Monday, January 20, 2025

అమరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ప్రగతి

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా రాలేదని, దశాబ్దాల పోరాటం, వందలాది మంది యువత బలిదానాలతో ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన శ్యామకూర శంకర్ (సోమేశ్వర్ గ్రామం), హరిబాబు (కొత్తబాది గ్రామం) కుటుంబ సభ్యులను గౌరవ ప్రదంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతం నుంచి పోలీసులను రప్పించి, ఆనాటి కాల్పులలో 369 మంది యువకులు చనిపోయారన్నారు.

నాడు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో మర్రి చెన్నారెడ్డి నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకి లొంగిపోయి, లాలూచి పడి ఉద్యమాన్ని వదిలివేశారన్నారు. 2009లో అమరణ నిరాహార దీక్ష చేస్తున్న కెసిఆర్ చనిపోతాడని సమాచారం ఢిల్లీకి చేరిందన్నారు. ఆ భయంతో తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారని, మళ్లీ మాట వెనక్కి తీసుకున్నారన్నారు. దీంతో విద్యార్థులు నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేకపోయామన్నారు. తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు.

సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మేము కడుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఈ రోజు అందరికి అగుపడుతున్నాయన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా ఉంచాలన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అప్పుడే అమరులకు ఆత్మ శాంతి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News