గద్వాలటౌన్: ప్రజా ఆరోగ్యమే తెలంగాణ ప్రభుత్వ లక్షం అని గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వీఎం అబ్రహంలు అన్నారు. రూ.94లక్షల వ్యయంతో జిల్లా కేంద్రంలోని జిలా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్, ల్యాబ్‌ను శనివారం ఎమ్యెల్యేలు ప్రారంభించారు. అంతకు ముందు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా వైద్యులు, డిఎంహెచ్‌ఒ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 31 జిల్లాలో టీ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి పని చేశారని, ప్రజలను మహమ్మారి బారి నుంచి రక్షించారని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్యుల పని తీరు అద్భుతంగా ఉందన్నారు.
వైద్య,ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా కృషి చేసిన డాక్టర్లందరికీ వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గద్వాల జిల్లాలో సిటీ స్కానింగ్ ఎంతో అవసరమని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి వెంటనే మంజూరు చేస్తామన్నారు. అదే విధంగా గద్వాలలో మెడికల్ కళాశాల మంజూరు జీవోను త్వరలో విడుదల చేస్తామని, 300 పడకల ఆసుపత్రి నిర్మాణపు పనులు, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ అధునాతన వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యేలు
పేదలకు కార్పొరేట్‌స్థాయిలో వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ వీఎం అబ్రహంలు అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్, ల్యాబ్‌ను, నూతన జనరేటర్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గద్వాల,అలంపూర్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలకు వెళ్లితే ప్రైవేటు ల్యాబ్‌లకు రాసేవారని, జిల్లాలో ల్యాబ్‌లు లేకపోవడంతో చాల మంది పక్క రాష్ట్రం వైపుకు వెళ్లేవారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని వెల్లడించారు.
ప్రభుత్వ దవాఖానాకు చికిత్సకోసం వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన టీ డయాగ్నోస్టిక్స్ (టీడీ) సేవలు మరింత విస్తరించినట్లు తెలిపారు. అందులో భాగంగా టీ డయాగ్నోస్టిక్స్‌లో టెస్టుల సంఖ్యను 134కు పెంచినట్లు. గతంలో టీడీల ద్వారా 57 రకాల పరీక్షలు నిర్వహిస్తుండగా ప్రస్తుతం 134కు పెంచినట్లు పేర్కొన్నారు. రేడియాలజీ పరీక్షలు మరింత నాణ్యతగా, వేగంగా నిర్వహించాలనే లక్షంతో ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబురామన్ గౌడ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శశికళ, వైద్యులు, డీఎంహెచ్‌ఓ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.