Thursday, December 19, 2024

రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది

- Advertisement -
- Advertisement -

క్షేత్రస్థాయిలో పని చేసే విఆర్‌ఏ, విఆర్‌ఓలను
రెవెన్యూ శాఖకు దూరం చేసింది
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
మంత్రి పొంగులేటి, సిఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన లచ్చిరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పని చేసే విఆర్‌ఏ, విఆర్‌ఓలను రెవెన్యూ శాఖకు దూరం చేసి పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన ఆక్షేపించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సరి చేసే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో పని చేసిన విఆర్‌ఏ, విఆర్‌ఓలకు గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే వారికి జీతాలు ఇవ్వడం ఒక సమస్యకు పరిష్కారం లభించిందని కోదండరాం అన్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని సైతం త్వరగా పరిష్కరించాలని కోదండరాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ ఉద్యోగుల జేఏసి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, రెవెన్యూ ఉద్యోగుల జేఏసి చైర్మన్ వి. లచ్చిరెడ్డితో పాటు పలువురు రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ విఆర్వోలను, విఆర్‌ఏలను ఇతర శాఖల్లోకి పంపించడంతో సర్వీసును కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇష్టానుసారంగా వారిని బదిలీలు చేశారని, వీరంతా పాత సర్వీసును కోల్పోయి కొత్త శాఖల్లో, కొత్త ఉద్యోగులుగా మిగిలిపోయారన్నారు. కొందరికైతే జీతాలు కూడా సరిగ్గా రావడం లేదని ఆయన తెలిపారు.
రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు దూరం చేసింది: లచ్చిరెడ్డి
రెవెన్యూ ఉద్యోగుల జేఏసి చైర్మన్ వి. లచ్చిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ, క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులు లేకుండా చేసిందని ఆయన ఆరోపించారు. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు దూరం చేసిందని, ఉద్యోగుల సమస్యలను పెండింగ్‌లో ఉంచిందని ఆయన ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విఆర్‌ఏల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఐదు నెలలుగా జీతాలు లేక 20 వేల విఆర్‌ఏల కుటుంబాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఒకటో తేదీన ముఖ్యమంత్రిని కలిసి వివరించగా, మూడో తేదీన సమస్యను పరిష్కరించారని ఆయన ఆదేశాలిచ్చారన్నారు. విఆర్‌ఏలకు ఐడీ నంబర్లు ఇవ్వాలని, వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినందుకు సిఎంకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. విఆర్‌ఏల సమస్యలను పరిష్కరించినందుకు మంత్రి పొంగులేటి, సిఎం రేవంత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్ల సంఘం అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, పూల్ సింగ్, విఆర్‌ఏల నాయకుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News