Wednesday, January 22, 2025

గురుకుల అభ్యర్థుల పోటీ పరీక్షల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గురుకుల విద్యాలయాలలో జేఎల్, డిఎల్, టిజిటి, పిజిటి, లైబ్రేరియన్ ఉద్యోగ నియామక పరీక్షల కోసం నేటి నుంచి ఈనెల 23 వరకు నిర్వహించే పరీక్ష విధానంలో ఒకే అభ్యర్థికి మూడు,నాలుగు జిల్లాలలో కేంద్రాలు కేటాయించడం నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొన్నదని ఏఐవైఎఫ్, డివైఎఫ్‌ఐ, ఐపివైఎల్ సంఘాలు పేర్కొన్నాయి. దీంత అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నదని, గురుకుల పోటీ పరీక్షలకు నమోదు చేసుకున్న ప్రతీ అభ్యర్థికి హాల్ టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆసంఘాలు మాసాబ్ ట్యాంక్‌లోని గురుకుల భవన్ కార్యాలయ ఆవరణలో అభ్యర్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్. ప్రదీప్‌లు మాట్లాడుతూ జే.ఎల్, డి.ఎల్, టీ.జీ.టి, పి.జి.టి, లైబ్రేరియన్ పరీక్షలు రాసే అభ్యర్థులకు కేటాయించిన పల్టీపర్పస్ (ఒకే అభ్యర్థి మూడు జిల్లా పరీక్ష సెంటర్స్ లో రాయడం) పరీక్ష విధానంతో అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానంతో సుదూర ప్రాంతాలకు వెళ్లలేని గర్భిణీలు, వికలాంగులు, పిల్లల తల్లులతో పాటు ఆర్థిక స్తోమతలేని నిరుద్యోగులకు ఇబ్బందులు పడుతారని, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ విధానాలు నష్టం చేకూరుస్తున్నాయని ధ్వజమెత్తారు. ఒకవేళ ఇదే నిబంధనలు విధిస్తే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, గురుకుల నియామక బోర్డ్ అభ్యర్థులందరికీ హెలికాప్టర్ సౌకర్యం ద్వారా పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో గత రెండు వారాలుగా భారీ వర్షాలు పడి నీటితో అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాల్లో దుర్భర స్థితి నెలకొన్నదని,ఈ సందర్భంలో గురుకుల బోర్డ్ తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శాపంలా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డ్ కన్వీనర్ మల్లయ్య బట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిర్ణయాల అమలులో నిరుద్యోగులకు నష్టం వాటిల్లే విధానాలు అనుసరిస్తున్నారని, అభ్యర్థులకు అందుబాటులో లేకుండా ఉంటున్నారని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న కన్వీనర్ ను తొలగించాలని, జవాబుదారీతనంగా వ్యవహరించే అధికారిని నియమించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నిర్లకంటి శ్రీకాంత్, డీవైఎఫ్‌ఐ, కార్యదర్శి జావీద్, పీవైఎల్ నాయకులు బి. కృష్ణ, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News