Monday, December 23, 2024

హిందూ కోడ్ బిల్లులో ఏముంది?

- Advertisement -
- Advertisement -

ఆడ బిడ్డ పుట్టుకను బౌద్ధ సంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ… బుద్ధ్దుడు, ప్రసంజిత్ మహారాజుల మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు అంబేడ్కర్. తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్ మహారాజు దుఃఖితుడవుతున్న సమయంలో “ఆడ బిడ్డ పుట్టిందని ఎంత మాత్రం దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆడ బిడ్డ మగ బిడ్డకు ఏమాత్రం తీసిపోదు” అంటాడు బుద్ధుడు. తన ఉపన్యాసాల ద్వారా స్త్రీ చైతన్యానికి ప్రయత్నించేవారు అంబేడ్కర్. మారుతున్న సమాజంతో పాటు మారాలని, మూఢాచారాలను వదిలి వేయాలని, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు. వేశ్యవృత్తిలో ఉన్న కొందరు మహర్ మహిళలు, ఆ నరక చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంబేడ్కర్ మాటలు ఎంతో దోహదపడ్డాయి.

హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవంపై బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కులం దుర్మార్గాన్నే కాదు స్త్రీ మీద అణచివేత ధోరణులను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఒక సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి స్త్రీ అభివృద్ధి అనేది కొలమానం అనేవారు. తన ఉపన్యాసాలలో స్త్రీ అణచివేత, కుల వ్యవస్థ మధ్య ఉన్న లంకెను గురించి చర్చించేవారు. ‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ వుమెన్’ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి నెట్టే వేసిన సామాజిక పరిస్థితులు గురించి లోతుగా చర్చించారు. ఆడబిడ్డ పుట్టుకను బౌద్ధ సంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ… బుద్ధ్దుడు, ప్రసంజిత్ మహారాజుల మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు అంబేడ్కర్. తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్ మహారాజు దుఃఖితుడవుతున్న సమయంలో “ఆడబిడ్డ పుట్టిందని ఎంత మాత్రం దుఃఖించాల్సిన అవసరం లేదు.

ఆడబిడ్డ మగబిడ్డకు ఏమాత్రం తీసిపోదు” అంటాడు బుద్ధుడు. తన ఉపన్యాసాల ద్వారా స్త్రీ చైతన్యానికి ప్రయత్నించేవారు అంబేడ్కర్. మారుతున్న సమాజంతో పాటు మారాలని, మూఢాచారాలను వదిలివేయాలని, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు. వేశ్యవృత్తిలో ఉన్న కొందరు మహర్ మహిళలు, ఆ నరక చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంబేడ్కర్ మాటలు ఎంతో దోహదపడ్డాయి. స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అంబేడ్కర్. ఆయన నేతృత్వంలో ఏర్పడిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎందరో బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. మహిళలు చదుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేసింది. మహిళలకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన అతి గొప్ప కానుక హిందూ కోడ్ బిల్.

ఈ బిల్లుతో మన దేశంలోని ఆడవారి సామాజిక బతుకు చిత్రాన్నే ఆయన మార్చేశారు. ఆస్తి అనగానే దాని మీద కేవలం అబ్బాయిలకే హక్కు ఉంటుందనుకునే రోజుల్లో ఆ అభిప్రాయానికి పాతర వేశారు. కుటుంబ ఆస్తిలో మగ పిల్లలకు ఎంత హక్కు ఉన్నదో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఆడవారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఈ అతి ముఖ్యమైన అంశాన్ని ఆయన చొరవ తీసుకుని హిందూ కోడ్ బిల్లులో పెట్టారు. ఆస్తి హక్కే కాదు పిల్లలను దత్తత తీసుకునే హక్కును కూడా మహిళలకు కల్పించారు. ఎవరికైనా పిల్లలు లేకుంటే వారికి దత్తత ఇచ్చే హక్కును కూడా కల్పించారు. మహిళల పట్ల అనేక సామాజిక దురాచారాలకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. అప్పట్లో కొంత మందికి ఇద్దరు, ముగ్గురు భార్యలుండేవారు. ఈ సాంఘిక దురాచారం ఆనాటి సొసైటీలో ఓ స్టేటస్ సింబల్ గా ఉండేది. దీనికి కూడా అంబేడ్కర్ అడ్డుకట్ట వేశారు. బహు భార్యత్వాన్ని రద్దు చేశారు. మహిళలకు హక్కులు కల్పించే దిశలో వాళ్ల స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లంటూ ఒకసారి అయ్యాక భర్త ఎలాంటి వాడైనా భరిస్తూనే ఉండాలనే ఐడియాలజీకి బ్రేక్ వేశారు. భర్తతో తేడాలు వస్తే విడాకుల ద్వారా పెళ్లిని రద్దు చేసుకునే అవకాశాన్ని హిందూ కోడ్ బిల్లు ద్వారా అంబేడ్కర్ కల్పించారు. మహిళా హక్కులకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన హిందూ కోడ్ ముసాయిదా బిల్లును 1947 నవంబర్‌లో సెలెక్ట్ కమిటీకి అంబేడ్కర్ పంపించారు.ముసాయిదా బిల్లుపై 1949 ఫిబ్రవరి 11 నుంచి అదే ఏడాది డిసెంబర్ 14 వరకు చర్చ జరిగింది.

ఈ విప్లవాత్మక ముసాయిదా బిల్లును చూసి సంప్రదాయవాదులు గగ్గోలు పెట్టారు. కాంగ్రెస్ లోని నెహ్రూ వర్గం బిల్లుకు మద్దతు పలికితే మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. పార్లమెంటులో 1951 ఫిబ్రవరి 5న అంబేడ్కర్ బిల్లును ప్రవేశపెట్టారు. 1952 లోక్‌సభ ఎన్నికల తరువాత బిల్లును ఆమోదింపచేస్తానని అప్పటి ప్రధాని పండిట్ నెహ్రూ హామీ ఇచ్చారు. అయితే నెహ్రూ కేబినెట్‌లోని అనేక మంది మంత్రులు బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో మనస్తాపానికి గురైన అంబేడ్కర్ 1951 సెప్టెంబర్ తొమ్మిదిన కేంద్ర న్యాయ శాఖా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఆడవారి హక్కుల కోసం కేంద్ర మంత్రి వంటి పెద్ద పదవిని వదులుకున్న మహిళా పక్షపాతిగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు.
ఆ తరువాత జరిగిన పరిణామాల్లో 1955 56 మధ్య కాలంలో అంబేడ్కర్ రూపొందించిన హిందూ కోడ్ ముసాయిదా బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అయితే అంబేడ్కర్ బిల్లులో ఉన్న సీరియస్ నెస్‌ను కాస్తంత తగ్గించారు. బిల్లును మొత్తం నాలుగు చట్టాలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ (1955), హిందూ సక్సెషన్ యాక్ట్ (1956), హిందూ అడాష్టన్, మెయింటెనెన్స్ యాక్ట్ (1956), హిందూ మైనారిటీ, గార్డియన్ షిప్ యాక్ట్ (1956) విభజించి పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

హక్కులంటే కేవలం మగవాళ్లకే ఉండాలి అనే మైండ్ సెట్ నుంచి మహిళలకు కూడా హక్కులుంటాయి అనే స్థితికి సమాజాన్ని తీసుకు వచ్చిన దార్శనికుడు అంబేడ్కర్. మగవాళ్లతో సమానంగా చూడాలని రాజ్యాం గం, చట్టాలు ఎన్ని చెప్పినా ఆడవాళ్లపై అత్యాచారాలు తగ్గడం లేదు. అమ్మాయిలకు భద్రతపై జాగ్రత్తలు చెప్పడమే కాదు అబ్బాయిలకు ఆడవాళ్లను గౌరవించడాన్ని నేర్పించాల్సిన పరిస్థితులు వచ్చాయి. మహిళల రక్షణకు రాజ్యాంగం పూచీకత్తుగా నిలిచినా, మారుతున్న కాలానికి తగ్గట్టు ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా ఏదో ఒక రూపంలో కనిపించని వివక్ష కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా పల్లెల్లో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే బయటకు వస్తున్నవి కేవలం కొన్నే. వెలుగు చూడని దారుణాలు ఎన్నెన్నో పరువు పోతుందన్న కారణంతో కొందరు, సొసైటీలో చులకన అవుతామన్న భయంతో మరికొందరు ఇలా దారుణాలకు గురైనా బయటకు కూడా చెప్పుకోవడం లేదు. కొన్ని కేసులు కోర్టుల వరకు వెళ్లినా చట్టాల్లోని లోపాలను సాకుగా చేసుకుని నిందితులు తప్పించుకుంటున్నారు.

అసలు చట్టాల అమల్లోనే చిత్తశుద్ధి ఉండటం లేదు. మొత్తం మీద అసలు కేసుల నమోదు నుంచి విచారణ వరకు అన్ని స్థాయిల్లో లోపాలు జరుగుతున్నాయి. దారుణాలకు పాల్పడ్డ వారు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. మహిళలు ఎంతగా ప్రగతి సాధించారనే దాన్ని బట్టే ఒక సమాజం ఏ మేరకు అభివృద్ధి చెందిందనే అంశాన్ని నేను అంచనా వేస్తా. మహిళల అభివృద్ధే దేశ ప్రగతికి కొలమానం అని నమ్ముతానని బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. జనాభాలో 50 శాతం ఉందే మహిళలను ఆకాశంలో సగం అంటున్నాం.

అయితే ఇది కేవలం మాటలకే పరిమితమవుతోంది. ఆకాశంలో సగం అంటున్నామే కానీ ఆ స్థాయిలో అవకాశాలను, అధికారాలను ఇవ్వడం లేదు. అనేక రంగాల్లో మహిళలు ఇంకా సాధికారితను సాధించాల్సి ఉంది. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ మహిళలు స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండటమే సాధికారత. మహిళా సాధికారత అనేది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది. స్త్రీ, పురుష సమానత్వాన్ని ఆమోదించడం. మహిళల సంపూర్ణ అభివృద్ధిని వాళ్ల హక్కుగా గుర్తించడం. ఈ మహిళా సాధికారత కోసం రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్‌ను అంబేడ్కర్ పొందుపరిచారు. మహిళల పట్ల వివక్షను అంతం చేస్తూ రూపొందించిందే ఆర్టికల్ 15(3). అలాగే ఆడ, మగ అనే వివక్ష లేకుండా అందరూ జీవనోపాధి పద్ధతులను కలిగి ఉండటానికి 39 (ఎ) ఆర్టికల్‌ను ప్రవేశపెట్టారు. మన దేశంలో చాలా కాలం పాటు ఒకే పనిని ఆడ, మగ ఇద్దరూ చేసినా వేతనం విషయంలో వివక్ష ఉండేది. మగవాళ్లకు ఎక్కువ వేతనం, ఆడవారికి తక్కువ వేతనం ఇచ్చేవాళ్లు. ఈ దుర్మార్గానికి అంతం పలికారు అంబేడ్కర్. సమాన పనికి సమానం వేతనం ఇచ్చే ఆర్టికల్ 39 (డి) ను రూపొందించారు. మగవాళ్లతో పోలిస్తే మహిళలు తక్కువ అనే మైండ్ సెట్‌కు అనుగుణంగా అప్పట్లో అనేక దురాచారాలు ఉండేవి.

ఇలా ఏ రూపంలోనైనా మహిళల గౌరవాన్ని తగ్గించే పాత కాలపు ఆచారాలను చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఆర్టికల్ 51 (ఎ) (ఇ)ను రాజ్యాంగంలో అంబేడ్కర్ ప్రవేశపెట్టారు. తమ వ్యక్తిగత చట్టాలలో కానీ, ఏ ఇతర చట్టాలలో గానీ జోక్యం చేసుకోవద్దని చెప్పే హక్కు పార్లమెంట్‌కు లేదనే వాదన కరెక్ట్ కాదు. ఈ విషయం నేను సభకు నిర్ధారించి చెప్పదలుచుకున్నాను. ఈ పార్లమెంట్ అన్ని విధాల సుప్రీం. ఏ మత సముదాయానికి సంబంధించి అయినా వారి మతానికి సంబంధించే కాక, వారి వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన ఏ విషయాల్లోనైనా మనం జోక్యం చేసుకుంటామని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 1949లో హిందూ కోడ్ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి కామెంట్ చేశారు. కుటుంబ వ్యవస్థలో స్త్రీలకు కొన్ని హక్కులు కల్పిస్తూ తాను తయారు చేసిన హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడానికి శతవిధాల ప్రయత్నించారు అంబేడ్కర్. సంప్రదాయ ఛాందసుల కుట్ర వల్ల ఈ బిల్లు ఆమోదం పొందలేదు. దీనికి నిరసనగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్త్రీల హక్కులపై తన నిబద్ధ్దతను చాటుకున్న ధీశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News