మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గురువారం రాత్రి ఐడిఓసిలోని కాన్ఫరెన్స్ హాళ్లో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిధిగా మంత్రి పాల్గొని ప్రసంగించారు.
ఒకప్పుడు తండాలు, గ్రామాల్లో తాగునీరు లభించక అవస్థలు పడేవారమని, విద్యుత్ అంతరాయాలతో సతమతమైయ్యేవారమని పేర్కోన్నారు. తెలంగాణ ఏర్పాటైయ్యాక కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడిందన్నారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. తడి పొడి చెత్తను సేకరణతోపాటు సెగ్రిగేషన్ షెడ్స్, డంపింగ్ యార్డు నిర్మించుకుని వ్యర్థాలను ఎరువుగా మార్చుకుని ఆదాయం సమకూర్చుకుంటున్నామని వివరించారు.
మానుకోటలో వంద కోట్ల అభివృద్ధితో పురోగతిలో ఉందన్నారు. సంక్షేమ పథకాలకు చిరునామా దివంగత నేత ఎన్టీఆర్ అయితే దానిని శాశ్వతంగా రూపకల్పన చేసింది కేసీఆర్ అని పేర్కోన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు కెసిఆర్ నిలిచారన్నారు. పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్లు, ఆరు శాతంగా ఉన్న గిరిజన ఉద్యోగాల రిజర్వేషన్లను పది శాతానికి పెంచుకోగలిగామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించడం తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నామన్నారు. గతంలో కేంద్ర పథకాలకు 80 శాతం నిధులు ఉంటే రాష్ట్రాలు 20శాతం భరించేవని నేడు ఆ పరిస్థితి లేదని కేంద్రమే 20 శాతం ఉంటే రాష్ట్రమే 80 శాతం భరిస్తోందని మంత్రి అన్నారు.
కలెక్టర్ కె.శశాంక మాట్లాడుతూ గ్రామపంచాయతీలు పారిశుద్ధ్యం మెరుగుపర్చడంతో అంటూ వ్యాధులు దూరమైయ్యాయని నేడు డయేరియా వంటి వ్యాధులు కనుమరుగైయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతిని ప్రత్యక్షంగా ఆస్వాదిస్తున్నామన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం నేడు సాకారం దిశగా కొనసాగుతుందన్నారు. గ్రామాలు సుభిక్షింగా వర్ధిల్లుతున్నాయని తాగునీటిలోనూ పారిశుద్ధ్యంలోనూ ప్రజల వెతలు తీరాయని పేర్కొన్నారు. గతంలో సంవత్సరాదాయం 28 కోట్లు ఉంటే నేడు 98 కోట్లకు చేరుకుందన్నారు.
ఈ సందర్భంగా ఫోటో ఎగ్జిభిషన్‌ను తిలకించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ సత్కరించి అవార్డులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, శిక్షణ కలెక్టర్ పింకేష కుమార్, జెడ్పీ సీఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మైన్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, తొర్రూరు జెడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీపీ మౌనిక, డీపీవో నర్మద, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, వాచర్లు, పంచాయితీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.