Friday, December 20, 2024

ఆ భూమికి జేఎన్‌జే సొసైటీ సభ్యులే యజమానులు: హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్, పేట్ బషీరాబాద్‌లోని 70 ఎకరాలు జేఎన్‌జే సొసైటీకే చెందుతుందని, ఈ భూమి కోసం సభ్యులందరూ డబ్బులు చెల్లించినందున ఆ భూమికి జేఎన్‌జే సొసైటీ సభ్యులే యజమానులని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం టీమ్ జేఎన్‌జే ఆధ్వర్యంలో జరిగిన జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యుల సమా వేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివారం ఉదయం పది గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫౌండర్ మెంబర్ పివి రమణారావు అధ్యక్షతన జేఎన్‌జే సొసైటీ సభ్యుల కీలక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎన్.రామచంద్రరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ స్థలాలు జేఎన్‌జే సొసైటీకి అప్పగించాల్సిందేనన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన అప్పటి మార్కెట్ ధర ప్రకారంగా రూ.12.33 కోట్లు చెల్లించి సొసైటీ సభ్యులు కొనుగోలు చేయడం, దానిపైనే సుప్రీం తుది తీర్పు ఇచ్చి భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకునే హక్కు కల్పించిందని జస్టిస్ చంద్రకుమార్ వివరించారు. ఒకవేళ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయని పక్షంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. జేఎన్‌జే సొసైటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సుస్పష్టంగా ఉందని, ఈ స్థలాల్లో మూడోపార్టీ జోక్యం లేదని తీర్పులో స్పష్టంగా పేర్కొందన్నారు. సభ్యులు ఈ స్థలాలను డబ్బులు పెట్టికొన్నందున ఈ స్థలాలపై సర్వ హక్కులు వారికే చెందుతాయన్నారు.

ప్రభుత్వ వర్గాలు ఈ స్థలాలను అప్పగించని సందర్భంలో ప్రజాస్వామ్య యుతంగా నిరహార దీక్షలు చేయాలని, ఆ దీక్షలో కూడా తాను పాల్గొంటానన్నారు. సభ్యులు న్యాయపరమైన అంశాలపై అడిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ రామచంద్ర రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థలాలను జేఎన్‌జే హౌసింగ్ సొసైటీకి అప్పగించాలన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించని సందర్భంలో సొసైటీ సభ్యులకు కోర్టుల్లో న్యాయ సాయంతో పాటు అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సుప్రీంతీర్పు ప్రకారం పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం అనంతరం జేఎన్‌జే సొసైటీ సభ్యులు సుందరయ్య పార్కు చుట్టూ భారీ ర్యాలీ నిర్వహించారు.

JNJ 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News