మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర అనుసరిస్తున్న ఆర్థ్ధిక విధానాలు, పన్నుల విధానాల మూలంగా దేశంలో పేదరికం రాకెట్ స్పీడ్ తో పెరిగిపోతోందని అధికారవర్గాలు, ఆర్థ్ధికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నిరుపేదల సంఖ్య రికార్డుస్థాయిలో 81.35 కోట్ల కు చేరిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంటే మొత్తం దేశ జనాభాలో 62.5 శాతం మం ది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని ఆ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 75 శాతం మంది గ్రామీణ ప్రజలు, 50 శాతం మంది పట్టణ ప్రజలు పేదరికంతో నలిగిపోతున్నారు. అంతేగాక దేశంలోని గ్రామీణుల నెలసరి ఆదాయం సగటున 1059 రూపాయల 42 పైసలకు పడిపోయింది. పట్టణ ప్రాంతాల పేదల నెలసరి ఆదాయం రూ.1286కి పడిపోయింది. సగటు మనిషి రోజుకు 32 రూపాయలు (పట్టణాల్లో), గ్రామాల్లోనైతే ఒక వ్యక్తి రోజువారీ ఖర్చు 26 రూపాయలకు పడిపోయింది. ఇలా దేశ ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలే స్పష్టంచేస్తున్నాయి.
అంతేగాక గత 2022 డిసెంబర్ 23వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశంలోని 81.35 కోట్ల మంది నిరుపేదలకు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) ప్రకారం ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని, అందుకుగాను రెండు లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. కానీ కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటివరకూ అమలుకాలేదని, తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క నిరుపేదకు కూడా కేంద్రం ఆహార భద్రతా చట్టం కింద ఎలాంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేయలేదని, ఆ చట్టం కింద ఇప్పటి వరకూ ఒక్క రూపాయిని కూడా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదని ఆ అధికారులు వివరించారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న ఆర్థ్ధిక విధానాలు, పన్నుల విధానాల మూలంగా పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారని, వారి ఆదాయం సగానికిపైగా పడిపోయిందని ఇండియా కన్స్యూమర్ ఎకానమీ (ఐసిఇ) అనే ఆర్థ్ధిక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
గడచిన ఏడేళ్లల్లో ధనికుల ఆదాయం 40 శాతం పెరిగిందని, దేశంలో 20 శాతంగా ఉన్న ఎగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం స్వల్పంగా పెరిగిందని ఆ సర్వే తెలిపిందని వివరించారు. ఇక మిగిలిన 60 శాతం మంది జనాభా (పేదలు) ఆదాయం భారీగా పడిపోయిందని, నిరుపేదల ఆదాయం 50 శాతం పడిపోయిందని, అంటే నెలకు రూ.10వేలు సంపాదించే వ్యక్తి ఆదాయం రూ.5వేలకు పడిపోయిందని ఆ సర్వే స్పష్టం దిగువ మధ్యతరగతి ఆదాయం 30 శాతం పతనమైందని, ఇక మధ్యతరగతి ఆదాయం స్వల్పంగా తగ్గిపోయిందని సర్వే పేర్కొంది. అంటే మెజారిటీ ప్రజల ఆదాయం రోజురోజుకూ క్షీణిస్తుంటే అతి కొద్ది మంది చేతిలో ఉన్న సంపద మునుపెన్నడూ లేనంతగా పెరిగిందని, దేశంలో ఒక్క శాతంగా ఉన్న ధన వంతుల చేతిలో ఏకంగా 73 శాతం దేశ సంపద నిక్షిప్తమై ఉందని ఆ అధికారులు వివరించారు. ఇండియాస్ కన్సూమర్ ఎకానమీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఒ), ఫార్చూన్ ఇండియా వంటి ఆర్థ్ధిక సంస్థలు నిర్వహించిన సర్వేలు, నివేదికలన్నీ దేశంలో వాయువేగంగా పేదరికం పెరిగిపోతోందని స్పష్టంచేస్తున్నాయని ఆ అధికారులు వివరించారు.
“పేదలను కొట్టు పెద్దలకు పెట్టు” అనే ఫార్ములాతో కేంద్రంలో బిజెపి దేశాన్ని పాలిస్తోందని, అందుకే ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని, జిడిపి పడిపోయిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చేసిన విమర్శలు, ఆరోపణలకు ఈ నివేదికలు బలం చేకూరుస్తున్నాయి. దీనంతటికీ కారణం ప్రజల కష్టాలు, ఇబ్బందులను పట్టించుకోకుండా ఎల్లపుడూ ఖజానాకు ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ఏకపక్షంగా పన్నులు పెంచుకొంటూ, ధరలను పెంచుతూ ప్రజల నడ్డివిరవడమే ఏకైక లక్షంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుండటం మూలంగా ఇలాంటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఎప్పుడైతే రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుందో అప్పుడే ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పతనమవుతుందనే సూత్రాన్ని కూడా కేంద్రం పట్టించుకోవడంలేదని, 2018లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.41 శాతం ఉండగా అది కాస్తా 2022వ సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 6.75 శాతానికి పెరిగిందని వివరించారు.
రిటైల్ ద్రవ్యోల్బణం ఒక ఏడాది నుంచి మరొక ఏడాదికి ఒక్క శాతం పెరిగే పరిస్థితులు ఉన్నప్పుడే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ అప్రమత్తమై రిటైల్ ద్రవ్యోల్బణం నియంత్రణకు అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రయత్నమేమీ చేయకపోగా మరింత తీవ్రంగా ప్రజల నడ్డి విరిచే విధంగా పన్నులు, ధరలు పెంచుకొంటూపోతోందని పలువురు సీనియర్ అధికారులు, ఆర్ధికవేత్తలు మండిపడుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించకపోతే పేదలు, నిరుపేదలే కాకుండా సామాన్య ప్రజలు, మధ్యతరగతి వర్గాలు, కొన్ని లక్షల రూపాయలకు అధిపతులైన లక్షాధికారులు సైతం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, అందుచేతనే ప్రతి ఏటా రిటైల్ ద్రవ్యోల్బణం పెరగకుండా నియంత్రణలో ఉండేటట్లుగా అనేక జాగ్రత్తలు తీసుకొన్న ప్రభుత్వాలు పనిచేసిన మన దేశంలో నేడు అలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే పరిస్థితులు లేకపోవడం దేశ ప్రజలు చేసుకొన్న దురదృష్టమని తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం రెట్టింపుగా పెరగడంతో వస్తువులు, సేవల ధరలు కూడా రెట్టింపయ్యాయని, దీంతో నాలుగేళ్ల క్రితం వరకూ ఉన్న ప్రజల కొనుగోలు శక్తి నేడు లేదని, అన్ని వర్గాల ప్రజలు తాము సంపాదించుకునే నెలవారీ డబ్బుల్లో 75 శాతం సొమ్మును ఇంటి ఖర్చులు, వ్యక్తిగత అవసరాలకే ఖర్చు చేస్తున్నారని, దీంతో ప్రజల సేవింగ్స్, ఇతర కొనుగోళ్ళు పూర్తిగా తగ్గిపోయాయని వివరించారు. పన్నులు పెంచినా, పెట్రోల్-డీజిల్ ధరలను పెంచినా, ఇతర వస్తువుల ధరలను పెంచినా దాని ప్రభావం ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్రంగా ఉంటుందనే మౌలిక సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టిందని, దేశ ప్రజల కష్టాలు-నష్టాలను పట్టించుకోకుండా కేవలం ఖజానాను నింపుకోవడానికే కేంద్ర ప్రభుత్వం పరిమితం అయ్యిందని ప్రస్తుత ద్రవ్యోల్బణం గణాంకాలు స్పష్టంచేస్తున్నాయని వివరించారు. వస్తువులు, సేవలపై పన్నులు భారీగా పెరిగాయని, జిఎస్‌టి శ్లాబ్‌లలోని వస్తువుల జాబితాలు కూడా పెరిగాయని, చివరకు శ్మశానాల్లో కూడా పన్నులు వేస్తున్నారని, పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయని, చెప్పుకుంటూపోతే ఎన్నో ఘోరమైన తప్పిదాలున్నాయని, అందుకే దేశం పురోగమనంలో కాకుండా తిరోగమనంలో పయనిస్తోందని మండిపడ్డారు.