రాజావిక్రమాదిత్య కట్టడమే
తేల్చిచెప్పిన ఆర్కియాలజీ మాజీ
సౌర పరిశోధనల కేంద్రమది
న్యూఢిల్లీ : దేశరాజధానిలోని ప్రఖ్యాత కుతుబ్‌మినార్‌ను ఐదో శతాబ్దంలో రాజా విక్రమాదిత్య కట్టించారని పురాతత్వ శాఖ మాజీ అధికారి ధరమ్‌వీర్ శర్మ పేర్కొన్నారు. ఇది కుతుబ్ మినార్ కానేకాదు సూర్యగోపురం అని తేల్చిచెప్పారు. దేశంలో పురాతన కట్టడాలపై చారిత్రక వివాదాలు చెలరేగుతున్న దశలోనే శర్మ కుతుబ్‌మినార్‌పై తమ వాదనను తెరముందుకు తెచ్చారు. సూర్యుడి గమనంలోని విశేష మార్పులు ఖగోళ శాస్త్ర అధ్యయనానికి అప్పటి రాజు ఈ కట్టడం నిర్మించారని ఆర్కియలాజికల్ సర్వే ఇండియా (ఎఎస్‌ఐ) మాజీ ప్రాంతీయ సంచాలకులు అయిన ధరమ్‌వీర్ శర్మ తెలిపారు. దీనిని కట్టించింది కుతుబ్ అల్ దిన్ ఐబక్ కాదని రాజా విక్రమాదిత్యనే అని తేల్చిచెప్పారు.
పురాతన కాలంలో కుతుబ్ మినార్ పేరు విష్ణుస్తంభ్‌గా ఉందన్నారు. ఇది కుతుబ్ స్థూపం కాదని , సౌర పరిశీలనల క్రమపు కట్టడం అని తెలిపారు. ఈ విషయాన్ని నిర్థారించే దిశలో తన వద్ద విస్తృత స్థాయిలో సాక్షాధారాలు పలు కీలక పత్రాలు ఉన్నాయని ఆయన బుధవారం తెలిపారు. ఆర్కియలాజీ విభాగం తరఫున తాను పలు సార్లు సాంకేతిక నిపుణుల బృందం పాటుగా సర్వే జరిపామని వివరించారు. కుతుబ్‌మినార్ సూర్యుడు నక్షత్రాల ఖగోళ పరిశోధనలకు నిర్మించిన స్వతంత్ర నిర్మాణమే తప్ప ఇది మసీదు లేదా మతపరమైన వ్యవహారాల కట్టడం కాదని శర్మ తెలిపారు.