డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో పొంగులేటి
మన తెలంగాణ / హైదరాబాద్ : గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు తమ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండబోవని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రజా పాలన సుభిక్షంగా ఉంటుందన్నారు. అందుకనే ఆరు గ్యారెంటీలను ప్రజల కోసం తీసుకురావడం జరిగిందని , అలాగే రెవెన్యూ ఉద్యోగుల సేవలు మరువలేనివని వారి ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. హైదరాబాదులోని మంత్రి అధికార నివాసంలో శుక్రవారం ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రూపొందించిన 2024 సంవత్సర డైరీని మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుందని అన్నారు.
రెవెన్యూ ఉద్యోగులు అంటేనే రాత్రింబవళ్లూ కష్టపడి పని చేసే వారిని తెలిపారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రమోహన్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో విఆర్‌ఓలను రద్దు చేసిందని, వారిని సరి సమాన హోదాతో, సర్వీసు భద్రతతో రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చి వారికి పదోన్నతి కల్పించాలని కోరారు. అనంతరం టిఆర్‌ఈఎస్‌ఏ అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ ఉద్యోగి లేక మండల స్థాయిలో పనిభారం పెరుగుతోందన్నారు. ఈ సందర్భంగా టివిఆర్‌ఓ జెెఎసి చైర్మన్ గోల్కొండ సతీష్ మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడానికి రెవెన్యూ మంత్రి చేసిన ప్రకటన తో 5485 మంది విఆర్‌ఓలు తాము కోల్పోయిన ఆత్మగౌరవం నిలబడ్డదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టివిఆర్‌ఓ జేఏసి సెక్రెటరీ జనరల్ హరలే సుధాకర్ రావు , కో చైర్మన్ సురేష్ బాబు , అదనపు సెక్రెటరీ జనరల్ పల్లెపాటి నరేష్ , వైస్ చైర్మన్ చింతల మురళి , జెెఎసి నాయకులు ప్రకాష్ రావు దేశ్ పాండే, పగిళ్ల వెంకన్న, వినయ్ కుమార్, బాలరాజు , శ్రీహరి నాయక్, ప్రభు. శ్రీహరి పాల్గొన్నారు.