న్యూఢిల్లీ : బంగారం ధర రోజు రోజుకీ పెరుగుతూ సరికొత్త గరిష్ఠాలను సృష్టిస్తోంది. సోమవారం బంగారం మళ్లీ సరికొత్త ఆల్ టైమ్ హైని చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, జనవరి 16న బులియన్ మార్కెట్‌లో బంగారం ధర రూ.352 పెరిగి 10 గ్రాములకు రూ.56,814కి చేరుకుంది. అంతకుముందు జనవరి 13న బంగారం ధర గరిష్టంగా రూ.56,462గా ఉంది.
వెండి విషయానికొస్తే, బులియన్ మార్కెట్‌లో కిలో ధర రూ.1,121 పెరిగి రూ.69,236కు చేరింది. జనవరి 13న ఇది రూ.68,115గా ఉంది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా ప్రకారం, సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోలు పెరగడం సానుకూల సంకేతం, ఇది బంగారం ధరలకు మద్దతునిస్తుంది. 2023లో బంగారం రూ.64,000 వరకు చేరే అవకాశముందని కేడియా తెలిపారు.