Wednesday, January 22, 2025

ప్రజావాణికి పోటెత్తిన జనం..భూ సమస్యలే అధికం

- Advertisement -
- Advertisement -

మొత్తం 5126 దరఖాస్తులు
ఆటో డ్రైవర్ల మొర ఆలకంచిన సర్కారు : మంత్రి పొన్నం గుడ్ న్యూస్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజావాణికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వారి వినతులను పరిశీలించారు. కిలోమీటరు దూరం వరకు బారులు తీరిన అర్జీదారులు, తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు, రవాణా రంగంలో బిల్లులు తగ్గించాలనే వినతులతో పెద్దఎత్తున జనాలు రావడంతో ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలను క్రమబద్దీకరించిన పోలీసులు అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అధిక శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్ వల్ల తమ భూములు పోయాయని, సిట్టింగ్ ఎంఎల్‌ఎలు తమ భూములు ఖబ్జా చేశారని, టిఎస్‌పిఎస్‌సిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నవే ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం పరిష్కారం చూపని ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వమైనా పరిష్కరిస్తుందన్న నమ్మకంతో వినతి పత్రాలతో ప్రజావాణికి వస్తున్నామని అర్జీదారులు చెబుతున్నారు. చాలా ఏళ్లుగా స్పౌజ్ బదిలీలపై ఉద్యోగులు అనేక ధర్నాలు, ర్యాలీలు చేపట్టినా సమస్య తీరకపోవడంతో ప్రజావాణికి వచ్చామని తెలిపారు. ఈ సర్కారైనా తమ సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.
అర్జీదారుల సమస్యల పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత : పొన్నం
అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని , వారి అర్జీలను తీసుకున్నారు. ప్రతి అర్జికి ఒక నంబర్‌ను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్‌కు సంక్షిప్త సందేశo పంపుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో 5324 వినతి పత్రాలు అందాయి. అందులో 55 శాతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 30 శాతం పెన్షన్‌లకు సంబంధించిన వినతి పత్రాలే ఉన్నాయి. మిగిలినవి ఉద్యోగాలు, రెవెన్యూ సమస్యలు మొదలైనవి అని ప్రజా భవన్ అధికార వర్గాలు తెలియజేశాయి.
ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం: పొన్నం
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సదుపాయాన్ని డిసెంబర్ 9వ తేదీ నుంచే అమల్లోకి తెచ్చింది. ఆటో డ్రైవర్లు బాధపడవద్దని, వారు కూడా తమ సోదరులేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారికి తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కొంచెం ఓపిక పట్టాలని కోరారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు సమస్య ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని మంత్రి పొన్నం అన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి : ఎన్.బాలమల్లేష్
తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించి, వారిని ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షలు ఎన్.బాలమల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో ప్రజావాణిలో బాధితులను తీసుకొని అధికారులను కలిసి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యంలను పరిష్కరించాలని అర్జీని ఇచ్చాయి.
ప్రజావాణి ఆన్‌లైన్ పోర్టల్
ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటు లోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌లో ప్రజావాణిలో ఫిర్యాదు సందర్భంగా ప్రభుత్వం నుంచి రిఫరెన్స్ నెంబర్ ప్రకారం తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌కు మంత్రులు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ప్రజావాణి నోడల్ అధికారిగా ఐఎఎస్ అధికారి హరిచందనను నియమించిన తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News