Thursday, January 23, 2025

ఎన్నికల తీరుతెన్నుల కవిత్వం

- Advertisement -
- Advertisement -

సామాజిక అవగాహన ఉన్న కవులకు ఎన్నికల సందర్భం ఓ బాధ్యత. ఆ సమయంలో పత్రికల్లో వచ్చే రాజకీయ నేతల ప్రసంగ వార్తలతో పాటు వాటి పొట్ట విప్పి చూపే కవి పదాలు కూడా అవసరమే. వాస్తవాలని చిత్రీకరించే చురకల్లాంటి ఈ పొట్టి కవితలను పాఠకులు కూడా ఇష్టపడతారు. అందుకే పత్రికలు ఎన్నికల సందర్బంగా ఇలాంటి సత్తా ఉన్న కవులను ఎంచుకొని కవితాధారను అందిస్తుంటాయి. అయితే సాధారణ కవి వీటికి సరిపోడు.ఈ కవికి సమకాలీన రాజకీయ గమనంపై సాధికారిత ఉండాలి. రాజకీయ పక్షాల చరిత్రపై లోతైన అవగాహన అవసరం. విమర్శల్లో నికార్సయిన వాస్తవాలు ఉండాలి. ఎంతవారలనైనా నిలదీసే తెగువ అదనపు బలం. ఈ లక్షణాలన్నీ ఉన్న కవి కాబట్టే కోడం పవన్ కుమార్ కు ఒక దిన పత్రిక ’ఎన్నికల నగారా’ శీర్షిక అప్పగించింది. వాటి సంకలనమే ఎ’లక్షణం’.

ఈ పుస్తకంలో 2009 నుండి 2018 వరకు ఒక దశాబ్ద కాలంలో జరిగిన నాలుగు ఎన్నికల నేపథ్యంలో కవి రాసిన నాలుగు పాదాల కవితలు సుమారు రెండు వందలున్నాయి. సీనియర్ కవి, పాత్రికేయుడైన పవన్ కుమార్ మోగించిన ఈ నగారా లో ఆయనకున్న తార్కిక దృష్టి, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ప్రస్ఫుటమవుతోంది. 2009 లో చివరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2014 లో తొలి తెలంగాణ, 2016 లో జి హెచ్ ఎమ్ సి, చివరగా 2018 లో తెలంగాణ అసెంబ్లీకి రెండోసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలే ఎ’లక్షణం’ కవితల నేపథ్యం. నిజానికి ఈ ఎన్నికలన్నీ దేనికవి ప్రత్యేకమైనవే. విచిత్రమైన పొత్తులతో రాజకీయ సమీకరణాలు ఉహకందకుండా మారిపోయాయి.

అయితే ఈ ఎన్నికల్లో పార్టీలు ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఆ చర్యల వెనుక ఉన్న బండారాన్ని బయటపెట్టడంలో కవి తన ప్రతిభను కనబరచారు. అప్పటి తెరాస పొత్తులను ఉద్దేశించి – (2014 ) ’కాంగ్రెస్ తెరాస పొత్తుతో / శృతి తప్పిన తెలం’గానం’/ (2018 ) తెదేపా తెరాస కూటమితో/ అందివచ్చేనా తెలంగాణం’ అన్నారు. 2009 టికెట్ దక్కని రసమయి బాలకిషన్ కు ’గజ్జె కట్టి దరువేస్తే/ తెలంగాణ జజ్జనకరి జనరే/ ఉన్న ఉద్యోగం వదిలి పెట్టి / పోటికని వస్తే టికెట్ హుష్ కాకిరే’ అని సానుభూతి ప్రకటించారు. స్థానిక అభ్యర్థులు లేని మల్కాజిగిరి విషయంలో ’మల్కాజిగిరిలో ఉన్న మర్మమేమిటీ / మహామహులంతా పోటీ పడడమేమిటీ / తెలంగాణ మట్టి పరిమళంతో పూచిన పువ్వుపై / స్థానికేతర భ్రమరాలు వాలడమేమిటీ’ అని ప్రశ్నించారు.

2018 లో తెలంగాణాలో రెండో సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రభుత్వ పోకడలతో తెరాసపై కవి దృక్పథం మారింది. అందుకే ’కొంగరకలాన్ పైవాలిన కొంగలెన్ని / కడుపు నింపుకోవడానికి దొరికిన చేపలెన్ని’ అని ప్రభుత్వంపై విసుర్లు కనిపిస్తాయి. ’ప్రజా ఆశీర్వాద సభలో చెప్పిందే చెప్పుడు / తెగించి పోరాడి తెచ్చిన పార్టీకి ఎందుకీ తంటా ’అనే విమర్శ చూడవచ్చు. ’మిగులు రాష్ట్రము అప్పులపాలు / మింగుడు పడకపోతే ఓటు రాయి విసురు’ అని ఓటరుకు సూచన చేస్తారు.
ఎన్నికల పోరు అంటేనే రాజకీయ పార్టీల పోటాపోటీ హామీలు, అభ్యర్థులు ఒకరిపై ఒకరి విసుర్లు. ఏ ఎన్నికల సమరమైన ఇవి సాధారణమే. అందుకే ఎ’లక్షణం’ కవితల్లో ఉన్నట్లు ఏ కాలపు ఎన్నికల్లోనైనా నేతల లక్షణాలు ఒకేలా ఉంటాయి. దానికి సాక్ష్యంగా ఇందులోని ఎన్నో కవితలు నిలుస్తాయి.

ఇలా ప్రసంగికత కోల్పోని వాక్యాలెన్నోచూడొచ్చు. 2018 లో రాసిన కవిత ’ఓటమి మాట కేసీఆర్ నోట / నష్టపోయేది ప్రజలేనట /విశ్రాంతికి ఫామ్ హౌజ్ ఎదురు చూస్తుందట /పడి లేచిన తెలంగాణకు సారధి ఎవరట’. అనే కవిత చదివితే అయిదేళ్ల తరవాత ఇదే మాట మళ్ళీ కేసీఆర్ నోట విన్న విషయం గుర్తుకొస్తుంది. ’కె సి ఆర్ సర్కార్ ను కూల్చేద్దాం / కోరుకున్న తెలంగాణ సౌధాన్ని నిర్మిద్దాం/ అడుగడుగునా పొంచి ఉన్న పాము బుసతో బహుపరాక్’ అనే ముందస్తు హెచ్చరికను కూడా చూడొచ్చు. ’సవాలుకు ప్రతి సవాల్/ కె టీ ఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ / వంద స్పీడుతో కారు పరుగు / అందేనా సైకిల్ పై తీస్తున్న దౌడు’ అన్న కవి ఆనాటి ఊహను సైకిల్ దిగి హస్తం అడ్డు పెట్టి కారు స్పీడును ఆపి నిజం చేశాడు రేవంతు. ’తెలంగాణ ఇజ్జత్ తీసిన బాబు / బిసిల పరువుకు రంగం సిద్ధం చేసినతీరు / మునిగిపోయే నావలో ఎక్కిన కృష్ణయ్య / ప్రవాహ వేగాన్ని పసిగట్టలేకపోతే ఎలాగయ్యా’ అన్న కవిమాటను ఎదురొడ్డి కృష్ణయ్య గెలిచినా పడవ మాత్రం మునిగింది. ’చిరు రోడ్ షో / అద్వానీ సంకల్పయాత్ర / బాబు సైకిల్ పరుగు / వై ఎస్ బహిరంగ సభ /పార్టీలు ఎన్నైనా శ్రోత ఒక్కడే/ ఓటు ఒక్కటే విజేత ఒక్కరే’. ఇది 2014 ఎన్నికల బహుముఖచిత్రం.

గత పదేళ్ల పాటు తెలంగాణలో సాగిన ఎన్ని’కలల’ రాజకీయ విన్యాసం ఈ కవితల్లో కాలానుక్రమంగా ఉంది. ప్రతి కవితకు చిత్రకారుడు జావేద్ వేసిన అర్థవంతమైన బొమ్మ ఉంది. పేజీకి రెండు కవితలు, వాటి పక్కన రెండు చిత్రాలతో పుస్తకం అందంగా వచ్చింది. ఇది సాహిత్యం చదివే వారికే కాకుండా సామాన్య పాఠకుడికి కూడా దగ్గరయ్యే పుస్తకం. చివరగా కవి కోడం పవన్ తన పలుకుల్లో ’వ్యంగ్యాస్త్రాలు సూటిగా తగిలినప్పటికీ స్ఫూర్తిగా తీసుకున్న నాయకులకు’ కృతజ్ఞతలు చెప్పడం సంస్కారవంతంగా ఉంది. ’అక్షరాల్లో నీ నవ్వు, నవ్వుతో కూడిన నువ్వు’ అనే నివాళి పదాలతో కూడిన కవితతో ఈ పుస్తకాన్నికవికి ఆత్మీయుడైన కీ. శే. నిజాం వెంకటేశం గారికి అంకితమిచ్చారు. కవి, పాత్రికేయుడు అయిన కోడం పవన్ కుమార్ లో తగినంత రాజకీయ, సామాజిక అవగాహన ఉంది. ఇలా చిట్టి పొట్టి కవితలతో ఓటర్లను మేలుకొల్పే బాధ్యత కొనసాగించాలి.

ఎ‘లక్షణం’ (కవిత్వం)
రచన : కోడం పవన్ కుమార్
పేజీలు 100,
వెల : రూ. 100/-
ప్రతులకు : లయ పబ్లికేషన్స్
ఫోన్ : 9848992825.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News