చిన్నచింతకుంట: అభిమానులు సన్నిహితుల వివిధ పార్టీల నేతల అశ్రునయనాల మధ్య టిడిపి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. కొత్తకోట దయాకర్‌రెడ్డి అనారోగ్యంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే ఆయన అభిమానులు ఆయన స్వంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని పర్కాపూర్ గ్రామానికి భారీగా తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు మాజీ దయాకర్‌రెడ్డి పార్థివదేహాన్ని తీసుకొచ్చారు.
అభిమానుల సందర్శనార్థం ఉంచగా తమ నేతను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా వచ్చి నివాళులు అర్పించారు. దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని ప్రాంతాల నుంచి పలు పార్టీలకు చెందిన నాయకులు, అభిమానులు తరలిరావడంతో జన సందోహం నెలకొంది. రాజకీయ అనుభవంతో పాటు నిక్సాన మనస్తత్వంతో విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ప్రజాసేవ ధ్యేయంగా పనిచేసిన మహానేత ఇక లేరని, ఇలాంటి నేత ప్రస్తుత రాజకీయాల్లో కనిపించరని అభిమానులు గుర్తు చేసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యేకు ప్రముఖుల సంతాపం
కొత్తకోట దయాకర్‌రెడ్డి మృతి పట్ల టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేస్తూ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియలో కొత్తకోట దయాకర్‌రెడ్డి పాడేను చంద్రబాబు మోశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కొత్తకోట దయాకర్‌రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి , బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, మాజీ మంత్రులు డీకే అరుణ, జి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.