అమెరికా లిఖిత రాజ్యాంగంలోని విషయాలతో పాటు అక్కడ పాటిస్తున్న అన్ని రాజ్యాంగ సాంప్రదాయాలను కాలరాచి తన ఓటమిని అంగీకరించకుండానే అంగీకరించిన డోనాల్డ్ ట్రంప్ ‘అయితే ఓకే’ అనకుండానే ఎట్టకేలకు శ్వేత సౌధాన్ని వీడి ఫ్లోరిడా రాష్ట్రంలోని తన ఇంటి బాట పట్టారు. ఓటమిలో కూడా తనదే విజయం అన్నట్లు ప్రవర్తించాడు. ఆండ్రూస్ ఎయిర్ బేస్‌లో ట్రంప్ తన చివరి వీడ్కోలు సమావేశంలో ‘వయలెన్స్ కెన్ నెవర్ బి టాలరేటెడ్’ అని పైకి చెబుతూనే తన మద్దతుదారులను మరింత రెచ్చగొట్టాడు. నోరు మాట్లాడి నొసలు వెక్కిరించిన చందంగా ఆయన వ్యవహారం ఉంది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ పేరు ను సైతం తన నోటితో ఉచ్చరించకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. తాను ఏమీ ఆందోళన చెందడం లేదని విచారంతో కాకుండా మరింత ఆత్మవిశ్వాసంతో ఇంటికి వెళ్తున్నానని ఆయన చెప్పారు. పైగా తన నాలుగేళ్ల కాలంలో అద్భుతంగా పని చేశానని తనకు తానే కితాబు ఇచ్చుకున్నారు. తనకు తానే శభాష్ అంటూ తన భుజాలు తానే చరుచుకుంటున్నారు.
అమెరికాను గతంలో కంటే చాలా ముందుకు తీసుకెళ్లానని గొప్పలు చెప్పుకున్నారు. పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడిని వైట్ హౌస్‌లోకి ఆహ్వానించే కనీస సాంప్రదాయాన్ని ఆయన పాటించలేదు. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఆయన మద్దతుదారులు నిస్సిగ్గుగా ఉచ్ఛనీచాలు మరిచి ట్రంప్ ఇజానికి మద్దతు ఇస్తున్నారు. తన పదవీ కాలంలో రెండు సార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడుగా పేరు తెచ్చుకున్న ట్రంపు అంతకు ముందు దేశ అధ్యక్షుడిగా పని చేసిన నలభై నాలుగు మందికి అసలు పోలికే లేదు. ట్రంపు తీరే వేరు. ట్రంప్ తన పదవీ కాలం ముగిసే చివరి రోజు కూడా ఆయన తన అధ్యక్ష హోదాలో చాలా మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. తనకు తానే క్షమాభిక్ష పెట్టుకునే పని ఒక్కటి మాత్రమే చేయలేదు. అందుకు మనం సంతోషించాలి.
అధ్యక్షుడిగా ట్రంప్ తన నాలుగేళ్ల శకం ముగిసింది. కానీ దేశంలో ఆయన గీసిన విభజన రేఖలు పూర్తిగా చెరిగిపోడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం. ప్రస్తుతం కొత్త అధ్యక్షుడిగా వచ్చిన జో బైడెన్ ముందు ఈ విభజన విభజిత అమెరికా సమాజాన్ని కలపడం ఎలా అనే సమస్య ప్రధానమైంది. అందుకే ట్రంపు పరిపాలన ముగిసింది కానీ అమెరికాలో ‘ట్రంప్ ఇజం’ ఇంకా బతికే ఉంది. వచ్చే నాలుగేళ్లు జో బైడన్‌తో పాటు అమెరికా ప్రజలను ఇది వెంటాడుతూనే ఉంటుంది. సమాజాన్ని విభజించడం చాలా సులువు, కానీ కలపడం అత్యంత కష్టసాధ్యం. అమెరికా సమాజం ఈ సవాళ్లను ఎదుర్కోవలసి ఉంది. రెండు వందల సంవత్సరాల ఆదర్శ ప్రజాస్వామ్య రాజ్యం అమెరికా చరిత్రను ఒక సారి పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకు అవగతమవుతాయి.
అమెరికా లిబరల్ డెమొక్రాటిక్ సిద్ధాంతంతో కూడిన ఆదర్శ ప్రజాస్వామ్య దేశం. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ఆదర్శాలతో కూడిన వైవిధ్య భరితమైన సమాజం. వర్క్ కల్చర్, పని సంస్కృతి ఉన్న దేశం. పనిని రోజుల్లో కాకుండా నిమిషాలు, గంటల్లో లెక్కించి పని చేస్తారు. అందుకే ఎన్ని విమర్శలు ఉన్నా ఈ పని సంస్కృతి అమెరికా అభివృద్ధికి దోహదపడింది. అలాగే ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, వైవిధ్య భరిత, స్వేచ్ఛాయుత వాణిజ్యం ఇవన్నీ అమెరికా సమాజంలోని లక్షణాలు. అందుకే ఈ రెండు వందల సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా అమెరికా సమాజం ఇప్పటికీ నిలిచి గెలుస్తుంది.
అమెరికా రెండవ అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ తన అధ్యక్ష పదవి నుండి శాంతియుతంగా దిగిపోయి మూడవ అధ్యక్షుడైన థామస్ జఫర్సన్ తన బాధ్యతలను అప్పగించిన రోజులు మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజుల్లో ఇలాంటి ఆదర్శం ఉంటుందా అని ప్రపంచం అబ్బుర పోయింది. తొలి లిఖిత రాజ్యాంగం కలిగిన అమెరికా ప్రపంచంలో తొలి రిపబ్లిక్ దేశం కూడా. అమెరికా ప్రజాస్వామ్య విధానాలు కొన్ని ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాలకు శిరోధార్యం. అలాంటి అమెరికా ఘన చరిత్రను 45వ అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ తిరగరాశాడు. ప్రపంచానికే ప్రజాస్వామ్య పాఠాలు చెప్పే అమెరికా తలదించుకునేలా ప్రవర్తించాడు. ఎన్ని లోపాలు ఉన్నా మన దేశంలో శాంతియుతంగా పదవి నుంచి తప్పుకోవడం చాలా హుందాగా జరుగుతుంది. కానీ అమెరికా ప్రజాస్వామ్యమే సిగ్గుపడేలా ట్రంపు తన పదవీ విరమణ చేశారు. చివరికి పదవి నుండి దిగి పోయేటప్పుడు కూడా కొత్త అధ్యక్షుడిని వైట్ హౌస్‌లోకి స్వాగతించే సంగతి అటుంచి తిరస్కరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు రీగన్ ప్రారంభించిన కొత్త అధ్యక్షుడికి సూచనలు సలహాలు ఇస్తూ రాసే లేఖను కూడా దొంగతనంగా తన సొరుగులో పెట్టి వైట్ హౌస్ నుంచి పలాయన మంత్రం జపించారు. ట్రంపు చేసిందంతా చెడేనా అని ఆలోచిస్తే అది కూడా సరైంది కాదు. గత నాలుగేళ్లలో ట్రంపు కొన్ని మంచి పనులు కూడా చేశారు. అందులో ముఖ్యంగా మొదటిది చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద ఉన్న పన్నుల భారం తగ్గించారు. రెండవది రెగ్యులేషన్స్ నిబంధనలను సాధ్యమైనంతగా సడలించారు. ఇంకా చెప్పాలంటే అవసరమైన దానికంటే ఎక్కువగానే సడలించారు. పర్యావరణ నిబంధనలు అయితే విచ్చలవిడిగా సవరించారు అని చెప్పవచ్చు. ప్రపంచ పర్యావరణ ఒప్పందాన్ని కూడా ఆయన ఉల్లంఘించారు. అది అటుంచితే గత ఎనిమిదేళ్లుగా నియామకం ఆగిపోయి న్యాయ వ్యవస్థలో ఖాళీగా ఉన్న 300 మంది జడ్జీలను నియమించారు. ఇవన్నీ కొంతవరకు మంచి పనులే. కానీ ఇవన్నీ ఆయనకు ఎదురు తిరిగాయి.
తన ఓటమిని అంగీకరించకుండా ఆయనతో పాటు ఆయన మద్దతుదారులు వేసిన 52 కేసుల్లో ఆయన నియమించిన జడ్జీలే వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. ట్రంపు రాజకీయ పరిణతి లేకుండా తీసుకున్న చాలా చర్యలు సమాజాన్ని కలపడం కాకుండా విడదీశాయి. ప్రపంచలోని అనేక వ్యవస్థలను ఆయన ధిక్కరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపేశారు. ట్రంపు తన పాలనలో అత్యంత వికృతంగా ప్రవర్తించారు. మాస్క్ ను పూర్తిగా పెట్టుకోలేదు. వ్యాక్సిన్ విషయంలో కూడా అనేక రాజకీయాలు చేశారు. తాను పదవిలో ఉండగానే వ్యాక్సిన్ వచ్చుంటే తానే గెలిచే వాడినని పలికారు. హింసకు వ్యతిరేకంగా మాట్లాడుతూ హింసను ప్రోత్సహించారు. మరొక రకంగా చెప్పాలంటే చేయించారు. ట్రంపు తన చివరి మూడు నాలుగు నెలల పదవీ కాలంలో మరిన్ని తప్పులు చేశారు. గతంలోని 44 మంది అధ్యక్షులతో పోల్చడానికి వీలులేనిది మనస్తత్వం ట్రంపు సొంతం. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పుకోవాలి.
తనకన్నా ముందు అమెరికా అధ్యక్షుడిగా ఎనిమిది సంవత్సరాలు పని చేసిన బరాక్ ఒబామా తన పదవీ విరమణ చేసేటప్పుడు మాట్లాడుతున్న మైకు తన చేయి జారి కింద పడినప్పుడు ‘ఒబామా ఇక నీ పని అయిపోయిందని’ తన కు తానే జోక్ వేసుకున్నాడు. తనను తాను ఎప్పుడైనా తగ్గించుకోవడానికి కూడా ఒబామా వెనుకాడలేదు. తాము అధ్యక్ష పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో ఆ పదవికి ఉన్న విలువ పెంచకపోయినా పర్వాలేదు దాన్ని తగ్గించకూడదు అన్న సూత్రాలను గతంలోని చాలామంది అధ్యక్షులు పాటించారు, వ్యవహరించారు. కానీ సీతయ్య ఎవరు చెప్పినా వినడు అన్నట్లు ట్రంపు తన ఇష్టం అన్నట్టుగా ప్రవర్తించాడు.
జనవరి 20న అమెరికా 46 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ తన మొదటి ప్రసంగంలో జో బైడెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజలను ఐక్యంగా ఉంచుతానన్న ఆయన మొదటి మాటే ఆయనకు మొదటి సవాలుగా మారనుంది. విభజిత అమెరికా సమాజాన్ని కలిపే పని మొదటి చేయాలి. ఇక విదేశాంగ విధానం విషయంలో ఇప్పటికిప్పుడు వెంటనే చేసే మార్పులు ఏమీ కనిపించకపోయినా కూడా చైనాతో వ్యతిరేకత కొనసాగిస్తారా లేదా సఖ్యత సాధిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ట్రంపు అమెరికా ప్రజలను చైనాకు వ్యతిరేకంగా ఇప్పటికే తయారు చేసి పెట్టారు. కనుక జో బైడెన్ తాత్కాలికంగానైనా చైనాకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది.
అలాగే చైనాతో సంబంధాలు మెరుగు పరిచే క్రమంలో కూడా అనివార్యంగా ట్రంపు ఇప్పటి దాకా చేసిన పాపాలను ఒక్కసారి కడిగేసుకునే కంటే మెల్లమెల్లగా వాటిని సరి చేసుకోవాల్సి ఉంది. అందుకే ఇప్పటిదాకా ట్రంప్ అవలంబించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విడుదల చేసిన పద్ధతిని కూడా అనుసరించాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. అందుకే జో బైడెన్ తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 17 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు విడుదల చేయడం ద్వారా పాత సాంప్రదాయాన్ని కొనసాగించవలసి అనివార్య పరిస్థితి వచ్చింది. అందులో మొట్టమొదటిది మాస్కులు ధరించని పౌరులపై కఠిన శిక్షలు అమలు చేయడం ఒకటిగా చెప్పుకోవచ్చు. అమెరికా మెక్సికో దేశాల మధ్య గోడ కట్టడం నుండి ప్రపంచ పర్యావరణ ఒప్పందాలను తిరిగి అంగీకరించడం లాంటి పదిహేడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై జో బైడెన్ సంతకాలు పెట్టారు.
ఇక అమెరికా ఆర్థిక రంగం కుదేలు అయిపోయింది. కొవిడ్ 19 సందర్భంగా ప్రకటించిన ఉద్దీపన పథకాలు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. ఇప్పటికే డాలర్ల ముద్రణ విపరీతంగా పెరిగిపోయింది. ఉత్పత్తి లేకుండా కేవలం డాలర్లు ముద్రించడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి ఏం చేస్తారన్నది కూడా ప్రపంచం జో బైడెన్ వైపు ఎదురు చూస్తోంది. చైనా తో పోల్చుకుంటే అమెరికా ఉత్పత్తి రంగంలో వెనుకబడింది. దాంతో అమెరికా ఎప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్‌గా తన స్థానం నిలబెట్టుకోవాలంటే అమెరికా ఉత్పత్తి రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవాలి. 750 కోట్ల మంది ప్రపంచ జనాభాలో 18 శాతంతో చైనా మొదటి స్థానంలో ఉంటే కొంచెం అటు ఇటుగా అంతే శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. కానీ ప్రపంచంలోని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కేవలం ఇరవై కోట్ల మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది.
మిగతా జనాభా అంతా వ్యవసాయం, సేవా రంగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక రంగానికి మంచిది కాదు. ఆర్థిక సంస్కరణల తర్వాత చైనా తన విజ్ఞతతో దూరదృష్టితో ఉత్పత్తి రంగంలో అనేక అద్భుతాలు సాధించింది. ప్రపంచ మార్కెట్ పోటీలో అమెరికా వెనుకబడకుండా ఉండాలంటే అమెరికాలో మాన్యుఫాక్చరింగ్ రంగం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. వచ్చే నాలుగేళ్లలో ఎదురయ్యే సవాళ్ళలో చాలా వాటిని ఎదుర్కొనే సత్తా కొత్త అధ్యక్షుడైన 78 ఏళ్ల జో బైడన్ కు ఉందని చెప్పడానికి ఆయన సుదీర్ఘమైన పాలనా అనుభవం మనకు ఒక గీటురాయిగా కనిపిస్తుంది. ఆరు సార్లు అమెరికా సెనేటర్‌గా, ఒకసారి ఉపాధ్యక్షుడిగా పని చేసిన ఆయన వయస్సు తో పాటు అనుభవం కూడా ఒక అవకాశమే అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఆయన రాజకీయ రంగంలో చూపిన సంయమనం నిగ్రహం, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఇవన్నీ కూడా అనుకూల అంశాలు. అయినా ట్రంపు విడిచిపెట్టిన దుర్మార్గ వారసత్వం అమెరికాను అగ్రరాజ్యంగా నిలపడానికి చేసే ప్రయత్నంలో కొత్త అధ్యక్షుడికి కత్తి మీద సాము లాగానే ఉంటుంది.