2047 లక్ష్యసాధనకు కలిసికట్టుగా పయనం
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి
న్యూఢిల్లీ : దేశ పౌరులంతా సమానులే అని, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, హక్కులు ఇదే దశలో ఈ దేశం పట్ల బాధ్యతలు అందరికీ సమానంగా ఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చెప్పారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి సోమవారం రాత్రి జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య ప్రక్రియతో, సంతరించుకున్న సమాన హక్కులతో విశిష్టలతో మనం 2047 టార్గెట్‌ను నిర్ధేశించుకోవల్సి ఉందని రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. 2047లోగానే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో విశిష్ట స్థానానికి చేరుకోవాలని, ఇదే మన లక్షం కావాలన్నారు. దేశ పుత్రికలు మరింత పురోగమించాలనేదే దేశ ప్రధమ పౌరురాలిగా తన ఆకాంక్ష అని ఆమె తెలిపారు. ప్రతి సవాలును వారు అధిగమించే శక్తిని సంతరించుకోవల్సి ఉంటుంది. మన ఆడబిడ్డలు మొక్కవోని ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగితే దేశం నిర్ధేశించుకునే ప్రగతి లక్షం మరింత చేరువ అవుతుందని స్పష్టం చేశారు. మన ఘనమైన రాజ్యాంగం మనకు ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, విధులు హక్కులతో ప్రతి భారతీయుడు సమాన పౌరుడుగా నిలిచారని తెలిపారు. కులాలు, మతాలు తెగలు, భాషలు, యాసలు ఈ విధంగా విభిన్నంగా ఉండే వేర్వేరు గుర్తింపులను భారతీయ పౌరులనే ఉనికి అధిగమింప చేస్తుంది. అందరిని సమ్మిశ్రితం చేసుకుని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లగల్గుతుంది. ఈ సమగ్ర సమైక్య గుర్తింపు మనకు రాజ్యాంగం ప్రసాదించిన ఛత్రం అని తెలిపారు. రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ జాతిని ఉద్ధేశించి ప్రసంగించడం ఇది రెండోసారి.
ఇంటిపట్టుకు విభిన్నంగా నేటి మహిళ
దేశంలో కొద్ది దశాబ్దాల క్రితం వరకూ ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ రోజులలో దేశ ప్రగతిపథంలో భారతీయ మహిళ ప్రతి రంగంలో తన విశిష్ట బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఇంతటి బాధ్యతలు తీసుకుంటుందని కొంతకాలం క్రితం మ నం కనీసం ఊహించి కూడా ఉండలేదని, ఇప్పుడు మహిళ తనదైన ముద్రతో దేశ ప్రగతి దిశలో తాను సైతంగా సాగుతోందని రాష్ట్రపతి చెప్పారు. ప్రతి రంగంలోనూ, అనేక సేవా విభాగాల్లోనూ స్త్రీ కీలక పాత్ర పోషిస్తోంది. తన స్థానం ప్రత్యేకతల భరితం చేసుకొంటోంది. తన కాళ్ల మీద తా ను నిలబడగల్గడమే కాదు, దేశ గౌరవ ప్రతిష్టల ను ఇనుమడింపచేస్తోందని రాష్ట్రపతి కితాబు ఇచ్చారు. ఓ అనూహ్యం ఇప్పుడు నిజమై నిక్కమైందన్నారు. దేశంలో మహిళా సాధికారికతకు ఇప్పుడు ప్రత్యేకత దక్కుతోంది. ఈ విషయాన్ని గుర్తించి తాను సంతోషిస్తున్నానని తెలిపారు.
మహిళల ప్రగతితోనే దేశం పురోగమనం
మహిళ ఆర్థిక వెన్నుదన్నుతో నిలిస్తే దీనితో ఓ కుటుంబం, తద్వారా సమాజం మరింత విలసిల్లుతుందని రాష్ట్రపతి తెలిపారు. ఇక్కడి ఆడకూతుళ్లు వివిధ రంగాలలో పేరు తెచ్చుకోవాలి. మ తాంగిని హజ్రా, కనకట్ల బారూహా సరోజిని నా యుడు, అమ్మూ స్వామినాథన్, రమాదేవి, అరు ణా అసఫ్ అలీ, సుచేతా కృపలానీ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. మా కస్తూ ర్బా త్యాగనిరతి అసమానం, జాతిపిత మహాత్మా గాంధీ పయనంలో ఆయన ప్రతి అడుగులో తాను కలిసి నడిచారని, సంక్లిష్ట సత్యాగ్రహ బాటలో కస్తూర్బా ఓపిక సహనం చరిత్రలో నిలిచే ఘట్టాలు అవుతాయన్నారు. ప్రపంచ స్థాయిలో ఇప్పుడుభారతదేశం పలు విధాలుగా విశిష్టతను చాటుకొంటోంది. అభివృద్ధి, మానవీయ లక్షాల సాధనలో ఆదర్శం అయింది. ప్రత్యేకించి అంతర్జాతీయ వేదికలపై నాయకత్వ పటిమ కీలకమైంది. ఇప్పుడు భారతదేశం జి 20 అధ్యక్ష స్థానం వహించడం అంతర్జాతీయ మానవీయ కోణంలో భారతీయ ఆదరణ సంపన్నతల విషయం మరింతగా వెలుగులోకి వస్తుందని రాష్ట్రపతి ప్రస్తావించారు.