మన తెలంగాణ / హైదరాబాద్ : జీవో నెంబర్ 58, 59 క్రింద ఎలాంటి రుసుం లేకుండా పేద, మధ్యతరగతి ప్రజలకు భూములు, ఇండ్ల క్రమబద్దీకరణ చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రుసుం చెల్లించలేని పేద,మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చివేయడం సరికాదన్నారు. క్రమబద్దీకరణ రుసుం ప్రాంతానికో రేటును ఎలా నిర్ణయించారని? ఆయన ప్రశ్నించారు. జీవో 59 క్రింద అధిక క్రమబద్దీకరణ రుసుం చెల్లించనందుకు శనివారం బాచుపల్లి మండల పరిధిలోని ఇండ్లను కూల్చివేస్తామని తహశీల్దార్ బృందం హెచ్చరికలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
15 సంవత్సరాలుగా ఇంద్రన్న కాలనీలో నివాసం ఉంటున్న పాలబిందెల శ్రీనివాస్‌కు ఆయనకున్న 120 గజాల స్థలంకు అధిక మొత్తం… అంటే రూ.15 లక్షల 75 వేలు కట్టలేని కారణంగా రెవెన్యూ అధికారులు ఇంటి గేటు, గోడను కూలగొట్టారని, అప్పటికే గిఫ్ట్ రిజిస్టేషన్ కూడా చేసుకున్నాడని, వాటిని పట్టించుకోవడం లేదని సాంబశివరావు పేర్కొన్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పేదవారి ఇండ్ల క్రమబద్దీకరణకు అధిక మొత్తంలో రుసుం చెల్లించాలని ఇబ్బందులకు గురిచేయడం తగదని పేర్కొన్నారు. వెంటనే 58, 59 జీవో ప్రకారం పేదలకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా క్రమబద్దీకరణ చేపట్టాలని కూనంనేని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.