Sunday, January 19, 2025

నియోజకవర్గ ప్రజలే నా కుటుంబసభ్యులు

- Advertisement -
- Advertisement -
  • నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ధ్యేయం
  • జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్

జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలందరూ నా కుటుంబ సభ్యులేనని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని 22, 37 వార్డుల్లో ఎమ్మెల్యే సంజయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నానని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నానని అన్నారు.

ఈ ఐదేళ్లలో ఈ రెండు వార్డుల్లో కోటి రూపాయలతో ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు గుంతలు ప్రమాదకరంగా మారిన బైపాస్ రోడ్డును బాగు చేశామని వివరించారు. కృష్ణానగర్, అరవిందనగర్‌లో కొత్తగా పైపులైన్లు వేసి తాగు నీటి సమస్యలను శాశ్వతంగా దూరం చేశామన్నారు. గతంలో సిఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందడం గగనమయ్యేదని, నేడు ఎంత మంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి సిఎంఆర్‌ఎఫ్ అందిస్తున్నామని వివరించారు. ఈ రెండు వార్డుల్లో ఇళ్లు లేని నిరుపేదలైన 53 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించి వారి సొంతింటి కల నెరవేర్చామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా ఇండ్లు మంజూరు చేసాత్మన్నారు. వైశ్యుల్లోని నిరుపేదలకు కూడా కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేశామని, బీసీ, ఎస్సీ, ఎస్‌టి, మైనార్టీల మాదిరిగా అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు సైతం త్వరలోనే నియోజకవర్గంలో గురుకుల పాఠశాల ఏర్పాటు కాబోతుందన్నారు.

రైతు బీమా మాదిరిగానే కెసిఆర్ బీమా పేరుతో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ రూ. 5 లక్షల బీమాను అందిస్తామన్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా కోర్టు, ఫోక్సో కోర్టులను ఏర్పాటు చేశామని, తాతల కాలంనాడు కట్టించిన ఇండ్ల గురించే ఇప్పటికీ కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అన్ని రకాల వసతులతో ఇళ్లు లేని నిరుపేదల కోసం 4520 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి పేదల సొంతింటి కల నేరవేర్చిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఎక్కడా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించలేదని, ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

గత పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దితో తమకు రాజకీయంగా ఉనికి లేకుండా పోతోందని ప్రతిపక్ష పార్టీల నేతలు బిఆర్‌ఎస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న బిఆర్‌ఎస్‌కు మరో సారి పట్టం కట్టాలని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా నిలపడమే ధ్యేయంగా పని చేస్తున్న సిఎం కెసిఆర్‌కు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఎమ్మెల్యే కోరారు.

గత ప్రభుత్వాలకు చేసిందేమిటో, బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో ప్రజలు గ్రహించాలని, ప్రజల మేలు కోరే బిఆర్‌ఎస్‌ను ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీశ్, నాయకులు వీరబత్తిని శ్రీనివాస్, జితేందర్, మహేందర్, ఆడెపు సత్యం, అజీజ్, సుబాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News