Tuesday, November 5, 2024

గ్రూప్ 2 దరఖాస్తులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. వచ్చే నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో తమ వన్ టైం పాస్‌వర్డ్(ఒటిఆర్) నెంబర్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. ఇప్పటివరకు తమ ఒటిఆర్‌ను సవరించుకోని అభ్యర్థులు, ముందుగా ఒటిఆర్‌లో సవరణలు చేసుకుని గ్రూప్ 2కు దరఖాస్తు చేసుకోవాలని టిఎస్‌పిఎస్‌సి సూచించింది.

మొదటిసారి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒటిఆర్ నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. గత నెల 29వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా కమిషనర్ గ్రేడ్ -3, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కానున్నాయి. గతంలో 1,032 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసిన కమిషన్… ఆ స్థాయిలో మళ్లీ ఉద్యోగ ప్రకటన ఇవ్వడం ఇదే ప్రథమం. గ్రూప్ 2కు భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

5 లక్షలకు చేరువలో గ్రూప్ 4 దరఖాస్తులు

రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి 4,97,056 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. కొన్నేళ్ల తర్వాత గ్రూప్ 4 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు లక్షలకు చేరువలో దరఖాస్తులు రాగా, మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 30న ప్రారంభం కాగా, మొదటి రోజు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రెండో రోజు నుంచి దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు సుమారుగా 20 వేల నుంచి 30 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులకు మరో 11 రోజుల సమయం ఉండడంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల సంఖ్య భారీగా మరింత పెరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News