Monday, January 20, 2025

చట్ట సభల్లో కమ్యూనిస్టుల లోటు సుస్పష్టం

- Advertisement -
- Advertisement -

సిపిఎం ఎన్నికల ప్రచార పాటల సిడి ఆవిష్కరణలో ఎస్.వీరయ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : గత ఐదేండ్లలో శాసనసభలో కమ్యూనిస్టులు లేని లోటు స్పష్టంగా కనిపించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. చట్టసభల్లో ఆర్థిక ప్రయోజనాలు, అధికార దాహం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు పరస్పరం తిట్లు, శాపనార్ధాలు పెట్టుకుంటున్నారనీ, ప్రజల సమస్యలపై చర్చే ఉండట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో శుక్రవారం పిఎన్‌ఎం ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్నికల ప్రచార పాటల సిడిని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.జ్యోతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ్మా పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా లోపించిందని వాపోయారు. రాజ్యాంగ పరంగా కొన్ని బిల్లులను ప్రవేశపెట్టాలి, ఆమోదించుకోవాలి కాబట్టే శాసనసభను పెడుతున్నారన్నారు. రాజ్యాంగ నిర్దేశాలే లేకుంటే ఈ మాత్రం కూడా సభలను పెట్టేవారు కాదని విమర్శించారు. ఒకప్పుడు 30-40 రోజులు జరిగే బడ్జెట్ సమావేశాలను ఇప్పుడు నాలుగైదు రోజుల్లోనే ముగించేస్తున్న తీరును ఎత్తిచూపారు. అలాంటి పరిస్థితి పోవాలంటే శాసనసభకు కమ్యూనిస్టులను గెలిపించి పంపాలని ప్రజలను కోరారు.

ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడటంలో ఎర్రజెండానే ముందుంటుందనీ, ఎవ్వరు పోరాడినా వారికి అండగా ఉండేది ఈ జెండానే అని అన్నారు. కమ్యూనిస్టేతర పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడింది లేదనీ, పోరాడుతున్న పేదలకు అండగా నిలిచిందీ లేదని అన్నారు. ఇలాంటి విషయాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజానాట్యమండలి పాటల సిడిని తేవడం మంచి పరిణామం అనీ, ఆ పాటలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేకతను సంతరించుకున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులు సుత్తి-కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి ప్రజలు గెలిపించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News