Thursday, January 23, 2025

రైతుల కష్టాలు తీరినప్పుడే నిజమైన సంక్రాంతి

- Advertisement -
- Advertisement -

65 వ్యవసాయ చట్టాలు ఉన్నప్పటికీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన లేదు
నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్
భూ న్యాయ శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం: లచ్చిరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: రైతుల కష్టాలు తీరినప్పుడే నిజమైన సంక్రాంతి వస్తుందని, 65 వ్యవసాయ చట్టాలు ఉన్నప్పటికీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన లేదని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. భూ చట్టాలను రైతులకు చుట్టాలుగా మార్చేందుకు ఆయన ఆధ్వర్యంలో లీఫ్స్ (లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో భూ సమస్యలు లేని గ్రామాలే లక్ష్యంగా రైతులకు భూమి హక్కుల పరీక్షలు చేసి క్షేత్ర స్థాయిలో ఉన్న భూ సమస్యలపై అధ్యయనం, పరిష్కార మార్గాలును అన్వేషించాలనే సంకల్పంతో భూ న్యాయ శిబిరాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారంలో సిసిఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్ (సిఎంఆర్‌ఓ) వి.లచ్చిరెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డిలతో కలిసి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ‘భూ న్యాయ శిబిరం‘ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమి సునీల్ మాట్లాడుతూ సాగు న్యాయ కేంద్రాల ద్వారా రైతులకు ఉచితంగా భూమి హక్కుల పరీక్ష చేసి రిపోర్టు ఇస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా యాచారంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం యాచారం మండల పరిధిలోని 21 గ్రామాల్లో నిర్వహించి ఇందులో గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.
స్వచ్ఛందంగా భూ న్యాయ శిబిరాలు: లచ్చిరెడ్డి
లీఫ్స్ సంస్థ రైతుల కోసం స్వచ్చందంగా భూ న్యాయ శిబిరాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందించదగిన విషయమని సిఎంఆర్‌ఓ ప్రాజెక్టు డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించిందని, వేలాది మంది రైతులకు ఉచితంగా సేవలందించినట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వం గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యే పనిని రాష్ట్ర స్థాయి అధికారులకు అప్పగించిందని ఆయన విమర్శించారు. ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యలు, సవరణలపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా యాచారం మండల పరిధిలో లీఫ్స్ సంస్ట నిర్వహిస్తున్న భూ న్యాయ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జీవన్ రెడ్డి, న్యాయవాదులు మల్లేశం, ప్రవీణ్, శ్రీకాంత్, తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ రెడ్డి దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News