Monday, December 23, 2024

ఓటర్లపై బూటకపు సినిమాల వల

- Advertisement -
- Advertisement -

జాగృతమవుతున్న ప్రజాతంత్ర చైతన్యాన్ని గణనీయమైన మేరకు మతతత్వ ధోరణులలో మరలించడానికి అన్ని రకాల మాధ్యమాలను విస్తృతంగా వాడుకొని రాజకీయంగా మలుచుకోవాలనే అత్యాశతో, దురుద్దేశంతో బిజెపి సినిమా రంగాన్ని ఎఫెక్టివ్‌గా వాడుకుంటుందన్నది వాస్తవం. మొన్నటికి మొన్న ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా ద్వారా దేశంలో తాను చేసిన ఘనకార్యంగా ప్రగల్భాలు పలికి ప్రజలను మెప్పించడానికి సినిమాను ప్రభుత్వమే ప్రమోట్ చేసేంత స్థాయికి దిగజారింది. కాని అక్కడున్న కశ్మీర్ పండిట్‌లు మాత్రం ఈ సినిమాను తిప్పికొట్టడం బిజెపికి చెంపపెట్టు! నిన్నటి ఎన్నికలో ‘కేరళ స్టోరీ’ సినిమాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధానే బహిరంగంగా ప్రచారంలో వాడుకోవడం రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం. అనేక తప్పుడు సందేశాలతో వాట్సాప్‌ల్లో నిత్యం ప్రజలకు అబద్ధపు సమాచారాన్ని ఒక ప్రాపగండాగా చేసుకొని పనికట్టుకొని మరీ వాస్తవాలను వక్రీకరిస్తూ తాత్కాలిక భావోద్వేగాల్లో ప్రజలను ముంచెత్తి కాలం వెళ్లబుచ్చుతున్న తరుణంలో సినిమాను కూడా ఇలాంటి తప్పుడు విషయాల ప్రచారాలకు వేదికగా మలుచుకొని నిత్యం మత రాజకీయాలను ప్రేరేపిస్తూ అభివృద్ధిని గాలికి వదిలేసిన కేంద్రానికి కర్ణాటక ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు.

‘కేరళ స్టోరీ’ సినిమాలో కేవలం ముస్లింలను విలన్లుగా చూపించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమా మిస్ ఫైర్ అయ్యి బిజెపి పరిపాలనపై అనుమానాలు రేకెత్తించడం ఆసక్తి రేపుతోంది. దేశంలోని విదేశాంగ శాఖ, ఇంటలిజెన్స్ సంస్థల పనితీరుపై ప్రజలను ఆలోచనలో పడేసిన మాట వాస్తవం. ఇటలీ, సిరియా దేశాల్లో ఇంత దారుణం జరుగుతున్నా దాన్ని కనిపెట్టలేక ఇండియన్ వ్యవస్థలు వైఫల్యం అయ్యాయా అన్నఅనుమానాలు లేకపోలేదు. కేవలం కమ్యూనిస్టు రాష్ట్రం అయినటువంటి అత్యంత విద్యావంతులున్న కేరళలో బిజెపి పాచికలు పారకపోవడంతో ఏదో రకంగా నిందించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న అత్యాశ తీరకముందే, సాక్షాత్తు ప్రధాని సొంత రాష్ట్రం బిజెపి పాలనలో ఉన్నటువంటి గుజరాత్‌లో ఇటీవలే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గడిచిన ఐదేళ్లలో నలభై వేల పైచిలుకు మహిళలు మిస్ అయినట్టు విస్తుగొలిపే విషయాలను వెలిబుచ్చితే ఇదే బిజెపి పార్టీ సమాధానం చెప్పలేక గుటకలు మింగుతోంది.

దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువై చేసుకున్న భర్తకు ఉపాధి అవకాశాలు లేక తాగుడుకు, మాదకద్రవ్యాలకు బానిసైతే, కన్న బిడ్డల్ని పోషించలేక, సరైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని అందించలేక, కుటుంబాన్ని పోషించలేక, బతుకీడ్చలేక దిక్కుతోచని స్థితిలో బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడిన పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ఒళ్ళు అమ్ముకోవడానికి సైతం జడవని దీన స్థితిలో మన మధ్యనే నిత్యం అన్ని మతాలకు చెందిన మాతృమూర్తులైన భారత మాత బిడ్డల జీవన స్థితిగతులను మార్చడానికి ప్రభుత్వంగా తీసుకుంటున్న కార్యక్రమాలు, ఆర్థిక తోడ్పాటును, అనుసరిస్తున్న విధానాలను వివరించాల్సిన కేంద్రమే చేష్టలుడిగి చిల్లర రాజకీయాలకు తెరలేపడం, ప్రపంచంలోనే అత్యంత ఔన్నత్యమైన ఆధ్యాత్మిక హిందుత్వాన్ని హైజాక్ చేసి రాజకీయ హిందువులుగా అవతారమెత్తి కేవలం అధికారంపై అత్యాశతో ఓట్ల కోసం అతి పవిత్రమైన హిందూ ధర్మాన్ని నడి బజారుకీడ్చడం వెనుక కుట్రలను హిందూ సమాజం గమనిస్తూనే ఉన్నదనేది వాస్తవం.

ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాజ్యాంగ పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన ఉప రాష్ట్రపతులను ఆహ్వానించకుండా సన్యాసులతో కూడి పట్టాభిషేకం లాగా చేసుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిచ్చి అవమానించిన ఘనత ప్రధానిదే..! అదే విధంగా దేశానికి ఎన్నో పథకాలు తెచ్చిపెట్టిన మహిళా రెజ్లర్లను బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు చేస్తూ నూతన పార్లమెంట్ భవనం ఆవరణలో శాంతియుతంగా నిరసన తెలిపిన వారిలో హిందువులు, ముస్లింలు అన్ని మతాల మహిళలు ఉన్నప్పటికీ కనీసం కమిటీ వేసి విచారణ జరిపించకపోగా ఢిల్లీ పోలీసు బలగాలతో ఈడ్చిపారేసి నిర్బంధించిన కేంద్రం మహిళల గురించి మాట్లాడుతూ మొసలికన్నీరు కార్చడం విడ్డ్డూరమే?.
మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 2014లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జిహెచ్‌ఐ)లో 120 దేశాల్లో భారత్ ర్యాంక్ 55 గా ఉండేది, ఇటీవల 2023వ సంవత్సరంలో విడుదలైన ఆకలి సూచీలో పాకిస్థాన్, శ్రీలంక దేశాల కంటే దిగువకు పడిపోయి, అఫ్ఘానిస్తాన్ కంటే కొంచెం మెరుగుగా 121 దేశాల్లో 107 స్థానానికి దిగజార్చిన కేంద్ర ప్రభుత్వ పాలనను చూస్తుంటే ‘ఆకలిగొన్న వాడొక్కడు మిగిలి ఉన్నా నీకు మతాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు’ అన్నటువంటి మహానుభావుడైనటువంటి హిందూ మత ఔన్నత్యాన్ని దేశపు ఎల్లలు దాటి ఖండాంతరాలకు ప్రచారం చేసిన వివేకానందుని వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తొస్తున్నాయి.

‘కేరళ స్టోరీ’లో గడిచిన పదేళ్ళలో అంటూ నిరాధార పూరితమైన లెక్కలతో సినిమా తీస్తే చిత్ర యూనిట్‌కు బిజెపి పాలితలోని యోగి లాంటి ప్రభుత్వాలు సత్కారాలు, సడలింపులు ఇస్తుండడం, తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లాంటి వాళ్ళు హిందూ ఏక్తా యాత్ర పేర నిర్వహించిన మతపరమైన కార్యక్రమాల్లో గెస్ట్‌లుగా పిలుచుకోవడం విడ్డూరమైన అంశమే! వాస్తవాలను కాకుండా ఫిక్షన్ కథలతో చరిత్రను వక్రీకరించే సినిమాలనే పనిగా పెట్టుకొని చేస్తున్న ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కి ముందుగానే తాయిలంగా రాజ్యసభ సీటుఇచ్చి తప్పుగా తెలంగాణ చరిత్రను తెర మీద ఎక్కించే బాధ్యతలు కట్టబెట్టి, ఏదైతే చరిత్ర పుస్తకాల్లో నిజమైన చరిత్రను చెరిపేసినట్టు అదే విష ప్రయోగాన్ని తెలంగాణపై చేయాలని చూస్తున్న బిజెపిని తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి అంశాల వారీగా విభేదించాలి, అభివృద్ధిలో పోటీపడే విషయాలను చర్చకు లేవనెత్తి ప్రజలకు విపులంగా వివరించాల్సిందిపోయి, ఎంతకైనా తెగిస్తామని ఓవైపు హెచ్చరిస్తూనే, రజాకార్ ఫైల్స్ సినిమా తీస్తామని బెదిరిస్తూ, లవ్‌జిహాదీ వంటి పద ప్రయోగంతో ముస్లింలను బూచిగా చూపిస్తూ అధికార పీఠం దక్కించుకోవాలని అత్యాశపడితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెలివి హీనులు, పాలనా అసమర్థుల చేతిలో పెట్టె సాహసం తెలంగాణ ప్రజానీకం ముమ్మాటికీ చేయదు. వీర తెలంగాణ పోరాటాన్ని సైతం విమోచన దినోత్సవాల పేరిట మత కోణంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరూ చెవిన పెట్టకపోవడం తెలంగాణ ప్రజా చైతన్యానికి నిదర్శనం.

కేవలం ప్రజల్లో ద్వేషాన్ని నింపడమే ధ్యేయంగా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడమే విధిగా ఎంచుకున్న బిజెపి గడిచిన ఎనిమిదేండ్లలో పేదరికం నిర్మూలనకు, నిరుద్యోగం రూపుమాపడానికి, పేదధనిక వ్యత్యాసాలను తగ్గించడానికి, అవినీతి నిర్మూలనకు అమలు చేసిన ఏ ఒక్క విధానమున్నా వాటిని చెప్పుకొని ఓట్లు అడుక్కోవాలి కానీ, సాక్ష్యాత్తు ప్రధానే మత ప్రవక్త అవతరమెత్తి భజరంగ భళీ వంటి నినాదాలు ఇవ్వడం తన పాలనా అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఎప్పటిలాగే మత రాగాన్ని ఎత్తుకున్నారన్నది తెలివైన కన్నడ ఓటర్లకు అర్ధమయింది. న్యాయ వ్యవస్థలోకి సైతం చొరబడి తమకు అనుకూలమైన తీర్పులు ఇచ్చిన జడ్జీలకు పదోన్నతులను కల్పిస్తున్న దుస్థితిలోకి వ్యవస్థను దిగజార్చారనడానికి రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసిన జడ్జికి పదోన్నతులపై సుప్రీంకోర్టు స్టే విధించడం వంటి ఉదాహరణలు, తమకు అనుకూలమైన జడ్జిలు పదవీ విరమణ అయిన తరువాత రాజ్యసభ సభ్యులుగా నియమించడం చూస్తుంటే తీర్పుల విషయంలో క్విడ్ ప్రో కో స్పష్టంగా కనిపిస్తోంది.

ఓడినదే తరువాయి అత్యంత నీచ స్థాయికి దిగజారి అక్కడి ప్రజలపై బురద చల్లేందుకు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు ఇచ్చారని వాట్సాప్ యూనివర్శిటీల ద్వారా పెద్డ ఎత్తున వైరల్ చేసిన వారిని కన్నడ పోలీస్ యంత్రాంగం పట్టుకుని నిలువరించి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టారు. కేంద్రం సహకారం వీసమెత్తు లేకున్నా అభివృద్ధిలో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న తెలంగాణపై బిజెపి కన్నుపడ్డది. కర్ణాటకలో వాడిన రెట్టింపైన అస్త్రశస్త్రాలు ఇక్కడ వాడేందుకు కసితో ఉన్న పార్టీని చావు దెబ్బ కొట్టేందుకు తెలంగాణ సమాజం సిద్ధమైంది. ఇప్పుడు అన్ని రంగాల చైతన్యశీలులు, సామాజిక కార్యకర్తలు, కవులు, కళాకారులు, రచయితలు వొంకింత అప్రమత్తంగా ఉంటూ ఎప్పటి కప్పుడు దుష్ప్రచారాలను తిప్పికొట్టే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుని తెలంగాణ నేలను, భారత మాతను విచ్ఛిన్నవాదులు, విధ్వంసకారుల చెర నుండి విముక్తి కావించాల్సిన సమయం ఆసన్నమైంది.

ముఖేష్ సామల
9703973946

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News