జిగ్నేష్ మేవాని ఆరోపణ
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే తనను నాశనం చేసేందుకు ప్రధానమంత్రి కార్యాలయం పన్నిన ముందస్తు కుట్రే అస్సాం పోలీసులు తనను అరెస్టు చేయడమని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఆరోపించారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. తన అరెస్టు 56 అంగుళాల పిరికిపంద చేపట్టిన చర్యగా ఆయన అభివర్ణించారు. 22 పరీక్షా పత్రాల లీకేజి, ముంద్రా పోర్టులో ఇటీవల స్వాధీనం చేసుకున్న రూ. 1.75 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ వెనుకఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ, ఉనాలో దళితులు, మైనారిటీలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తడి చేసేందుకు జూన్ 1న గుజరాత్ బంద్ నిర్వహించేందుకు తాను రోడ్ల మీదకు వస్తానని మేవాని ప్రకటించారు. అస్సాం పోలీసులు తనను అరెస్టు చేయడం ముందుగా వేసుకున్న ఒక పథకమని, ఇది ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రొటోకాల్‌ను, నిబంధనలను ఉల్లంఘించడమని ఆయన అన్నారు.