బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : బీఎస్పీ కార్యకర్తలను బెదిరిస్తూ, పోలీసులు అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం కాగజ్ నగర్, సిర్పూర్ (టి) మండలంలో నిర్వహించిన బహుజన రాజ్యాధికార యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతో తమ కార్యకర్తలను ఇతర పార్టీలకు చెందిన నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కోనేరు కోనప్ప భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
కేంద్రంలో బిజెపి దేశ సంపదను దోచుకుంటుందని, కార్పొరేట్ సంస్దలకు అండగా ఉంటూ పేదల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన కోసం పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ బీఎస్పీనే అన్నారు. గతంలో కోనేరు కోనప్పను బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి అధికార పార్టీలో చేరారని ఆరోపించారు. కోనప్ప అక్రమంగా సంపాదించిన వేల కోట్లను ఓటర్లకు పంచి,ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో డబ్బులు పంచి ప్రజలను ఎక్కువసార్లు మభ్యపెట్టలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సిర్పూర్ (టి)లో రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,జిల్లా ఇంచార్జ్ సోయం చిన్నయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, జిల్లా కోశాధికారి నవీన్, షేక్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.