Thursday, January 23, 2025

ముఖ్యమంత్రికి బ్రహ్మరథం పడుతున్న తెలంగాణ ప్రజలు

- Advertisement -
- Advertisement -

ఇందల్వాయి: హరితహారం సృష్టికర్త సిఎం కెసిఆర్ అని రాష్ట్రమంతా పచ్చదనంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని, ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని టిఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లిలో ఆర్టీసీ ఛైర్మన్ పాల్గొని మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ హరితహారం సిఎం కెసిఆర్ మానస పుత్రిక అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రాష్ట్రంలో 23శాతం ఉన్న పచ్చదనాన్ని గత తొమ్మిదేళ్లలో మరో 7శాతం పెంచి పర్యావరణాన్ని కాపాడడంలో ముందున్నామన్నారు. హరిత తెలంగాణ కోసం ఎమ్మెల్యేల జీతాల నుండి ఒక శాతం సెస్సు వసూలు చేస్తున్నారని అన్నారు.

హరితహారం విజయవంతానికి ప్రభుత్వం అనేకవిధాలుగా నిధులు సమకూరుస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటినుంచి హరితహారం కోసం 273 కోట్ల 33లక్షల మొ క్కలు నాటి ఇందుకోసం 10,822 కోట్లు ఖర్చుచేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడానికి సిఎం కెసిఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు జరుపుతుంటే బిజెపికి ఇష్టంలేదని ,వారు ఓర్వలేకపోతున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి వెళ్లాయని, ప్రతి గడపకు చేరాయని, ప్రజలు ఆశీర్వదించి మరోసారి బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మాయమాటలు చెప్పే కపటన నాయకులు, చేతలు చేతగాని పార్టీల నాయకులు ఓట్ల కోసం వస్తారని , ప్రజల కోసం పనిచేసే కెసిఆర్ ప్రభుత్వాన్ని దరించి మరోసారి గెలిపించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News