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికే ఈ సినిమా యత్నిస్తోందన్నారు. అయితే ‘సినిమా చూడక ముందే ఓ నిర్ణయానికి రావొద్దు’ అని దర్శకుడు సుదీప్తో సేన్ అందరినీ కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News