Tuesday, December 17, 2024

చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరికాదు

- Advertisement -
- Advertisement -

కేసుల జోలికి వెళ్ళడం లేదన్న మందకృష్ణ మాదిగ

మన తెలంగాణ / హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంపై ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 74 ఏళ్ల వయసున్న ఓ మాజీ ముఖ్యమంత్రితో పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే వారు పాలకుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా స్పష్టమవుతోందని మందకృష్ణ అన్నారు. ఆయన వయసును, హోదాను ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. చంద్రబాబు మాజి ముఖ్యమంత్రి అని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ కు చెప్పాల్సిన అవసరం ఉందని మంద కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇలాంటి ప్రాథమిక సూత్రాన్ని పోలీసులు ఉల్లంఘించారని అన్నారు. తనను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు అడిగితే పోలీసులు సరైన సమాధానం చెప్పలేకపోవడం చూస్తే ఆయన చేసిన నేరం, నేరారోపణలు కంటే ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలను పాటించడమే శిరోధార్యం అన్నట్టుగా పోలీసుల తీరు ఉందని విమర్శించారు. ‘చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల పూర్వాపరాల జోలికి మేం వెళ్లడంలేదు. తప్పు జరిగిందా, లేదా అనేది తేల్చడానికి మేం సిద్ధంగా లేం. అది న్యాయస్థానంలో అంతిమంగా తేలాల్సిన విషయం. కానీ అరెస్ట్ చేసిన విధానం చూస్తే తొందరపాటుతో ఈ అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతోందన్నారు. ఇదే పోలీసుల సాయంతో ఎపి పాలకులు తమ బంధువులు అరెస్ట్ కాకుండా అడ్డుకున్నారని మందకృష్ణ అన్నారు. తన బంధువైన కడప ఎంపి వైఎస్ అవినాశ్ రెడ్డి ఓ హత్య కేసులో ఉంటే అతడి అరెస్ట్ అడ్డుకునేందుకు పోలీసులనే ముందు వరుసలో నిలిపిన విషయాన్ని గుర్తించాలన్నారు. చంద్రబాబుపై మోపిన అవినీతి కేసులో నేరం నిరూపణ అయితే అవినీతి సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుందని, ఒక హత్య కేసులో నేరం నిరూపణ అయితే హత్యకు గురైన వ్యక్తిని తిరిగి ప్రాణాలతో తీసుకురాగలమా? మరి ఈ రెండు కేసుల్లో దేన్ని తీవ్రంగా పరగణించాలని ఆయన ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News