Friday, December 27, 2024

భూతాపం తగ్గించడంలో తిమింగలాల పాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భూతాపం తగ్గడానికి తిమింగలాలు దోహదపడతాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. తిమింగలాలు కర్బన వాయువుల్ని పీల్చుకుని వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి నుంచి వెలువడే బొగ్గుపులుసు వాయువులను సముద్రాలు పీల్చుకుంటున్నందున నీరు వెడెక్కుతోంది. పర్యవసానంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. రుతుపవనాల తీరు మారుతోంది. కానీ తిమింగలాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల కర్బనాన్ని తిమింగలాలు గ్రహించాయని పరిశోధనలో తేలింది. సముద్రం అడుగుపడిన తిమింగలాల కళేబరాలు కూడా కొన్ని వేల టన్నుల కర్బనాన్ని గ్రహిస్తున్నాయని బయటపడింది.

అందుకని తిమింగలాల ప్రాముఖ్యత ఇప్పుడు ప్రధానంగా శాస్త్రీయంగా తెరపైకి వస్తోంది. తిమింగలాల లక్షణాలు చాలావరకు మనుషుల లక్షణాలను పోలి ఉంటాయి. మనిషి తర్వాత ఎక్కువ కాలం జీవించే తిమింగలాలు 40ఏళ్లకు పునరుత్పత్తి శక్తిని కోల్పోతాయి. ఇవి క్షీరదాలు, బిడ్డల్ని కని పాలిచ్చి పెంచుతాయి. కొన్ని నెలల పాటు బిడ్డల సంరక్షణకే అంకితమవుతుంటాయి. 50-60 ఏళ్ల వయసులో మోనోపాజ్‌కు గురవుతాయి. మాంసం కోసం తిమింగలాలు వేటకు బలవుతున్నాయి. వందేళ్ల క్రితం అంటార్కిటిక్ నీలి తిమింగలాలు రెండున్నర లక్షల దాకా ఉంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద మూడు వేల కన్నా ఎక్కువ లేవు. అందుకని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించారు. ఏటా 1500 వరకు తిమింగలాలు చనిపోతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి వీటిని సంరక్షించాలన్న లక్షంతో ఏటా ఫిబ్రవరి మూడో ఆది వారాన్ని వరల్డ్ వేల్ డేగా పరిగణిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News