ట్రిపోలి: లిబియా ప్రధాని అబ్డుల్ హమీద్ అల్-దబేబా ఇంటిపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. కాకపోతే ఇంటి భవనం స్వల్పంగా దెబ్బతిన్నది. ప్రధాని ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పేలుడు తాలూకు పెద్ద శబ్దాలు వినిపించినట్లు తెలిపారని వార్తా సంస్థ ‘రాయిటర్’ తెలిపింది. అక్కడ వెంటనే పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.
లిబియాలో 2011 నుంచే శాంతిభద్రత సమస్యలున్నాయి. వైరి వర్గాలు తూర్పు, పశ్చిమ వర్గాలుగా ఏర్పడి ఎవరికి వారు స్వంత పాలన కొనసాగిస్తున్నారు. కాగా 2021లో అబ్డుల్ హమీద్ అల్-దబేబా నేతృత్వంలో ‘నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. లిబియాలో చాలా కాలంగా రాజకీయ అస్థిరత కొనసాగుతున్నది. ఎన్నికల నిర్వహణ సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నికలు జరిగే వరకు పదవి నుంచి తప్పుకునేది లేదని తేల్చి చెప్పారు.