Friday, November 22, 2024

పోయింది అధికారమే.. పోరాట పటిమ పోలేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి:  బిజెపిని కాంగ్రెస్ నిలువరించలేదని, కేవలం బిఆర్‌ఎస్ మాత్రమేనని నిలువరించగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆదివారం నియోజకవర్గ స్థాయి పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా ఎంపికైన వారు ప్రజల కోసం కాకుం డా ధర్మం కోసం పనిచేస్తామంటే ఎలా అని నిలదీశారు. ధర్మం కోసం పనిచేసే వారు కాశీలో మఠం స్థాపించుకుని రాజకీయాలు బంద్ చేసి ధర్మం కో సం పనిచేయాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంపిగా బండి సంజయ్ నియోజకవర్గంలోని ఒక్క గుడికైనా నిధు లు తెచ్చారా అని ప్రశ్నించారు. కనీసం ఒక్క బడినైనా సాధించారా అని నిలదీశారు. సిరిసిల్ల, జ మ్మికుంట నేతన్నల కోసం మెగా పవర్‌లూమ్ క్లస్ట ర్ కావాలంటే పట్టించుకోలేదని అన్నారు. సిరిసిల్ల మీదుగా కరీంనగర్ వెళ్లే రైలు మార్గం ముందుకు సాగే చర్యలేమైనా తీసుకున్నారా అన్నారు. నియోజక వర్గంలోని ఒక్క గ్రామంలో తిరుగలేదని, ప్ర భుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా బండి సం జయ్ పాల్గొనలేదని కెటిఆర్ విమర్శించారు. ఎం పి లాడ్స్ 5 కోట్ల రూపాయల్లో సిరిసిల్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.

కెసిఆర్‌ను తిట్టుడు.. అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప బండి సంజయ్‌కు ఏమీ తెలియదన్నారు. దేవుడి పేరుతో ఓట్లు అడగడం కాదు.. ఏంచేశారో చెప్పాలన్నారు. కెసిఆర్ నిజమైన హిందువని, యాదాద్రి దేవాలయాన్ని నిర్మించారని, కరీంనగర్‌లో పదెకరాల స్థలంలో 25 కోట్ల రూపాయలతో శ్రీవేంకటేశ్వరాలయం నిర్మించారని, అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బిజెపి లోపాయికారి ఒప్పందాలు చేసుకుని కొన్నిచోట్ల బిజెపి, మరికొన్నిచోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలుపుతాయని, దీనివల్ల తమ పార్టీని దెబ్బకొట్టాలని అనుకుంటున్నాయని అన్నారు. బిఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతులో బొందపెడతానని మూడడుగులు కూడా లేని రేవంత్ రెడ్డి అంటున్నారని, అది ఎందరో తీస్‌మార్‌ఖాన్‌ల వల్లే కాలేదు.. బుడ్డర్‌ఖాన్ (రేవంత్ రెడ్డి) వల్ల ఏమవుతుందని అన్నారు. వాన పాములు కూడా అప్పుడప్పుడు నాగుపాములవుతాయన్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో అని తిరుగుతుంటే దేశమంతా కాంగ్రెస్ చోడో అంటున్నారని అన్నారు. ఇండియా కూటమిలో నుండి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఢిల్లీ నుండి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ నుండి భగవంత్ సింగ్ మాన్, కేరళ నుండి పినరయి విజయ్, బీహార్ నుండి నితీష్‌కుమార్ తప్పుకున్నారని, అందువల్ల బిజెపిని నిలువరించే శక్తి కాంగ్రెస్‌కు లేదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. వామపక్ష నేతలు, బిజెపి వ్యతిరేక శక్తులు కూడా ఆలోచించాలని అన్నారు. ఎన్నికల్లో ఓటమి, గెలుపు సహజమని, మళ్లీ ప్రజలు మనలను ఆశీర్వదించే రోజు దగ్గరలోనే ఉందన్నారు. మార్పు కావాలని కోరుకున్నవారు ఇప్పుడు నెత్తీనోరు కొట్టుకుంటున్నారని అన్నారు.

రేవంత్‌రెడ్డి తాను అసెంబ్లీకి వెళ్లగానే బావ, బావమరదులు (కెటిఆర్, హరీష్‌రావు) నిలదీశారని చెప్పుకున్నారని మరి కెసిఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించండని అన్నారు. కెసిఆర్ అధికారంలో కంటే ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతుకగా అద్భుతంగా పనిచేస్తారన్నారు. దేశంలో ప్రజల పక్షాన కెసిఆర్‌లా గొంతు విప్పే మరో నాయకుడే లేడన్నారు. ప్రతిపక్షంలోనే కెసిఆర్ డేంజరస్ నాయకుడన్నారు. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారెంటీలు కావని అవి చార్ సౌ బీస్ (420) హామీలని ఎద్దేవా చేశారు. మేడిగడ్డలో అవినీతి జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, తప్పు జరిగితే విచారణ జరిపించాలని తామే అసెంబ్లీలో డిమాండ్ చేసిన విషయం మర్చిపోయారా అన్నారు.

బిఆర్‌ఎస్‌కు అధికారం పోయిందే తప్ప పోరాట పటిమ పోలేదన్నారు. ప్రస్తుత ఓటమి స్పీడ్ బ్రేకరేనని, త్వరలోనే అధికారంలోకి వస్తామన్నారు. బిఆర్‌ఎస్‌లోని కొందరు ప్రజలను విమర్శిస్తున్నారని, అది సరికాదని ప్రజలు బిఆర్‌ఎస్‌కు పదేళ్లు అధికారం ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఇచ్చారని ప్రజల తీర్పును గౌరవించాలన్నారు. అధికారం పోతే కొందరు బెంబేలెత్తి పార్టీలు మారుతారని అంతమాత్రాన మనం భయపడవద్దని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనతో ఉన్నవారే అసలైన కార్యకర్తలు, నాయకులని అన్నారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేశించుకుని లోపాలు సరిదిద్దుకోవాలన్నారు. ప్రస్తుతం వచ్చే ఏడాదంతా ఎన్నికలే ఉంటాయని అందువల్ల బిఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి అన్ని ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నేతలనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ పాలన ప్రారంభం కాగానే కరెంట్ కష్టాలు మొదలయ్యాయన్నారు. డిక్లరేషన్ పేరిట మోసం చేశారన్నారు.

సిరిసిల్ల ప్రాంత ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని, సిరిసిల్లకు ప్రభుత్వం వస్త్ర ఆర్డర్లు ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్భందిస్తామన్నారు. రేవంత్‌రెడ్డికి మంత్రిగా, సిఎంగా పనిచేసిన అనుభవం లేదని, సెక్రటేరియట్‌లో లంకెబిందెలున్నాయనుకున్నానని, కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని అనడం ఏమిటన్నారు. లంకె బిందెల కోసం తవ్వుడు మానుకొని ప్రజల కోసం పనిచేయాలని, ఓట్లు వేయలేదని ప్రజలపై పగ పడితే మంచిది కాదన్నారు. వచ్చే ఐదేళ్ల కాలం పార్టీ పటిష్టత కోసం పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి బోయినపెల్లి వినోద్‌కుమార్, నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జడ్‌పి సిపి న్యాలకొండ అరుణ, మున్సిపల్ సిపి జిందం కళచక్రపాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, దరువు ఎల్లన్న, మంచె శ్రీనివాస్, బొల్లి రామ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News