Friday, December 20, 2024

గిట్లుంటది.. స్వయం పాలనా ‘సౌధం’

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ భవనాన్ని పార్లమెంట్‌భవనం సెంట్రల్ విస్టా కన్నా విశాలంగా నిర్మించారు. దేశంలోనే ఎత్తైన భవనంగా, ఎంతో గంభీరం ఉట్టిపడేలా దీని నిర్మాణం జరిగింది. దీంతోపాటు ముఖ్యమంత్రి, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సిబ్బంది ఒకేచోట ఉన్న సచివాలయం దేశంలోనే మొదటిదిగా గుర్తింపుపొందింది. ఈ భవనంలో నీటి సరఫరా కోసం హైడ్రో న్యుమాటిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లు చేశారు. వర్షపునీటిని స్టోర్ చేసేందుకు సంపును సైతం ఏర్పాటు చేశారు. భవనంపై పడిన నీటిచుక్కకూడా వృథాకాకుండా అవి సంపులోకి చేరేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. సకల హంగులతో రూపుదిద్దుకున్న ఈ భవనం ఈ నెల 30వ తేదీన సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదే రోజు నుంచి ఈ భవనం నుంచి పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిజిపి అంజనీ కుమార్, సిపి సివి ఆనంద్‌లు శుక్రవారం పరిశీలించారు. నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు జారీ చేశారు.

ఆకర్షణీయంగా ఫౌంటెయిన్లు

సచివాలయ ప్రాంగణంలో రెండు భారీ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు. 28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వెడల్పుతో రెడ్ శాండ్‌స్టోన్‌తో వీటిని నిర్మించారు. హిందూ, దక్కనీ, కాకతీయ నిర్మాణ శైలుల మేళవింపుగా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. నిజామాబాద్‌లోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వర స్వామి ఆలయం, వనపర్తి రాజప్రాసాదాల్లోని శైలుల ఆధారంగా డోమ్‌లను తీర్చిదిద్దారు. గుజరాత్‌లోని సలంగ్పూర్ హనుమాన్ దేవాలయ నిర్మాణ శైలిని కూడా ఈ గుమ్మటాల్లో వాడారు. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నీ ఎర్ర ఇసుకరాతితో, మధ్యలోని బురుజు రాజస్థాన్‌లోని ధోల్పూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఇసుకరాతితో నిర్మించినట్టు అధికారులు చెప్పారు.

సచివాలయంపై డోమ్‌లు….

ఇండో-పర్షియన్ నిర్మాణశైలిలో ఆధునిక హంగులతో ఈ భవనాన్ని నిర్మించడంతో పాటు రాష్ట్ర హైకోర్టు తరహాలోనే సచివాలయంపై నిర్మించిన డోమ్‌లు, రెం డు డోమ్‌లపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 34 డోమ్‌లను ఏర్పాటు చేయగా, సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్‌లు అత్యంత ఎత్తైనవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న డోమ్‌లపై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయడంతో సుదూర ప్రాంతం నుంచి కూడా ఇవి కనిపించేలా వీటిని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే రెండు గు మ్మటాలపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాలు చూపురులను ఆకట్టుకుంటున్నాయి.ఫైళ్ల మూవ్‌మెంట్‌లో జాప్యం జరగకుండా ప్లగ్ అండ్ ప్లే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు అవసరమైన సకల సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఫైళ్లు, కంప్యూటర్లను తెచ్చుకుంటే సరిపోతుంది. ప్రతి కాన్ఫరెన్స్ హాల్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లకు తెరలను ఏర్పాటు చేశారు.

‘జనహిత’ పేరుతో సమావేశ మందిరం

సచివాలయంలోని ఆరో అంతస్థులో సిఎం, చీఫ్ సెక్రటరీల చాంబర్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సిఎం సిబ్బంది, ఆయన ప్రజలను కలిసేందుకు ‘జనహిత’ పేరుతో 250 మంది కూర్చునే విధంగా సమావేశ మందిరం, మంత్రులు, అధికారులకు సరిపడా క్యాబినెట్ సమావేశం కోసం మరో హాల్, సిఎంను కలిసేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్‌ను నిర్మించారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణకు కూడా ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. కనీసం 25 మంది విశిష్ట అతిథులతో ముఖ్యమంత్రి కలిసి భోజనం చేసేందుకు ఓ ఆధునిక డైనింగ్ హాలును కూడా నిర్మించారు.

గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ స్థలం ఉంచారు. మొత్తం ఎనిమిది ఎకరాల స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం లో క్యాంటీన్, అదే వరుసలో గుడి, బ్యాంకు, ఏటిఎంలు ఉంటాయి. రెండున్నర ఎకరాల్లో 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సందర్శకుల కోసం మరో 300 కార్లు పట్టేలా ఒకటిన్నర ఎకరాల్లో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు.

భారీ తలుపులు
సచివాలయ ప్రధాన ద్వారాన్ని నాలుగు భారీ తలుపులతో 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. తలుపులపై ఇత్తడి పూతతో నగిషీలను చెక్కారు. ఆదిలాబాద్ అడవుల్లోని కలపను ఉపయోగించి నాగ్‌పూర్‌లో వీటిని తయారు చేయించారు. మొత్తం సచివాలయంలో 875 వరకు తలుపులు ఉండగా, ఇందులో దాదాపు 90 శాతం తలుపులు కలపతోనే తయారు చేశారు. కొన్ని మాత్రం ఇనుముతో చేయించారు. భవనానికి నలువైపులా వెడ్పన మెట్లదారితో పాటు మూడు, నాలుగు చొప్పున భారీ లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కిందకు చేరుకునేలా వీటిని ఏర్పాటు చేశారు. ఫైర్‌సేప్టీ వ్యవస్థను కూడా పటిష్టం చేశారు. షార్ట్ సర్క్యూట్ జరిగినా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎక్కడికక్కడ నిలిపివేసేలా ఏర్పాట్లు చేశారు.

రెడ్ శాండ్ స్టోన్ వినియోగం

సచివాలయ నిర్మాణంలో 3500 క్యూబిక్ మీటర్ల రెడ్ శాండ్ స్టోన్‌ను 1,000 లారీల ద్వారా తీసుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ గోడ నిర్మాణం పూర్తిగా ఈ రెడ్ శాండ్ స్టోన్‌తోనే నిర్మించారు. మొత్తం 10 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాన్ని 20 నెలల్లో పూర్తిచేశారు. ఎసిల ఏర్పాటుకు ఆరు నెలలు పట్టగా, ప్రధాన పిల్లర్లు, గుమ్మటాలకు ముందుగా పోతపోసిన నిర్మాణాల (గాల్వనైజ్డ్ రీఇన్‌ఫోర్స్ కాంక్రీట్, సీఆర్సీ) జీఆర్సీ పనులకు సమయం ఎక్కువగా తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News