వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికలు భిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు గల దేశ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయనున్నాయి. ఇక్కడ, అక్కడ అనకుండా దేశ మంతటా అన్ని రాష్ట్రాల్లోనూ బలంగా వేళ్లూనుకొని యావద్భారతీయ జనతా పార్టీ అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బిజెపికి ఈ ఎన్నికలు పరీక్ష ఘట్టాలు కానున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో విశేష విజయాలతో తొలిసారిగా లోక్‌సభలో సొంతంగా మెజారిటీ స్థానాలు గెలుచుకొని వివాదాస్పద నిర్ణయాలను నిర్భయంగా తీసుకోడం ప్రారంభించిన బిజెపి ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా నిరూపించలేకపోయింది. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు అక్కడ దాని ప్రతిష్ఠ తగ్గినట్టు రుజువు చేశాయి. హర్యానాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని కోల్పోయి జన నాయక్ జనతా పార్టీ మద్దతుతో అధికారంలోకి రావలసి వచ్చింది.
మహారాష్ట్రలో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ శివసేన దూరం కావడంతో అంతిమంగా ప్రతిపక్షంలో స్థిరపడక తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ను ఫిరాయింపుల మంత్ర పఠనంతో తొలగించి అప్రతిష్ఠాకరంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ చేతిలో ఓడిపోయింది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పూర్వం కంటే బాగా పుంజుకున్నప్పటికీ అతి పెద్ద పార్టీగా అవతరించిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) తర్వాతి పార్టీగా సరిపెట్టుకోవలసి వచ్చింది. బాగా బలహీనపడిపోయిన జెడి(యు) మద్దతుతో బొటాబొటీ మెజారిటీ నిరూపించుకొని మళ్లీ నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిత్వం కిందనే ప్రధాన పాలక భాగస్వామి కాగలిగింది. గత పార్లమెంటు ఎన్నికలతో పాటే జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ సమరాల్లో ప్రాంతీయ పక్షాలైన వైఎస్ఆర్సిపి, బిజూ జనతాదళ్ పార్టీలు అధికారం సాధించుకున్నాయి. జార్ఖండ్ కూడా బిజెపి చేజారిపోయింది.
ఆ విధంగా మొత్తం దేశమంతటా తానే ఉండాలనే బిజెపి కాంక్షకు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తూట్లు పొడుస్తున్నాయి. నాలుగు మాసాల్లో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కీలకమైనవి. ఈ మూడు చోట్ల ఇటీవల జనాభిప్రాయ మచ్చులు సేకరించిన ఐఎఎన్ఎస్ సి ఓటర్ సర్వే ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఆశాజనకంగా లేవు. సిపిఐ(ఎం) ఆధ్వర్యంలోని వామపక్ష ఐక్య సంఘటన (ఎల్డిఎఫ్) పాలనలో ఉన్న కేరళలో సంప్రదాయ విరుద్ధంగా వరుసగా రెండో సారి ఆ కూటమే అధికారంలోకి రానున్నదని ఈసర్వే జోస్యం చెప్పింది. ఆ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అంచనాలకు విరుద్ధంగా ఎల్డిఎఫ్ గెలుపొంది ఆశ్చర్యం కలిగించింది. విజయన్ ప్రభుత్వం పై వచ్చిన అవినీతి ఆరోపణలేవీ దాని ప్రాబల్యాన్ని తగ్గించలేదని రుజువైంది. ప్రత్యామ్నాయ కూటమి యుడిఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఈ ఫలితాలు వణుకు పుట్టించాయి. తమిళనాడులో పదేళ్లుగా అధికారానికి దూరం గా ఉన్న డిఎంకె ఈసారి మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని ఈ సర్వే చెబుతున్నది.
జయలలిత మరణం తర్వాత ఈ దక్షిణాది రాష్ట్రంలో విశేష ప్రాబల్యం గడించి అధికారంలోకి రావడానికి బిజెపి ఎంతగా తాపత్రయపడుతున్నదో తెలిసిందే. నాయకురాలి మృతితో చుక్కా ని లేని నావను తలపించిన ఎఐఎడిఎంకెకి వెనుక నుంచి గట్టి దన్నుగా ఉంటూ ఆ పార్టీలోని ప్రత్యర్థి వర్గాల మధ్య రాజీ కుదిర్చి దాని ప్రభుత్వాన్ని ఇంత వరకు కొనసాగేలా చేసిన బిజెపి వ్యూహం అంతిమంగా అక్కడ అధికార చక్రాన్ని చేజిక్కించుకోడమే. అయితే ఆ రాష్ట్రంలో ప్రజాభిప్రాయం డిఎంకెకే అనుకూలంగా ఉన్నదన్న సూచనలు కమలం పార్టీ నేతలకు కంటి మీద కునుకు పట్టించకపోడం సహజం.
గత పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో 20 స్థానాలు గెలుచుకొని ఔరా అనిపించిన బిజెపి ఆ రాష్ట్ర అధికార పగ్గాలను చేజిక్కించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, బిజెపి కార్యకర్తల మధ్య సాగుతున్న అనునిత్య వీధి పోరాటాలు కళ్లముందున్నవే. చివరికి ఆ రాష్ట్ర గవర్నర్ కూడా బిజెపి అగ్ర కార్యకర్త లాగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ల్లో బిజెపి బలం పుంజుకుంటుందే గాని అధికారంలోకి రాబోదని ఐఎఎన్ఎస్ సి ఓటర్ సర్వే చెబుతున్నది. తృణమూల్ కాంగ్రెస్ బలం తగ్గినా ఆ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందన్నది ఈ సర్వే జోస్యం. ఇవి ఇలాగే జరుగుతాయని అనుకోవలసిన పని లేదు. కాని ఈ మూడు రాష్ట్రాల్లో బిజెపి వ్యూహాలు ఫలించడం సులువు కాదని మాత్రం అనుకోవలసి ఉంది.